చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. సర్పంచ్ ఎన్నికలు ఉండడం వల్ల అన్ని మండలాల్లో తిరుగుతూ నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ కార్యకర్తలు, ప్రజల్లో రేవంత్ రెడ్డి ఉత్తేజం నింపారు. కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లోని గ్రామాలలో రేవంత్ రెడ్డి పర్యటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి ప్రజలకు, పార్టీకి దూరంగా ఉన్నారు. నియోజకవర్గానికి కూడా ఆయన రెండు మూడు సార్లు మాత్రమే వచ్చి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమిపాలు కావడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి పాలైంది. దీంతో రేవంత్ రెడ్డి ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. దీంతో అంతా రేవంత్ రెడ్డి గురించి చర్చించుకున్నారు.
ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలతో పాటు మరో రెండు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో రేవంత్ రెడ్డి ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల పై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో అధిక స్థానాలు గెలుచుకొని మళ్లీ తన బలం చాటాలని రేవంత్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మీడియాకు దూరంగా ఉన్నా లోలోపల తన కార్యాచరణ చేస్తున్నట్టగా తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి మళ్లీ ఫాంలోకి వచ్చారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.