సన్‌రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి ఓ వారం రోజులు ముందుగానే వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత అతి ఎక్కువ పెట్టుబడులు పెడుతూ, లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్న అదానీ గ్రూప్‌తో కీలక ఒప్పందం జరగడంతో పండగ వాతావరణం నెలకొంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి నారా లోకేష్ కృషితో అదానీ గ్రూప్ రూ. 70 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణహిత డేటా సెంటర్ పార్క్ ని విశాఖలో నెలకొల్పనున్నారు.
ఈ మేరకు బుధవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలోని ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్,అదాని గ్రూప్ ఛైర్మెన్ గౌతమ్ అదాని సమక్షంలో ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ,అదాని గ్రూప్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న అనేక పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు మంత్రి నారా లోకేష్. ఇప్పుడు మంత్రి లోకేష్ సాధించిన అతి పెద్ద విజయంగా అదానీ గ్రూప్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ పార్క్ నిలవనుంది.
ఇరవై ఏళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించే ఈ సెంటర్ కోసం అదానీ గ్రూప్ 70 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. విశాఖపట్నం లోని 500 ఎకరాల్లో మూడు ప్రాంతాల్లో 1 గిగా వాట్ డేటా సెంటర్ అదాని గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సూచనలతో మంత్రి లోకేష్ ఆలోచనలతో వివిధ పాలసీలు రూపొందించారు. ప్రతిష్టాత్మకమైన సంస్థలు తమ కంపెనీల కార్యకలాపాలు ఏపీలో ప్రారంభించేందుకు ఈ పాలసీలు ఊతమి చ్చాయి.
ఈ పాలసీలలో ఒకటైన క్లౌడ్ హబ్ పాలసీ అదానీ గ్రూప్ విశాఖ తరలివచ్చేందుకు దోహదపడింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితులు గురించి అదానీ గ్రూప్ ప్రతినిధులతో పలుదఫాలుగా భేటీ అయి మంత్రి నారా లోకేష్ వివరించారు. క్లౌడ్ హబ్ పాలసీ గురించి చెప్పి వారిని ఒప్పించగలిగారు. దీని ఫలితమే ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణహిత డేటా సెంటర్ పార్క్ ని విశాఖపట్నంలో అదానీ గ్రూప్ ఏర్పాటు చేయనుంది.
ఈ పార్క్ ఏర్పాటులో భాగంగా 5 గిగా వాట్స్ సోలార్ పార్క్ ని కూడా నెలకొల్పనున్నారు. ఈ డేటా సెంటర్ ని ఇంటర్నెట్ కేబుల్ లాండింగ్ స్టేషన్ తో అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించే కీలక కేంద్రంగా ఏపీ మారనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్ వేర్ సప్లయర్స్,సాఫ్ట్ వేర్ ,స్టార్ట్ అప్, టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మన దేశంలో డేటా సెంటర్లు
డేటా సెంటర్ల విషయంలో భారతదేశం చాలావరకూ వెనకబడి ఉంది. చెన్నై, ముంబైలలో మాత్రమే ఈ సెంటర్లున్నాయి. 2016 నాటికి దేశంలో డేటా సెంటర్ల రంగం అభివృద్ధి 160 బిలియన్ డాలర్లు కాగా,ఇది ప్రపంచంతో పోల్చితే 2 శాతమే. ప్రతి ఏడాది ఈ రంగం 20 శాతం పెరుగుదల సాధిస్తోంది. డేటా సెంటర్ల ఏర్పాటుతో దీనిపై ఆధార పడిన అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల వృద్ధి రేటు పెరుగుతుంది. మనదేశంలో డేటా రక్షణ, గోప్యతకి పటిష్టమైన చట్టాలు రూపొందించడంతో డేటా సెంటర్ల ఏర్పాటుకి పెద్ద ఎత్తున కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ల పార్క్ ఏర్పాటుకి అనువైన ప్రదేశం అని అదానీ కంపెనీని ఒప్పించడంలో మంత్రి నారా లోకేష్ విజయం సాధించారు.దీంతోపాటు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, అమలు చేస్తున్న పాలసీలు, కల్పిస్తున్న సౌకర్యాలు చూసి..తాము ఏర్పాటు చేయదలచిన అతి భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనువైనదని అదానీ గ్రూప్ భావించి..ఎంవోయూ చేసుకుంది.
డేటా సెంటర్ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్ తక్కువ ధరకే ఏపీలో అందుబాటులో ఉండటం, ఇంటర్నెట్ లాండింగ్ కేబుల్, మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో అదాని గ్రూప్..తమ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ని తొలి ఎంపికగా చేసుకుంది. తీరప్రాంతంలోని విశాఖకు అదానీ డేటా సెంటర్ పార్క్ నెలకొల్పనుండటంతో ఇది మన దేశానికే కాకుండా ఆగ్నేసియాకు ఈస్ట్ కోస్ట్ డేటా సెంటర్ హబ్ గా మారనుంది.
జిడిపి వృద్ధికి దోహదం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…
అదాని గ్రూప్ సారధ్యంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్ తో ఆంధ్రప్రదేశ్ దేశానికే డేటా సెంటర్ హబ్ గా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జిడిపి వృద్ధికి డేటా సెంటర్లు దోహదం చేయనున్నాయి.
క్లౌడ్ హబ్ పాలసీలో ఇచ్చే రాయితీలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ హబ్ పాలసీలో భాగంగా నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ సబ్సిడీలు ఇవ్వడం, కార్యకలాపాలు ప్రారంభించిన వెంటనే ఫైబర్ కనెక్టివిటీ యాక్సిస్ ఇవ్వడం, రాయితీలు,మౌలిక వసతులు కల్పించడం వంటివి చేస్తున్నారు. క్లౌడ్ హబ్ పాలసీ ద్వారానే అదానీ గ్రూప్ తన డేటా సెంటర్ పార్క్ ని ఏపీలో నెలకొల్పబోతోంది.ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రెటరీ విజయానంద్,అదాని గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు