వెంటాడే పాట
”భూలోక నాంచారి
విద్య నేర్పిన వాడా ఓరి వీరమల్లు
ఛల్” అంటూ సీనుగాడు పాటందుకుంటే సూడాలె. పల్లె పట్నానికి ఉత్తకాళ్లతో నడిచొస్తది. బడిలో బాలునిగా ఉన్నప్పటినుండే సీనుగాడు పాటగాడు. అందుకే సీనుగాని పేరు ‘సింగర్ సీనుగాడు’ అయ్యింది. వాడు పెరుగుతుంటే వాని పాటల మైదానం వాడిలాగే పెరుగుతూ, విస్తరిస్తూనే వచ్చింది.
జెండావందనం దగ్గరి నుండి ఛాయ్ హోటల్ పార్టీల దాకా సీనుగాని పాటలేనిదే లేదు. ఊరిలో అందరు పాటల సీనంటే, యూనివర్సిటీల మాత్రం ‘సింగర్ సీను’ పేరు స్థిరపడి పోయింది. దీంతో సీనుగానికి కొంచెం పేరు, గౌరవం కూడా పెరగనే పెరిగింది. ఏవేవో పాటలు పాడే సీనుగాడు మెల్లగా ఓ మంచి పాటగాడైండు. ఎవరో రాసిన పాటలు కాదు, తాను కూడా మెల్లగా అల్లడం నేర్చుకున్నాడు. అది వానికి పుట్టుకతోనే వచ్చిందని కొందరు, లేదు వాళ్ల అమ్మానాయిన వల్ల వచ్చిందని మరికొందరు వాదులాడుతుంటారు.
ఏది ఏమైనా సీనుగాడు మాత్రం కేవలం పాటగానిగా మాత్రమే కాదు. పాటలు రాసే ఒడుపు కూడా నేర్చుకున్న చిన్నపాటి వాగ్గేయకారుడయ్యాడు. ఇంకేమున్నది. చెయ్యి విరగేంత లేదుగాని, ఓ మాదిరిగా పాడి రాసే వాడయ్యాడు. దేని మీద రాయిమంటే దాని మీద రాయడం దాకా ఎదిగాడు. కానీ, మంది చెప్తే రాసుడు కాదు, తన మనసులో పుట్టిన ఆలోచన మీదే పాట రాయాలనుకున్నాడు. అంటే అచ్చంగా తనకు నచ్చిన పాటే రాయాలనుకున్నాడు. ఎవరో దేనికోసమే రాయిమంటే రాయడం వద్దు అనుకున్నాడు.
ఎందుకో తెలియదు. కొన్ని పాటలు రాసినంక సీనుగానికి ఉన్నట్టుండి వాళ్ల అయ్య మీద పాట రాయాలనే కోరిక పుట్టింది. నడిచీ నడిచి వెనక్కి తిరిగి చూసుకున్నట్టు ఈ కొత్త కోరిక పుట్టింది. పాట రాయడానికి సిద్ధమయ్యాడు. వారం రోజుల నుండి సీనుగానికి నాన్న పాట తప్ప మరో ధ్యాసలేదు. యూనివర్సిటీ హాస్టల్ల ఇనుప మంచం మీద నడుం వాల్చి కండ్లు మూసుకున్నాడు.
తండ్రిని తలుచుకుంటున్నాడు. అయినా తండ్రిని కొత్తగా తలుచుకోవడం ఏంది? తండ్రిని ఏ కొడుకైనా మరిచిపోతడా? ఏమో?! ఎందుకు మరిచిపోడు. తల్లిదండ్రులను అనాథలను చేసిన పిల్లల ముచ్చట్లు మనం ఎన్ని వింటలేం! సీనుగాడు ఆ బ్యాచ్ కాదు గాని, తండ్రి జీవితాన్ని పాటలో ఒదిగించడానికి తపిస్తున్నాడు. అయినా సీనుగాంది పిచ్చి ఆలోచన గాకపోతే, ఎక్కడైన కవితో, పాటో, కథో, ఆఖరికి నవలో ఏదైనా సరే అమ్మల మీదనే రాస్తారుగని, నాయిన మీద రాస్తారా? నూటికొక్కరు రాయొచ్చు. ఈ మాటంటే వాళ్లకు కోపం రావొచ్చు. కానీ, నిజం మాట్లాడుకుంటే నాయిన మాత్రం తెర వెనక మనిషే తప్ప, ఏనాడు వెలుగులో లేనోడే. అందుకే నాయిన మీద రాయాలని సీనుగాడు ఒకలాంటి పురిటినొప్పులు పడుతున్నాడు. ఇదే ఇప్పుడు సీనుగానికి కంటి మీద కునుకు లేకుంట చేసింది. ఎవ్వరూ రాయకపోయినా పర్వాలేదు. నాయిన మీదే రాయాల్సిందేనని పట్టుపట్టి పాట మీద మనసుపెట్టాడు.
