గత కొంతకాలంగా వంగవీటి రాధా వ్యవహారం రాజకీయ వర్గాల్లో సెగలు రేపుతోంది. విజయవాడ సెంట్రల్ సీటుకై వచ్చిన విబేధాలు రాధా వైసీపీని వీడేలా చేశాయి. సెంట్రల్ సీటు కోసం రాధా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత నాలుగేళ్లుగా సెంట్రల్ లో పార్టీని బలపరిచేందుకు కృషి చేసారు. కానీ కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్ ఆ సీటును మల్లాది విష్ణుకు కేటాయించారు.
తన సొంత నియోజకవర్గంలో టికెట్ విషయంలో భంగపాటు కలగడంతో రాధా మనస్థాపానికి గురయ్యారు. కొన్ని నెలలుగా ఆ సీటు కోసం అనేక ప్రయత్నాలు చేసారు. అధిష్టానం వేరే సీటు కేటాయించింది. కానీ రాధా సెంట్రల్ టికెట్ కోసమే పట్టుబట్టారు. పార్టీ ముఖ్య నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేసారు. అయినప్పటికీ రాధా వెనక్కి తగ్గలేదు. ఇక జగన్ కూడా సెంట్రల్ సీటు విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదు. ఇక తీవ్ర అసంతృప్తికి గురైన రాధా వైసీపీకి రాజీనామా చేసారు. జనవరి నెలాఖరున టీడీపీ తీర్ధం కూడా పుచ్చుకోనున్నారు.
అయితే తన రాజీనామా తర్వాత గురువారం మీడియాతో సమావేశమయ్యారు రాధా. వైసీపీని వీడటంపై తన భావాలను వ్యక్తపరిచారు. రాజీనామా ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించారు. తన తండ్రి రంగాను హత్య చేయించింది టీడీపీ అని బలమైన ఆరోపణలు ఉన్నాయి. రాధా సైతం అనేక సందర్భాల్లో తన తండ్రి చావుకు కారణం టీడీపీ అంటూ బహిరంగంగానే ఆరోపించారు. వంగవీటి కుటుంబ సభ్యులు, రంగా అభిమానులు రంగా హత్యకు కారణం టీడీపీ అని, అందుకే ఆ పార్టీని కూడా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రాధా టీడీపీలో చేరడం సంచలనంగా మారింది. కాగా తాను టీడీపీలో చేరడంపై కూడా రాధా స్పందించారు. జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద చదవండి.
ఏ పరిస్థితుల్లో వైసీపీకి రాజీనామా చేయవలసి వచ్చిందో ప్రజలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మీడియా ఎదుటకు వచ్చాను. ప్రజా జీవితంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా మా తండ్రి ఆశయాలు నిలబెట్టేందుకు ముందుకు వెళ్ళాలి అనుకున్నాను. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యపడదని తెలిసింది. అందుకే పార్టీ నుండి బయటకు వచ్చాను. నేను వైసీపీలో చేరినప్పుడు నా తండ్రి ఆశయాలను వివరించగా వాటికి సహకరిస్తానని జగన్ చెప్పారు. నువ్వు నా సొంత తమ్ముడికంటే ఎక్కువ అన్నారు. సొంత తమ్ముడికంటే ఎక్కువ అని చెప్పిన నన్నే ఇలా చూస్తే ఇంకా ప్రజల్ని మీరు ఏవిధంగా చూస్తారు అంటూ జగన్ ని ప్రశ్నించారు. నా తండ్రి ఆశయ సాధన కోసం పార్టీలో అనేక ఇబ్బందులు పడుతూ, అవమానాలు భరిస్తూ, క్యారెక్టర్ ని తప్పుబట్టినా దిగమింగుకుని పార్టీలో కొనసాగాను అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. వైసీపీలో నాకు జరిగిన అవమానాలు ఎవరికీ జరగకూడదు అని రాధా ఆశించారు.
నా తండ్రి విగ్రహ ఆవిష్కరణకు కూడా లోకల్ ఇంచార్జ్ కి చెప్పకుండా వెళ్లానని నన్ను తప్పు చేసావంటూ నిందించారు. ఇది నా పార్టీ, నా పార్టీలో నీ ఇష్టం వచ్చినట్టు ఎలా చేస్తావు? కేవలం తండ్రి లేని వాడివని నిన్ను పార్టీలో చేర్చుకుని గుప్పెట్లో పెట్టుకున్నాను. ఒక్కసారి గుప్పెట్లో నుండి వదిలేస్తే ఏమైపోతావో అంటూ జగన్ పదే పదే మాట్లాడుతుంటే చాల బాధ కలిగింది అంటూ దుఃఖించారు. ప్రజలు మా మీద జాలి చూపించట్లేదు, అభిమానిస్తున్నారు. అందుకే మా తండ్రి చనిపోయి ముప్పయేళ్ళైనా ప్రజాజీవితంలో ఉన్నాము అన్నారు.
గత కొంతకాలంగా వైసీపీ అభిమానులు రకరకాల మాధ్యమాల ద్వారా నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. నేను చావుకి భయపడట్లేదు. నా ఏకైక లక్ష్యం నా తండ్రి ఆశయ సాధనం. మీకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కానీ నాకు ఆంధ్రా పోలీసుల మీద నమ్మకం ఉంది. నాపై బెదిరింపులకు పాల్పడుతున్నవారి మీద ఆంధ్ర పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఎవరు చేయిస్తున్నారో బయటపెట్టగలం. కానీ మీరు మేము కాదంటూ వేరొకరిని బలి చేయగల సమర్థులు అందుకే కంప్లైంట్ చేయడం లేదు.
వంగవీటి రంగని హత్య చేయించింది టీడీపీ పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు. కానీ పార్టీ కాదు. ఆ వ్యక్తులు ఎవరో కూడా అందరికి తెలుసు. చనిపోయిన వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వంగవీటి రంగా అనే వ్యక్తి ఒక వ్యవస్థ. ఆయన ఆశయాలు సాధించటానికి, ప్రజలకు సేవ చేయటానికి మీలాంటి వ్యక్తులు పార్టీకి ఎంతో అవసరం అని సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు అని తెలిపారు. నా తండ్రి ఆశయాలు సాధించటానికి ఆ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు రాధా.