ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర జనవరి తొమ్మిదితో ముగిసింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు వైసీపీ శ్రేణులు. ఈ సభలో జగన్ ప్రసంగిస్తూ పాదయాత్రలో ఎదురైన అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న హామీలను ప్రకటించారు. అంతేకాదు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు. అదెలా అంటారా అయితే చదవండి.
సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సభలో జగన్ అభ్యర్థుల్ని ప్రకటిస్తారంటూ గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ప్రముఖ మీడియా సంస్థల్లో కూడా దీనిపై ప్రచారం జరిగింది. ముఖ్యంగా జగన్ వ్యతిరేక మీడియా గా చెబుతున్న వాటిలో కూడా ప్రసారాలు సాగాయి.
సాధారణంగా అధికార పక్షం అభ్యర్థుల్ని ప్రకటించకుండా ప్రతిపక్షం ఎప్పుడూ అభ్యర్థుల్ని ప్రకటించిన దాఖలాలు లేవు. ఈ విషయంలో జగన్ కూడా మినహాయింపు ఏమీ కాదని తేలిపోయింది. కానీ ఈ విషయంలో ఇలా ప్రచారం సాగించి, నేతలతో ఒత్తిడి తెప్పించి ముందే అభ్యర్థుల్ని ప్రకటించేలా జగన్ ని కమిట్ చేయించడానికి ప్రత్యర్ధులు పన్నిన కుట్రగా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ జగన్ మాత్రం వ్యూహాత్మకంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు అంటున్నారు కొందరు కోస్తా నేతలు.
మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి తర్వాత తొలివిడత అభ్యర్థుల్ని ప్రకటించనున్నట్టు వెల్లడించారు, జగన్ జనవరి 9 న ప్రకటిస్తారు అనుకున్నారు కాబోలు. అందుకే వారిద్దరూ ప్రకటించాక తమ అభ్యర్థుల్ని ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. అయితే అందరు ఉహించినదానికి భిన్నంగా జగన్ అభ్యర్థుల ప్రకటన చేయకుండా ఆ రెండు పార్టీల అంచనాలను తలక్రిందులు చేశారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
మరి అభ్యర్థుల ప్రకటనను జగన్ ఎప్పుడు చేస్తారో అని ఆశావహులు టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే జగన్ సొంత పార్టీలోని ఆశావహులకు కూడా జగన్ షాక్ ఇచ్చారని పార్టీలో హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి.