ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సీనియర్ ఎన్టీఆర్ అల్లుడు, రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ తో కలిసి భేటీ అయ్యారు. ఈ భేటీలో విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. లోటస్ పాండ్ లో సమావేశమైన వీరు సుమారు గంటసేపు పలు అంశాలపై చర్చించుకున్నారు.
ఈ భేటీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా భేటీలో చర్చకు వచ్చిన పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పురంధేశ్వరి పార్టీలో చేరతారా లేదా అనే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు. అధికార ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
వైసీపీతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించాలని నిర్ణయించుకున్నామని, అందుకే జగన్ ని కలిసినట్టు దగ్గుబాటి తెలిపారు. తమ నిర్ణయంపై జగన్ కూడా సంతోషం వ్యక్తం చేశారన్నారు. అసెంబ్లీ టికెట్ కోసమే వచ్చారా అని మీడియా ప్రశ్నించగా పార్టీ విదివిధానాల ప్రకారమే టికెట్ కేటాయిస్తారని, పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని అన్నారు.
జగన్ పై ఎన్నో పుకార్లు సృష్టించారని, కానీ ఆయన్ని కలిశాక అవన్నీ అవాస్తవమని రుజువైందన్నారు. రెండు సంవత్సరాల నుండి జగన్ ని గమనిస్తున్నామని, ఆయన ఎంతో కష్టపడుతున్నారని అభినందించారు. ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో తెలుసని, ఆయన పార్టీ నడుపుతున్న తీరు అభినందనీయం అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ఆయన శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని, వైసీపీ అధికారంలోకి రావాలని ఆశించారు.
ఏపీలో ప్రభుత్వపాలన గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజల డబ్బుతో అధికార ప్రభుత్వం సభలు ఏర్పాటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల్ని బస్సుల్లో సభలకు తీసుకు వస్తున్నారన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు ఈ సభల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు తమ విధులు వదిలేసి నెలలో పది రోజులు ఈ సభల కోసమే పని చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తన భార్య పురంధేశ్వరి బీజేపీలో ఉన్నమాట వాస్తవమేనని అన్నారు. ఒకే కుటుంబంలో ఉన్నంత మాత్రాన ఎవరి ఇష్టాలు వారివే అని, ఆమె పార్టీ మారారు అని స్పష్టం చేసారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. బీజేపీ పెద్దలు కూడా ఆమెను అదే పార్టీలో కొనసాగాలని సూచించినట్లు తెలిపారు. ఆమె బీజేపీలోనే ఉంటారని లేదా రాజకీయాలను విరమించుకుంటారని క్లారిటీ ఇచ్చారు దగ్గుబాటి. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కింద ఉంది చూడండి