(సలీం బాష)
కథానాయకుడు సినిమా మొదటి భాగం చూసిన వాళ్లకి చర్చించుకోవటానికి ఏమీ లేక పోవటం వల్ల ఎన్టీయార్ బయోపిక్ అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్టీయార్ సినిమాలు చూసేది 3 గంటలే అయినా, చర్చించేది 3 రోజులు. మరి బయోపిక్ కు ఎన్ని రోజులు?!
అలాంటి ఎన్టీయార్ లాంటి నటుడి గురించి సినిమా తీయటం చాలా కష్టం. అప్పటికే “మహానటి” ప్రేక్షకుల పై ఒక ముద్ర వేసింది. దాంతో క్రిష్-బాలకృష్ణ జంటకు మొదట్లోనే చాలా ఒత్తిడి ఉండి ఉండవచ్చు. ఎన్టీయార్ సినిమా పై అభిమాన ప్రేక్షకులకు( ఉన్న అంచనాలు ఎలాగూ ఉన్నాయి. ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో కథానాయకుడిని తీయటం కత్తిమీద సామే! ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు కలిసి సాహసంతో తీసిన ఎన్టీయార్ జీవిత పుస్తకం అభినందించదగ్గ స్థాయిలో మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాను తీవ్రమైన నిశిత దృష్టితో చుస్తే మాత్రం ఎన్టీయార్ లాంటి మేరు పర్వతాన్ని చిన్న అద్దంలో చూపినట్లనిపించవచ్చు. అలా కాకుండా చూస్తే క్రిష్-బాలకృష్ణ కష్టాన్ని పెద్ద మనసుతో అభినందించాలి.
***
నిన్న కథానాయకుడు సినిమా చూసిన తర్వాత ఒక్కసారిగా అర్థ శతాబ్దం వెనక్కి వెళ్లిపోయాను. సినిమా సంగతి అలా ఉంచితే అప్పట్లో ఎన్టీఆర్ మాకు ఒక కథానాయకుడు. విడుదలైన ప్రతి ఎన్టీఆర్ సినిమాను తప్పకుండా చూసేవాళ్ళం. మా ఎన్టీఆర్ ఆలీబాబా 40 దొంగలు, అగ్గి వీరుడు, గోపాలుడు భూపాలుడు,అగ్గిపిడుగు,కదలడు వదలడు. ఏది వదలకుండా చూశాం. అప్పట్లో మా ఊర్లో బాగున్న థియేటర్లు తక్కువ. కర్నూల్ లో ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలు చాంద్ టాకీస్ లో, రాధకృష్ణ లో, సాయిబాబా లో వచ్చేవి. అడపాదడపా కొత్తగా కట్టిన నవరంగ్ లో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. మా ఊర్లో ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ భాగం శతదినోత్సవం జరుపుకున్న ది చాంద్ థియేటర్ లో నే. అప్పట్లో సినిమా చూడడానికి పదో రకు ఉంటే చాలు! అంటే పైసలు అన్నమాట!! ముఖ్యంగా చాంద్ టాకీస్ లో అయితే నేల టికెట్ అన్నమాట. అప్పట్లో నేల టిక్కెట్టు ధర కేవలం 41 పైసలు మాత్రమే! ఎప్పుడో రెండు మూడేళ్లకు ఉతికే కర్టెన్లు, బీడీలు, సిగరెట్ల వాసన, గోన పట్టాలు, ఇంటర్వెల్లో వచ్చే గోలీ సోడాలు, పల్లీలు. ఇవి సినిమా అంటే. నాకు అవి ఇంకా గుర్తున్నాయి. ఓ అర్ధరూపాయి ఉంటే చాలు మా ఎన్టీవోడి సినిమాలు చూసే వచ్చు. అలా 1966 నుండి ఒకటిన్నర దశాబ్దం పాటు ఎన్టీఆర్ సినిమాలు దాదాపుగా అన్ని చూసేసాను. సినిమాలు చూడడమే కాదు మళ్లీ అందరికీ కథ చెప్పేవాడిని. జానపద, సాంఘిక సినిమాలన్నీ చూశాను. అయితే కొన్ని పౌరాణికాలు మిస్ అయి ఉండొచ్చు. అంతే! ఎన్టీఆర్ 70వ దశకంలో మరోసారి అడవి రాముడు, యమగోల, వేటగాడు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అఫ్ కోర్స్ కొంతమంది ఏఎన్ఆర్ అభిమానులు కూడా ఉండేవాళ్ళు అనుకోండి, అయితే ఆ సంఖ్య చాలా తక్కువ. వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఎన్టీఆర్ వెండితెర రారాజు. తిరుగులేని మాస్ హీరో. ఏ రకమైన సినిమా అయినా సరే తన భుజాల మీద వేసుకుని విజయవంతం చేయగలిగే సత్తా ఉన్న నటుడు, కథానాయకుడు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంత స్టామినా, అంత స్టేచర్ ఉన్న నటుడు మరొకరు లేరు. అప్పట్లో ఏ బార్బర్ షాప్ లో చూసినా కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ క్యాలెండర్ లే కనబడేవి! అది ఎన్టీఆర్ పాపులారిటీ. సినిమాల్లో పల్లీలు, సోడాలు అమ్మి కూతురి పెళ్లి చేసిన సోడా రహిమాన్ అంటే చాంద్ టాకీస్ వెళ్లే వాళ్ళందరికీ సుపరిచితుడు. మా కాలనీ వాళ్లకి అప్పట్లో ఏకైక వినోదం నటుడు ఎన్టీఆర్ సినిమాలే! చూసేది 3 గంటలే అయినా.. చెప్పుకునేది, చర్చించేది 3 రోజులు మరి! అంత పాపులారిటీ ఉన్నవాడు కనకనే తన చరిష్మాతో స్థాపించిన తొమ్మిది నెలల రికార్డు సమయంలో పవర్ లోకి వచ్చిన నాయకుడు, కథానాయకుడు ఎన్టీఆర్!
ఎన్టీఆర్ సినిమాల్లో విజిల్ వేయటం కోసం మా స్కూల్ గ్రౌండ్ లో మేమంతా ప్రాక్టీస్ చేయటం ఇప్పటికి గుర్తుంది.
నేను ఎలాగోలా విజిల్ వేయటం నేర్చుకుని అగ్గీవీరుడు( నేనప్పుడు ఆరో తరగతి) సినిమాలో విజిల్ కొట్టాను. అయితే “నిప్పులాంటి మనిషి” టైం కు(పదో తరగతి మరి) విజిల్ బాగా వచ్చేసింది! అయితే తర్వాత మళ్ళీ ఎప్పుడు విజిల్ వెయ్యలేదు. నన్ను (ఇంకా చాలా మందిని) అంతగా ప్రభావితం చేసిన కథా నాయకుడు ఎన్టీఆర్!!
***
బయోపిక్ లతో ఒక చిక్కుంది. యథాతథంగా నిజాలు చూపిస్తూ కథ చెపితే, డాక్యుమెంటరీ అంటారు..కొంత నాటకీయత జోడిస్తే వాస్తవాలు చూపించలేదంటారు. ముందు నుయ్యి, వెనక గొయ్యి లాంటి పరిస్థితి! అయితే రెండింటి మధ్య బ్యాలన్స్ ఉంటే కొంతవరకు విజయం సాధించినట్లే! “కథానాయకుడు” అక్కడే కొంత తడబడిందని రూఢిగా చెప్పవచ్చు.
