70 వ గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోదండరాం తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేశారు. రాజ్యాంగబద్దంగా నడుచుకోవాల్సిన సంస్థలు దారి తప్పుతున్నాయన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
“తెలంగాణలో రాజ్యాంగబద్ద సంస్థలు ధర్మం తప్పుతున్నాయి. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్దంగా ఏం చేయాలో అది చేస్తే చాలని తామేం చేయాలో సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్ కు సంబంధించిన అంశాల్లో అడిగే హక్కు భారత పౌరుడిగా, పార్టీ అధినేతగా తమకుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం పై ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. అతడిని వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలి. ఉత్తమంగా పని చేశారని ఎన్నికల సంఘం అవార్డులు ఇవ్వడం చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్ధమవుతలేదు. అధికారులు తమ విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించాలి.
రాజ్యాంగం అంటే రాజకీయ విప్లవం రావడం, అది భవిష్యత్తు నిర్మాణానికి బ్లూ ప్రింటు. పాలకులేవరైనా సరే రాజ్యాంగ చట్రంలో నిలబడి పాలన చేయాలి. రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కొంత మంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ పరిపాలిస్తున్నారు. తమకు ఎదురు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఊయ్యాల ఊగి ఊగి అక్కడికే వస్తుంది. సముద్రపు అలలు ఎగిసిపడ్డా చివరకు ఒడ్డుకే చేరుకుంటాయి. అలాగే వారి పరిస్థితి కూడా మారుతుంది.” అని కోదండరాం వ్యాఖ్యానించారు.