”పాట రాస్త సరే! కానీ అది మా నాయినకే అంకితమియ్యాలా? లేకుంటే అందరి నాన్నలకా” అని ఒక పరేషాన్‌ల
పడ్డడు. అయినా అందరి నాన్నల లాంటి నాన్నే కదా మా నాన్న?! లేదు లేదు మా నాయిన అందరి నాన్నల లాంటి నాన్న కాదు. అందరి కంటే గొప్పోడు మా నాయిన” అని మనసుల గట్టిగ అనుకున్నాడు.
అందరికేమోగని సీనుకు మాత్రం వాళ్లయ్య లేకపోతే ఇంత ఫాలోయింగు లేనే లేదని చెప్పాలి. ఎందుకంటే సీను వాళ్ల అయ్యి కూడా పాటగాడే. అట్లాగని ఆయనేం సంగీతం నేర్పే గురువు కాదు. ఆ మాటకొస్తే, అచ్చరం ముక్కరాని వేలిముద్రగాడు. ఊరు కాదుపొమ్మన్న వెలివాడోడు. ఆ గాయాల మీదుగా జీవితాన్ని పాటగట్టి పాడిన బైరాగి. ఊరు నుండి వలసపోతూ పట్టుకొచ్చిన ఆస్తి కూడా పాటే. అందుకే సీనుగానికి కూడా పాటనే పంచిచ్చాడు.
ఇక సీనుగాని అమ్మ మాత్రం పాటలు పాడలేదా అంటే ఆమె కూడా పాటల ఊటసెలిమె. ఊళ్లె హోళీ పండుగకు ముందు పాడే కాముని పాటలకు టీం లీడరు సీనుగాని అమ్మే. ఆ పాటలకు పున్నమి నాటి వెన్నెల మరింత ముందే వచ్చేది. ఇక ఆ పాటల వరదకు తడిసి ముద్దయిన బుడ్డోడు ఈ సీనుగాడు. అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతూ ఇంటింటికి పోయి జాగ్రత్తగా గమనించేవాడు. సీను తల్లి ఆ యింటివాళ్ల పేర్లు పాటలో జతచేసి పాడే తీరు అందరినీ అబ్బుర పరిచేది.
ఇట్లా ఇద్దరు పాటగాళ్లకు పుట్టిన సీనుగాడు పాటగాడు గాక మరేమవుతాడు. ‘వరవ్వా నీ కొడుక్కు కూడా నీ కంఠమే వచ్చింది. వాడు పాడితే వాడవాడంతా ఖన్నుమంటున్నది తెలుసా’ అనే అమ్మలక్కల మాటలు సీనుతల్లికి ఆ పూటకు కడుపు నింపాయి. ‘ఈరన్న నీ కొడుకు నీలెక్కనే పెద్ద పాటగాడైతడే’ అంటే సీనును నాయిన చేత లోలోపలే మీసం మెలేసెటట్టు చేసేది. బయటికి మాత్రం ఒక నవ్వీనవ్వని నవ్వు, ముఖం మీద ఇంధ్రధనస్సై పూసేది. అటువంటి నాన్న మీద పాట రాయాలని ఈ వారం రోజులుగా ఆలోచిస్తుంటే, సీనుగానికి లోలోపల సుడులు తిరుగుతున్న జ్ఞాపకాలివి.
