సినీ నటి భానుప్రియపై సామర్లకోట పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు నమోదైంది. గురువారం జరిగిన ఈ ఘటన సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. భానుప్రియ తన కూతురిని నిర్బంధించి వేధింపులకు గురి చేస్తుందంటూ సామర్లకోట పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తన 14 ఏళ్ళ కుమార్తె సంధ్యను తెలిసినవారి ద్వారా భానుప్రియ ఇంట్లో పనికి పెట్టినట్లు ఆమె తెలిపింది. కాగా నటి సోదరుడు సంధ్యపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, తన కూతురిని ఇంటికి పంపించమని కోరినా పంపట్లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
సినీనటి భానుప్రియ తనపై వచ్చిన ఆరోపణలను మీడియా ఎదుట ఖండించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, ప్రభావతి చెప్పిందంతా అవాస్తవమని ఆమె పేర్కొన్నారు. సంధ్య వయసు 17 ఏళ్ళని, సుమారు సంవత్సరం నుండి తమ ఇంట్లో పని చేస్తోందని తెలిపారు. సంధ్య పనిలో చేరినప్పటి నుండి తమ ఇంట్లో విలువైన వస్తువులు, నగదు మాయమవుతూ వచ్చిందని, గమనించగా ఇదంతా సంధ్య పనే అని తెలుసుకున్నామని వివరించారు. లక్షన్నర నగదు, ఐపాడ్, నగలు వంటి వస్తువులు సంధ్య దొంగతనం చేసినదాని ఆరోపించారు. తమ ఇంట్లో దొంగిలించిన వస్తువులు పరామర్శించటానికి వచ్చే తల్లికి ఇచ్చి పంపేదాని అన్నారు.
సంధ్యను ఇదే విషయమై గట్టిగా నిలదీయగా నిజం ఒప్పుకుందని తెలిపారు. సంధ్య తల్లి ప్రభావతికి ఫోన్ చేసి విషయం చెప్పగా ఆమె తమ ఇంటికి వచ్చిందని అన్నారు. పోలీసు కేసు పెడతామని బెదిరించేసరికి పోలీసు కేసు పెట్టవద్దని, ఊరెళ్ళి వస్తువులు తీసుకువస్తానని వేడుకుందని చెప్పారు. అలా చెప్పి ఊరెళ్ళిన ప్రభావతి తమపై తప్పుడు కేసు పెట్టిందని వాపోయారు. ఇలా చేస్తుందని తాము ఊహించలేదని భానుప్రియ ఆవేదన వ్యక్తం చేసారు. సంధ్య తమ ఇంట్లోనే ఉందని కావాలంటే మీడియా ముందు తనతో నిజాలు చెప్పిస్తామని వెల్లడించారు.