తెలంగాణ కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి తేరుకోకముందే మరో దెబ్బ తగలనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీకి వీడేందుకు సిద్దమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వారిని టిఆర్ఎస్ లో చేర్చుకునేందుకు గులాబీ నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపారని తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి గెలిచిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో గులాబీ దళం ఇప్పటికే చర్చలు జరిపారని టిఆర్ఎస్ నేత ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఇప్పటి వరకు సీఎల్పీ నేతను ప్రకటించలేదు. టిఆర్ఎస్ మంత్రి వర్గ విస్తరణ కూడా చేపట్టకపోవడానికి కూడా కారణం చేరికలే అని తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ లో చేరితే ఆమెకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.
సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం కేటాయించాలని కోరగా కాంగ్రెస్ నుంచి టికెట్ లభించలేదు. ప్రస్తుతం చేవేళ్ల పార్లమెంటు స్థానం నుంచి సీటు ఆశిస్తున్నా అక్కడ మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించడం ఖాయమైంది. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ లో చేరాలని సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఎల్ బీ నగర్ నుంచి గెలిచిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా తన అనుచరులతో టిఆర్ఎస్ లో చేరితే ఎలా ఉంటుందని ఆరా తీసినట్ట సమాచారం. నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే టిఆర్ఎస్ లో చేరాల్సిందేనన్న అభిప్రాయంలో సుధీర్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. సుధీర్ రెడ్డితో కూడా టిఆర్ఎస్ నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ గెలుచుకున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలో కి తీసుకొని కాంగ్రెస్ ను జిల్లాలో మట్టి కరిపించాలని టిఆర్ఎస్ వ్యూహం వేసినట్టు తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి చేరిక లాంఛనమేనని సంక్రాంతి తర్వాత వారు చేరుతారని టిఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తెలంగాణ అంతటా కారు జోరు చూపిస్తే ఖమ్మం జిల్లాలో మాత్రం టిఆర్ ఎస్ చతికిలపడింది. దీంతో టిఆర్ఎస్ కూడా షాకయ్యింది. అయితే జరిగిన నష్టాన్ని ఎలాగైనా భరించాలని కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో ఖమ్మం జిల్లా కీలక నేతలు ఇప్పటికే చర్చలు జరిపారు. సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు కారులో చేరుతారని జోరుగా ప్రచారం కూడా సాగింది. కానీ వారు చేరటం లేదని తెలిపారు.
అయితే భద్రాచలం నుంచి గెలిచిన పోడెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది. ఈ ముగ్గురితో ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారని వారు కూడా చేరుతామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి కూడా టిఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తోంది. సురేందర్ తో టిఆర్ఎస్ నేతలు చర్చలు జరిపారని ఆయన చేరడం ఖాయమైందని టిఆర్ఎస్ వర్గాలు ధృవీకరించాయి.
టిఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలకు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ది కోసం నేతలు చేరే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ కీలక నేతలు రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే పార్టీ సీనియర్ నేతలు వారితో చర్చలు జరిపారని సమాచారం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండడంతో ఒక వేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎట్ల అనే డైలమాలో ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. అందుకే నేతలెవరు కూడా పార్టీ మారాలంటే ఆలోచిస్తున్నారని టిఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక అంత సులువు కాదని గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ రసవత్తర రాజకీయ పోరు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.