అదేంటో తండ్రి గురించి ఆలోచిస్తుంటే సీనుగానికి పాట కాదు, కన్నీళ్లే టపటపా రాలుతున్నాయి. ఎట్లా బతికినోడు నాన్న?! నలుగురు పిల్లలకు తిండి పెట్టాలంటే, ఉద్యోగం లేనోడు, తాతతండ్రుల ఆస్తులు లేనోడు ఎన్ని పనులు చేయాలి? ఎన్ని కష్టాలు. ఎన్ని కడగండ్లు. ఎన్ని కనిపించని కన్నీళ్లు. వాటన్నింటిని బయటికి కనిపించకుండా దాచుకున్న మౌన సముద్రం నాన్న అనుకున్నాడు సీను. అందుకే కావచ్చు. పిలిస్తే పలికినట్టుగా కన్నీళ్లు తన్నుకొస్తున్నాయి. అయినా సరే లావాను గుండెల్లో దాచుకున్న అగ్నిపర్వంతంలా, ఈ దు:ఖాన్ని దాచిపెట్టుకొని నాన్న మీద ఒక పాట రాయాలని తండ్లాడుతున్నాడు.
సీనుగానికి పాట రాసుడెట్లనో తెలుసు…పాట రాయలంటే బాణి కావాలి. అది భావానికి తగినదై ఉండాలి. వింటున్న వాళ్లను కట్టిపడేసే పదాల పొందిక కుదరాలి. ఇదంతా గతం. ఇప్పుడు సీనుగాడు రాస్తున్నది బతుకు పాట. తనను కన్న తండ్రి జీవితాన్ని పాటగా రాస్తున్నాడు కదా…బాణీ, భావం, పదం, రసం అన్ని వాటికవే కుదరుకుంటాయన్న ధీమా సీనుగాని ముఖంలో కొట్టచ్చునట్టు కనిపిస్తూనే ఉంది. ఏం చెప్పాలి నాన్న గురించి? అని మనసులో అనుకున్నడో లేదో, పురిటినొప్పుల తరువాత బిడ్డె పుట్టినట్టు సీనుగాని నాన్న పాటకు పల్లవి పుట్టింది.
”అన్నీ తానై నోడు
ఆశల దీపమైనోడు నాన్న.
పేరులేని శిల్పిలాగా కడదాక బతుకంతా గడిపినోడు”.
ఔను ఏ నాన్న అయినా..పేరులేని శిల్పే. పిల్లల్ని ఇట్లా విలువైన శిల్పాలుగా చెక్కిన పేరులేని శిల్పి. కడుపు నిండా తినక, కంటి నిండా నిద్ర పోక, ఎన్ని ఉపవాసాలుంటాడో. జీవితం చేసిన ఎన్నో గాయాలను నిశ్శబ్దంగా మోస్తాడో కదా. అలాంటి నాన్న ఏ బిడ్డెల జీవితాలకైనా నిజంగా దీపమే. పిల్లల ఆశల దీపమే. ఇది నాన్న పాటకు సీనుగాడు రాసుకున్న పల్లవి. పిల్లలకు అన్నీ నాన్నే అవుతాడన్న సీనుగాని గుండెల నిండ ప్రేమకు, ఫీలింగ్‌కి ఒక రూపమిస్తే, ఖచ్చితంగా అది నాన్న పాటే అవుతుంది.
ఇక చరణాలు రాయాలనుకున్నాడు. కొంచెం సేపు ఆగాడు. వెంట వెంటనే రాస్తే పాట తేలిపోతుందనుకున్నడేమో. ఆలోచిస్తున్నాడు. ఎంత మధనపడితే పాటంత సజీవంగా వస్తుందన్న ఎరుక సీనుగానికి అనుభవమే నేర్పింది. అందుకే జీవితం పొడుగునా ఒడువని యుద్ధంచేసిన తన తండ్రి జీవితాన్ని గుండెల నిండా తలుచుకుంటున్నాడు. అసలు నాన్నకు కష్టాలు ఎక్కడ మొదలయ్యాయి? ఎక్కడికి చేరుకున్నాయి? ఇవి సీనును తొలస్తున్న ప్రశ్నలు. ఏ తండ్రికైనా పిల్లలు పుట్టాక కష్టాలు మొదలవుతాయా? లేదు అంతకంటే ముందు కూడా పెద్దగా సుఖపడ్డోడు కాదు కదా సీను తండ్రి. పైగా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నో సార్లు సీనుకు చెప్పే ఉన్నాడు. సీనుతండ్రి ప్రతీ రాత్రి సీనుకు వినిపించిన కథ, తన జీవితమే. ఆ బాధలన్నింటిని తలుచుకొని పూసగుచ్చినట్టు ఒక్కో సందర్భాన్ని ఒక్కో చరణంగా మలవడానికి సిద్ధమయ్యాడు. ముందు తల్లితో అనుబంధం దగ్గరి నుండి మొదలుపెట్టాడు.
”బాలింతయ్యి అమ్మ పట్టె మంచమూ మీదుంటే
పొయ్యి కాడా నాన్న పొగ ఊదే ఊపిరవుతాడు
చేతి వేళ్లే కాలినా చెరగనీ చిరునవ్వయ్యెటోడు” నాలుగు పాదాల చరణంలో ఇలా మూడుపాదాలు కుదిరాయి. ఇక నాలుగో పాదం ఇంతకు మించినదై ఉండాలనుకున్నాడు. అది తన తండ్రి మొత్తం కష్టాన్ని పట్టించేది అయి ఉండాలన్నది సీను భావన. అసలు నాన్న జీవితమంతా గాయాలే అయినపుడు, వంట చేసేటపుడు చేతి వేళ్లు కాలడం ఒక లెక్కా. అందుకే కావచ్చు. తల్లులు వంట చేయలేని నాడు, నాన్నల అవస్థలు చూడాలి. వంట చేసేటపుడు చేతులు కాలినా సరే బాధను బలవంతంగా అదిమి పట్టుకొని, సన్నని చిరునవ్వొకటి నవ్వేవాడట సీను తండ్రి. అమ్మంటే నవమాసాలు మోసి కంటుంది. ఇంతకంటే ఎవరూ గొప్పకాదు. కానీ, సీను మాత్రం ఇలాంటి మాటకటి చెప్పాలనుకుంటున్నాడు. ఏం చెప్పాలి అని మనసును జల్లెడ పడుతున్నాడు. అది చెప్తేనే పాట సార్థకమవుతుంది.
ఏకాగ్రత కోసమేమో మళ్లీ కళ్లు మూసుకున్నాడు. ఆలోచిస్తున్నాడు. నాన్న చేసిన త్యాగాలు ఒక్కోటి కళ్ల ముందు కదులుతున్నాయి.
సీను చిన్నతనంలో రిక్షాలో బడికి వెళ్లేవాడు. అది చూసి బడి ముందున్న నా స్నేహితులు
సీను రిక్షా దిగడం చూసి, బాగా ధనవంతుల కొడుకనుకునేవారు. వెళ్తూ వెళ్తూ ఆ రిక్షాయన సీను బుగ్గ మీద ఒక ముద్దుచ్చి వెళ్లేవాడు. అది చూసి ‘ఆయన మీ రిక్షాయనా?’ అని అడిగేవాళ్లు స్నేహితులు. ఆ మాటకు సీను గుండెలో ఏదో తెలియని బాధ మెలిపెట్టేది. ఆ మాటే బడి నుంచి ఇంటికి వెళ్లాక తండ్రికి చెప్తే…ఆ మరుసటి రోజు ఉదయమే లేచి, రిక్షా అమ్మేసుకొని వచ్చిన తండ్రి గురించి ఏ కొడుకైనా ఏం చెప్పగలడు. ఔను…
”పురిటి నొప్పులే లేవు నాన్నకు, బతుకంత పుడమి నొప్పులే కడదాకా” పాటలో నాలుగో లైను రాసేశాడు. ఈ వాక్యం రాశాక తల్లిని తక్కువ చేస్తున్నానా అనే సంశయంలో పడ్డాడు. అదేం లేదు. కాకుంటే నాన్న కష్టానికి కూడా కొంత గుర్తింపు నివ్వాలన్న పక్షపాతం అని తన మనసుకు తానే సమాధానం చెప్పుకున్నాడు. తల్లి ప్రస్తావన తరువాత ఇక తమ కోసం తండ్రి చేసిన త్యాగాలను మొదలుపెట్టాడు.
”ఆడపిల్ల పుడితే నాన్న మా అమ్మని చెప్పుకుంటడో
కొడుకు కొంటె పనులల్లో కన్నతండ్రినీ తలసుకుంటడో
ముద్దుపిలుపులతోటి నాన్న ప్రేమ ముద్దయిపోతుంటడో
రెక్కలచ్చి ఎగిరిపోతే దారి దిక్కులన్నీ వెతుకుతుంటడో”
అంటూ చరణాన్ని ముగించాడు సీను. ఆడపిల్లలను అందరు తండ్రులు ఒకేలా చూసుకుంటరా? ఈ డౌట్ సీనుగానికి కూడా వచ్చింది. కానీ, తండ్రిని హీరోగా చిత్రించాలనుకున్న సీనుకు, తన తండ్రిలాంటి తండ్రులే కనిపిస్తున్నారు తప్ప, నీచపు, పాపపు తండ్రులు కాదు. ఎక్కడో ఒకరలా ఉన్నారని తండ్రుల లోకాన్ని తను మాత్రం ఎలా నిందించగలడు? అందుకే మంచి తండ్రుల వెయ్యి కన్నుల వెతుకులాట గురించి హృద్యంగా ఈ చరణాన్ని రాసేశాడు.
ఇక చదువుల కోసం కరిగిపోయిన తండ్రి వ్యథను ఒక చరణంగా రాసేందుకు సిద్ధమయ్యాడు. సీను తండ్రేకాదు, ఏ తండ్రైనా తన పిల్లల చదువుల కోసం ఎంత అల్లాడిపోతడో కదా!
”తాను దిద్దని అక్షరాలను తన పిల్లలు నేర్వాలంటడో
తాహతు మించిన మెట్లను తండ్లాడుతు ఎక్కిస్తడో
వాళ్ల చదువు భవితలే లోకమై తననెక్కడో మరిచిపోతడో
తన కష్టాల్లో ఇసుమంత కూడా తన బిడ్డెలకొద్దనుకుంటడో” ఈ చరణంలో సీను తండ్రి త్యాగాన్ని పొదివి పట్టుకున్నాడు. అవును. ప్రతీ తండ్రీ తను పడ్డ కష్టాలు తన బిడ్డెలు పడద్దుకునుకుంటాడు. ఆ త్యాగాన్ని గుర్తు చేయకుంటే నాన్న పాటకు అర్థమేదనుకున్నాడు. చాలా మంది తండ్రులు చదువుకోక పోయినా, తమ పిల్లలు మాత్రం గొప్ప చదువులు చదవాలనుకుంటాడు. చదువుకుంటే పిల్లలు బాగుపడతారనే ఎరుక, చదువుకున్న తండ్రులకే కాదు, చదువుకోని తండ్రుల మనసుల్లో కూడా క్రమంగా స్థిరపడి పోయింది. ఈ విషయాన్నే గుర్తు చేశాడు సీను.
ఇలా మానవ జీవితంలో నాన్న అనే పాత్ర చేసే కృషి, త్యాగాల మీద చరణాలు ఒకదాని వెంట ఒకటి వచ్చి చేరుతున్నాయి. చూస్తుండగానే పాట పూర్తయ్యింది. నిజానికి పూర్తయ్యిందా? సీను ఇక చాలనుకున్నాడా? ఏ భాషలోనైనా నాన్న మీద రాయడానికి ఒకే ఒక్కపాట ఏ మాత్రమూ సరిపోదు. అయినా సరే ఎక్కడో ఒక చోట ఆపాలి కదా. అందుకే ఆపేశాడు. ఇట్లా నాన్న మీద పాట రాసుకొని, సరికొత్త బాణీలో దాన్ని పాడుకుంటూ…నాన్నను తలుచుకుంటూనే ఉన్నాడు.
