వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జనవరి తొమ్మిదిన ముగిసింది. ఇడుపులపాయ నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వేదికగా ఆయన పాదయాత్రకు ముగింపు పలికారు. పాదయాత్ర విజయానికి గుర్తుగా పార్టీ శ్రేణులు ఇచ్చాపురంలో భారీ స్థూపాన్ని నిర్మించారు. ఆ స్థూపాన్ని ఆవిష్కరించిన జగన్ ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కాగా జగన్ చేపట్టిన పాదయాత్రపై పలువురు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఈ సందర్భంగా జగన్ చేసిన పాదయాత్రపై ఆయన స్పందించారు. ఇంకొక్కరోజు జగన్ పాదయాత్ర చేసి ఉంటే టీడీపీకి వచ్చిన ప్రజాదరణ చూసి వెళ్లేవారు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో మనం పోరాడుతుంటే… మోదీ దగ్గర జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు.
కేసులకు భయపడి జగన్ ఒక్కసారి కూడా మోదీని ప్రశ్నించలేదని పేర్కొన్నారు. దేశంలో మోదీపై తిరగబడ్డ ఏకైక సీఎం చంద్రబాబునాయుడు అంటూ తమ నాయకుడిని కొనియాడారు. సరదాగా చేసే వాకింగ్ ని కూడా జగన్ పాదయాత్ర అంటూ ప్రచారం చేస్తున్నారని అవహేళన చేశారు రామ్మోహన్ నాయుడు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా జగన్ కు పట్టదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులు పాదయాత్ర, మూడు రోజులు కోర్టుయాత్ర చేసారంటూ ఘాటుగా విమర్శించారు. వైసీపీ నాయకులు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయి అని మాట్లాడారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.