బయోపిక్ లు తీసేటప్పుడు వాస్తవాలు వక్రీకరించటం(ఎక్కువ స్థాయిలో) బావోదు. అలాగే పాత్రధారుల ఎంపిక. ఈ రెండు విషయాల్లో క్రిష్ జాగ్రత్తగా వహించటం కొంత ఊరట. ముఖ్యంగా వివిధ పాత్రధారుల ఎంపిక చాలా బావుంది. ఏఎన్నార్,(సుమంత్) హెచ్.ఎం.రెడ్డి,(కైకాల సత్యనారాయణ) బి.ఎం.రెడ్డి(ప్రకాష్ రాజ్) బావున్నారు.
చాలామంది ఈ సినిమాలో ఎన్టీయార్ ఎం చేసాడు, ఎలా ఉన్నాడు అని చూడ్డానికి వస్తారు. అక్కడ వారికి కొంత ఇబ్బంది కలగా వచ్చు. ఈ సినిమాలో తక్కువనిపించిన విషయం ఎమోషనల్ టచ్. చాలా సన్నివేశాల్లో బాలకృష్ణ తడబడ్డాడు. ముఖ్యంగా పెద్ద కొడుకు రామకృష్ణ చనిపోయిన సందర్భంలో. చాలా కీలకమైన సీన్ అది! అలాగే మరి కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ బాలేకపోవటమే కాకుండా సాగదీయటం వాళ్ళ సినిమాను, ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాయి. ఈ సినిమా పై ఉన్నా మరో ఆరోపణ మంచి మంచి సినిమాలు సన్నివేశాలు లేవని. అది వాస్తవం.
ఈ సినిమా కు వచ్చిన మరో సమస్య దీన్ని రెండు భాగాలుగా తీయటం. “ఇద్దరు”(ఎంజీయార్ బయోపిక్) లా ఒకే సినిమాగా తీస్తే బావుండేదేమో! ఇది రెండో భాగానికి కొంత ఇబ్బడి కలిగించవచ్చు. ఈ మొదటి భాగంలో మరో సమస్య దీని నిడివి. దాదాపు మూడు గంటల సినిమా (బయోపిక్ అయినా సరే) చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. సన్నివేశాలు సహజంగా కాకుండా అదే పనిగా చొప్పించినట్లుండటం మరో లోపం. పైగా అవి ఎన్టీయార్ మంచి సినిమాల్లోవి కాకపోవటం వల్ల మరింత వ్యతిరేకత వచ్చింది.
వాస్తవాలు, ప్రేక్షకుల అంచనాలు, “మహానటి” సినిమా, నిడివి, రెండో భాగం వంటి అనేక కష్టాలని ఎదుర్కొని తీసిన ఈ సినిమాలో ఆశాకిరణాలు కొన్ని(కొన్నే!) ఉన్నాయి. ఫోటోగ్రఫి, నేపథ్య సంగీతం, కళా దర్శకత్వం, ప్రకాష్ రాజ్, విద్యా బాలన్, సుమంత్, బుర్రా సాయి మాధవ్ సంభాషణలు, చాలా కొన్ని చోట్ల బాలయ్య నటన వంటివి ఆ కొన్నింటిలో కొన్ని!
ఈ సినిమాకు బలమూ, బలహీనత బాలకృష్ణే! ఎన్టీయార్ పాత్రను పోషించగలిగే నటుడు ఎవరున్నారు. బాలకృష్ణ తీవ్రమైన ఒత్తిడిలో ఉండటం సహజం. అక్కడే ఎక్కువ ఇబ్బంది వచ్చింది.పైగా ఎన్టీయార్ జీవితంలో పెద్దగా ఒడిదుడుకులు లేవు(సావిత్రి లా). ఈ సినిమాకు ప్రధాన అవరోధం ఇదే!
బయోపిక్ లు తీసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ ఈ సినిమా ఫస్టు క్లాసులో కాకుండా మాములు క్లాసులో పాస్ అయ్యిందంటే కొంతవరకు మేరు నగధీరుడైన కథానాయకుడు ఎన్టీయార్ కూడా ఒక కారణమే మరి!