భారతదేశంలోని నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. త్వరలోనే రైల్వే శాఖలో 2.50 లక్షల ఉద్యోగాల భర్తీ చేపడుతామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఇటీవల 1.50 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని వాటి భర్తీ ప్రక్రియ పూర్తి కాగానే 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
కేంద్రం ఇటీవల ప్రకటించిన అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ ను ఇందులో అమలు చేస్తామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో మరో లక్ష మంది రైల్వేలో రిటైర్ అవుతారని దీంతో వచ్చే రెండేళ్లలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పీయూష్ గోయల్ అన్నారు.
వచ్చే నెలలోనే తొలి విడత రైల్వే ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. మే నెలలో రెండో విడత భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఆగష్టు 2021 నాటికి మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గత ఏడాది 1.2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా 2.5 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రపంచలంలోనే అతి పొడవైన మరియు రద్దీ రైల్వే మార్గాల్లో భారతీయ రైల్వే కూడా ఉంది. ఒక రోజు సుమారుగా కోటి అరవై లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పది లక్షల టన్నుల వరకు సరుకు రవాణా అవుతుంది. ఇప్పటి వరకు భారత రైల్వేల్లో సుమారు 16 లక్షల మంది ఉద్యోగులున్నారు. వాణిజ్య పరంగా ప్రపంచంలోనే అధిక ఉద్యోగాలు ఇస్తున్న సంస్థగా భారత రైల్వే రికార్డు పొందింది.
ట్రేడ్ మెన్, ట్రాక్ మెన్, లైట్ మెన్, గేట్ మెన్, స్టేషన్ మాస్టర్, పైలెట్, లోకో పైలెట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ , సఫాయివాలా, ఇతరాత్ర కలుపుకొని దాదాపు 50 రకాల పోస్టులు రైల్వేలో ఖాళీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా రైల్వే లో ఖాళీల వల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే అధికారుల మీద రిమార్క్ వస్తే అప్పుడు జాబులు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు చేయలేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏదేమైనా దేశ వ్యాప్తంగా భారీ ఉద్యోగాలు భర్తీ చేయనుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.