తెలంగాణాలో ఎన్నికలు జరిగి, రిజల్ట్స్ వచ్చి టీఆరెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణ ఎన్నికలు మాత్రం చాలా హాట్ హాట్ గా జరిగాయి. అడుగడుగునా ట్విస్టులు ట్విస్టులు. అనుక్షణం ఉత్కంఠ. అప్పటివరకు టీఆరెస్ కు తిరుగులేదు అనుకుంటుండగా మహాకూటమి ఒక ఒరవడి సృష్టించింది. గులాబీ పార్టీ విజయ బావుటా ఎగరవేస్తుందా లేక హస్తం గుర్తు గెలుస్తుందా అని టెన్షన్ వాతావరణం మొదలైంది. కానీ అనూహ్య రీతిలో అత్యధిక మెజారిటీతో కారు దూసుకెళ్లింది. పింక్ పార్టీ గెలిచింది.
కానీ ఈ గెలుపుపై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. అందునా రేవంత్ ఓటమి ఆ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. ఎంతో ధీమాగా ఉన్న రేవంత్ రెడ్డి ఓటమి అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక రేవంత్ కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను అంటూ కొద్ది రోజులు మౌనం వహించారు. కాంగ్రెస్ శ్రేణులు తొలుత ఈవీఎం టాంపరింగ్ జరిగిందని విమర్శలు గుప్పించారు కానీ అనంతరం సైలెంట్ అయ్యారు.
ఇటీవలే ఈవీఎం టాంపరింగ్ అంశాన్ని మరోసారి లేవనెత్తారు కాంగ్రెస్ నేతలు. అయితే ఈసారి ఈవీఎం టాంపరింగ్ అంశంపై బలమైన పోరాటం మొదలెట్టారు. ఈ మేరకు ఇప్పటికే రేవంత్ రెడ్డి పట్నం నరేందర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు రేవంత్. మరోవైపు కాంగ్రెస్ మహిళా నాయకురాలు డీకే అరుణ కూడా ఈవీఎం టాంపరింగ్ పై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
గజ్వెల్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో సీఎం కేసీఆర్ పై పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కేసీఆర్ తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు ఉన్నాయని, కానీ ఆయన 2 క్రిమినల్ కేసులు మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్ లో చూపించారని శ్రీనివాస్ ఫిర్యాదు చేసారు. కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలని శ్రీనివాస్ ప్రధానంగా డిమాండ్ చేసారు. కాగా సోమవారం ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది.