తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కు గురయ్యారు. ఈ ఘటన నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనూ చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు, వీడియో కింద ఉన్నాయి.
కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలంలోని నిటూరు గ్రామపంచాయతీకి చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నది. బుధవారం విశ్వనాథ్ నామినేషన్ వేయాల్సి ఉంది. మొదటి విడతలో బుధవారమే నామినేషన్ కు చివరి రోజు కావడంతో మంగళవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో విశ్వనాథ్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
దీంతో కుటుంబసభ్యులతోపాటు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గ్రామ సర్పంచ్ అభ్యర్థి విశ్వనాథ్ కిడ్నాప్ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఆ గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కిడ్నాపైన బాధితుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు.
జరిగిన పరిణామాలపై వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణకు ఫోన్ లో ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. ఎలాగైనా తమ అభ్యర్థి కిడ్నాప్ చేసిన వారిని గుర్తించి శిక్షించాలని, నామినేషన్ వేసుకునేలా ఆయనను కిడ్నాప్ చెర నుంచి విడిపించాలని రేవంత్ రెడ్డి ఎస్పీని కోరారు.