బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో శనివారం కోలకతాలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభకు బిజెపి వ్యతిరేక ప్రతి పక్షాల నేతలు పలువురు హాజరయ్యారు. ప్రధాని మోదీ ఆట కట్టించాలంటే భిన్నాభిప్రాయాలు పక్కన బెట్టి అందరూ ఏకం కావాలని ఉపన్యాసాలు ఇచ్చారు. సభికులు కూడా బాగా స్పందించారు.అయితే
సత్యమునే పలక వలెను. అబద్ధం చెప్పరాదు-అని సులభంగా వల్లె వేసినా ఆచరణకు వచ్చే సరికి ఎదురయ్యే చిక్కు ప్రతి ఒక్కరికీ తెలుసు. కోలకతా సభలో అందరూ ఐక్యతా రాగం పాడినా ప్రతి పక్షాల నుండి ప్రధాని పదవి ఆశించే రాహుల్ గాంధీ మాయావతి ఇద్దరూ గైరు హాజరైనారు.ఈ పరిణామంతో దేశంలో వున్న భౌతిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరిశీలించితే ప్రధాని అభ్యర్థి ఎంపిక వచ్చే సరికి నేతల ఐక్యతా రాగం జీర బోయే అవకాశం వుంది.
మమత మమకారం
ప్రధాని పదవి పై కన్నేసిన మమత బెనర్జీ తన శక్తి యుక్తులు అన్నీ మొహరించి భారీ బహిరంగ సభ నిర్వహించి తన బలాన్ని చూపేందుకు ప్రతిపక్ష పార్టీనేతలను అందరినీ ఆహ్వానించింది. అందరూ వచ్చారు. గాని మమత బెనర్జీ లాగా ప్రధాని పదవిపై కన్ను వేసిన ఇరువురు ముఖం చాటేశారు. బిజెపి వ్యతిరేక కూటమికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసేందుకు తమ ప్రతి నిధులను పంపి చేతులు దులుపుకున్నారు.
ఒకవేళ మాయావతి ప్రధాని పదవి కాంక్షించి అదే ఉద్దేశంతో మమత బెనర్జీ జరిపిన సభకు గైరు హాజరు కావడం ఒక మేరకు అంగీకరించినా కాంగ్రెస్ పార్టీని బిజెపితో సమానంగా తిట్టి పోసిన అఖిలేశ్ యాదవ్ బిజెపి వ్యతిరేక వేదిక అంటూ కాంగ్రెస్ నేతల సరసన ఒకే వేదికపై పాలు పంచు కోవడం ఇది ఏరకమైన ఐక్యతా రాగం?ఎంత అవకాశ వాదం? రాహుల్ గాంధీ ఈ సభకు రాక పోవడం ఇది కూడా ఒక కారణమేమో?కడుపులో కత్తులు పెట్టుకొని తియ్యగా మాట్లాడటం రాజకీయాల్లోనే చెల్లుతుంది.
మలుపు తిప్పిన యుపి పొత్తు
ఎన్నికలు సమీపించే సమయానికి సమీకరణలు ఏ విధంగా రూపు దిద్దు కొంటాయో ఏమో గాని యుపిలో కాంగ్రెస్ ను దూరంగా పెట్టి అఖిలేశ్ మాయావతి బిజెపికి వ్యతిరేకంగా సాగించే పోరాటం ఎపిలో ఇంకా ఫైనల్ గాని టిడిపి కాంగ్రెస్ పొత్తు ఇదే విధంగా కొనసాగితే దేశం మొత్తం మీద బిజెపి వ్యతిరేక కూటమి ఉపన్యాసాలకే పరిమితమౌతుందేమో.
రాష్ట్రాలలో గాని కేంద్రంలో గాని ఎక్కువ సందర్భాలలో ప్రతి పక్షాల అనైక్యత బలహీనతలు అధికార పక్షానికి వరంగా మిగులు తుంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి పక్షాలకు బలంగా చేకూర్చు తుంది. . రేపటి ఎన్నికల్లో ఏది పైచేయి అవుతుందో చూద్దాం.
ఇందులో మరో పెను ప్రమాదం పొంచి వుంది. ప్రధాని పదవిపై మోజులో వుండే నేతను గాని పార్టీని గాని ప్రధాని పదవి ఆశించే మరో నేత దెబ్బ దీసే అవకాశాలు లేక పోలేదు. ఆలా జరుగుతుందని ఇప్పుడే చెప్పడం సరికాదు. గాని యుపి పరిణామాలు మాత్రం అందుకు అనువుగా వున్నాయి. అదే జరిగితే బిజెపి రొట్టె విరిగి నేతిలో పడినట్లే.
ఈ చిక్కులను దృష్టిలో పెట్టుకొనే వామపక్షాలు తొలి నుండి ఒక సూచన చేసినా చాల మందికి రుచించ లేదు. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఎక్కడి కక్కడ బిజెపి కి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోరాడాలని ఎన్నికల తర్వాత కేంద్ర స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలని చెప్పినా పలువురికి తలకెక్క లేదు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్జంట్ గా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చూపించవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధాని అయిపోయి నట్లు ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేసి నట్లు రాష్ట్ర ప్రజలకు చూపించాలసిన అవసరం
వుంది. అయితే యుపి పరిణామాలు అంతా తలకిందులు చేశాయి.
