ఆమె ప్రభుత్వ ఆఫీసులో అటెండర్. ఆయన వీఆర్వో. ఆయన కన్ను ఆమె పై పడింది. దీంతో ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిని గమనించిన ఆమె ఏకంగా జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించిన ఆమెకు న్యాయం జరుగలేదు. దీంతో దిక్కులేని స్థితిలో మీడియాను ఆశ్రయించింది. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు ఏపీ సీఎం చంద్రబాబు స్వంత నియోజకవర్గమైన కుప్పం మండల కేంద్రంలో. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో భవ్య అనే మహిళ అటెండర్ గా పనిచేస్తోంది. అయితే అక్కడే వీఆర్ఏగా పనిచేస్తున్న ఆనంద్ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అయితే భవ్య లొంగకపోవడంతో ఆమె ఫోన్ ను దొంగిలించాడు. అందులో రెవిన్యూ ఇన్ స్పెక్టర్, ఎమ్మార్వోలతో ఆమె ఆఫీసులో ఉన్నప్పుడు తీసిన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చాడు. వీటిని జిల్లాలోని ఉన్నతాధికారులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టాడు.
దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు చివరికి జిల్లా కలెక్టర్, పోలీసులను ఆశ్రయించింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. కాగా, ముఖ్యమంత్రి ఇలాఖాలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంపై ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.