విశ్వహిందూ పరిషత్ బీజేపీకి షాక్ ఇచ్చింది. రామమందిర నిర్మాణాన్ని మేనిఫెస్టోలో పెడితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామని స్పష్టంచేసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న వీహెచ్‌పీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలోక్ కుమార్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమకు అన్ని దారులు మూసేసిందని, రామ మందిరాన్ని మేనిఫెస్టోలో చేర్చగలిగితే ఆ పార్టీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
రామమందిరంపై చట్టం తీసుకురావాలంటూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 31న వీహెచ్‌పీ ధర్మ సన్సద్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో అలోక్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా వీహెచ్‌పీ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. అయోధ్య కేసును సుప్రీంకోర్టులో అడ్డుకుంటోంది కాంగ్రెస్ ఎంపీలేనని గుర్తుచేశారు. రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.