సంకీర్ణాల భవిష్యత్తు గాలిలో దీపమే
దేశంలో కాంగ్రెస్ గుత్తాధిపత్యం ముగిన తదుపరి కేంద్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు అటు బిజెపి ఇటు కాంగ్రెస్ మద్దతు లేకుండా ఇంతవరకు ఏర్పాటు జరగలేదు. బహుశా ఇక మీదట కూడా జరగే అవకాశాలు వుండవు.
ఎందుకంటే పార్లమెంటు మొత్తం సభ్యుల సంఖ్య 543. బిజెపి కాంగ్రెస్ పార్టీలకు 272 స్థానాల కన్నా తక్కువ వచ్చినపుడు మాత్రమే ప్రాంతీయ పార్టీలు ఒక కూటమి గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ గలవు. ప్రస్తుత పరిస్థితుల్లో అది అత్యాశ మాత్రమే. ఇప్పటి వరకు ఈ భ్రమలో కెసిఆర్ వుండగా తాజాగా అఖిలేశ్ మాయావతి కూడా చేశారు. ఒక వేపు బిజెపి ని ఖచ్చితంగా వ్యతిరేకించుతూ అదే సమయంలో కాంగ్రెసు ను బిజెపి కన్నా ఎక్కువ గా తిట్టి పోసి రేపు ఒక వేళ 80
స్థానాలకు 60 లేక 70 స్థానాలు కైవశం చేసుకున్నాఎవరి సహాయం తీసుకుని మాయావతి ప్రధాని పదవి చేపట్ట గలదు.? మాయావతి కి ఆ అవకాశం వస్తే నేడు తిట్టి పోసిన ఈ రెండు పార్టీలలో దేనితో నైనా అవకాశ వాదంతో వ్యవహారించ వలసి వుంటుంది..
మమత పరిస్థితి అధ్వానం
మున్ముందు మమత బెనర్జీ పరిస్థితి మరీ అధ్వానం. అఖిలేశ్ మాయావతి జట్టు కొంత మెరుగు. మమత బెనర్జీ కి ఎంత గింజు కున్నా పాతిక స్థానాలకు మించి వచ్చే అవకాశం లేదు. పైగా బెంగాల్ లో కాంగ్రెస్ నేతలతో ఆమెకు పడదు. వారి సూచనల ప్రకారమే కోలకతా సభకు రాహుల్ గాంధీ గైరు హాజరు అయ్యారని వార్తలు వచ్చాయి. నేడు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో విర్రవీగు తున్న ప్రాంతీయ పార్టీల నేతలు ఎన్నికల తర్వాత అటు బిజెపి ఇటు కాంగ్రెస్ మద్దతుతోనే ప్రధాని పదవి చేపట్ట వలసి వుంది.
అయితే రాష్ట్రాలకే పరిమితం అయిన నేతలే ఎన్నెన్నో ఆశలు ఊహలతో కలలు గని విన్యాసాలు చేస్తుంటే ఏళ్ల చరిత్ర గల జాతీయ పార్టీలు ఇంకా ఎక్కువ ఆశించు తాయి. 1989లో బిజెపి వామపక్ష పార్టీల మద్దతుతో విపి సింగ్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ఒక దశలో బిజెపి మద్దతు ఉపసంహరించు కోవడంతో 1990 లోనే రాజీనామా చేయ వలసి వచ్చింది. తిరిగి యంగ్ టర్కుగా ప్రసిద్ధి కెక్కిన చంద్ర శేఖర్ కాంగ్రెస్ వామపక్షాల మద్దతు తో ప్రధాని పదవి పొంది కాంగ్రెస్ వెనక్కి తగ్గడంలో కాలం చెల్లింది. ఈ లిస్ట్ లో చాల మంది వున్నారు. దేవ గౌడ గుజరాల్ వున్నారు. వీరంతా ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతుతో ప్రధాని పదవి చేపట్టడం తుదకు ఆ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలతో మద్దతు ఉపసంహరించడంతో కథ విషాదాతం కావడం మామూలు అయింది.
స్థిర మైన ప్రభుత్వం అవసరం
రేపు ఎన్నికలకు తర్వాత వుండే పరిణామాలలో మంచి జరిగినా చెడు జరిగినా జాతీయ పార్టీలలో ఏదైనా ఒకటి పూర్తి మెజారిటీ సంపాదించితే అయిదు ఏళ్లు అధికారంలో వుంటుంది. ఆలా కాకుండా ప్రాంతీయ పార్టీల మద్దతుతో జాతీయ పార్టీలు లేదా జాతీయ పార్టీల మద్దతుతో ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసితే అయిదు ఏళ్లు అధికారంలో వుండలేవు. పైగా దేశంలో అభివృద్ధి పథకాల అమలు మందగించే అవకాశం వుంది. అంతర్జాతీయంగా ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురి కావచ్చు.
ఈ దేశానికి ప్రధాని మోదీ విధానాలు ముప్పుగా తయారైనందున కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వ మారాలని కోరుకోవడం తప్పు పట్టలేము. గాని అదే సమయంలో దేశం పదే పదే ఎన్నికలకు వెళ్లడం ఏవరికి మంచిది కాదు. నేడు దేశ రాజకీయాలు కూడలిలో అనిశ్చిత స్థితిలో వున్నాయి. తుదకు ఏ మలుపు తీసుకున్నా ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వం అయిదు ఏళ్లు అధికారంలో వుండాలని కోరు కుందాం. (ఫీచర్ ఫోటో మమతా బెనర్జీ ట్విట్టర్ పేజ్ నుంచి)
(వి.శంకరయ్య, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)