ఈ పాటను ముందు స్నేహితుల దగ్గర వినిపించాలనుకున్నాడు. ఎందుకంటే వాళ్లు కూడా సీనులాగే సృజనాత్మక జీవులే. ఒకడు రైటరు. మరొకడు యాక్టర్. ఇంకొకడు జర్నలిస్టు. వాళ్లకు పాటలోని సాహిత్య విలువలు తెలియనివి కాదు. పైగా సీనులాగే పాటగాళ్లు కూడా.
ఓ సాయంత్రం పూట. హాస్టల్ గది వేదికయ్యింది, సీను రాసిన నాన్న పాటకు.
కొత్త పాట రాశాను. వినండిరా అన్నాడు. అంతే అందరూ చెవులగ్గి కూర్చున్నారు. సీను పాట పాడుతున్నంత సేపే కాదు, పాడిన తరువాత కూడా లిప్తకాలం పాటు ఒకలాంటి నిశ్శబ్దం అలుముకున్నది. ఆ నిశ్శబ్దానికి విరామం పలుకుతూ ఒకరి తరువాత ఒకరు చప్పట్లు చరిచి అభినందనలు. నిజంగా నాన్న విలువను తెలిపిన పాటరా. ఎంత బాగా రాశావో. స్నేహితుల్లో నాన్న లేనివాడు మరింత ఎక్కువగా కనెక్టయినట్టున్నాడు. కళ్ల వెంట రాలుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ‘అద్భుతంరా’ అన్నాడు. అట్లా మొదలైన ‘నాన్న పాట’ ప్రస్థానం వారం రోజుల్లోనే యూనివర్సిటీ హాస్టల్ గదులన్నింటా ఏదో ఒకసారి మార్మోగుతూనే ఉంది. ఎవ్వరు విన్నా చాలా బాగుంది పాట. ఎవరు రాశారు. ఓహ్ నువ్వేనా ! మస్తుందన్న. మా నాన్న గుర్తొచ్చారన్న స్నేహితుల కాంప్లిమెంట్లు సీనును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇక ఈ పాట ఎవరికోసం రాశాడో ఆ గుండెకు చేర్చాలనుకున్నాడు.
పాట కంఠతా వచ్చేసింది. ఈ పది రోజుల్లో ఎన్ని వందల సార్లు పాడుకున్నాడో. తాను పాడుకోవడమే కాదు, తన స్నేహితులను కూడా పాట వెంటాడుతున్నది. హాస్టల్ ఫ్రెండ్స్ మనసుల్లో అప్పటికే చాలా పాటలున్నా. ఇది కొత్తగా అనిపించింది. అందుకే ఎవ్వరి గొంతులోనైనా కూనిరాగమై తిరుగుతోంది. కొన్ని పాటలంతే. బాణి సింపుల్‌గా ఉండడమో, మధురంగా ఉండడం వల్లనో అలా ఒక్కసారి వినగానే మనలోకి వచ్చేస్తుంది. అందుకే సీను పాడుతున్న ప్రతీసారి కోరస్‌గా స్నేహితులు గొంతు కలుపుతున్నారు.
ఇక సీను నాన్నకు వినిపిస్తే ఈ పాటకు సార్థకత. ఆయన సీను పాటలకు శ్రోత మాత్రమే కాదు. గురువు కూడా. పాటల మీద పట్టుకలిగిన జానపద కళాకారుడు. ఆయనకు ఈ కొడుకు రాసిన పాట నచ్చుతుందో లేదో. సీనులో చిన్నపాటి టెన్షన్ మొదలైంది. అయినా నా స్నేహితులందరికీ నచ్చిన పాట, నాన్నకు మాత్రం నచ్చకుండా ఎట్లా ఉంటుంది?! ఈ ఒక్క పాటలోనే నాన్న జీవితాన్నంతా పట్టి చూపలేను కదా అని తనను సమర్ధించుకున్నాడు. ఆయన పడ్డ కష్టాలకు ఈ పాట చిన్నపాటి ప్రతిబింబం కూడా కాదు. మరి ఇలాంటి పాటలో నాన్న తన జీవితాన్ని చూసుకుంటాడా? చూద్దాంలే అనుకున్నాడు.
నాన్నకు నచ్చకుంటే మళ్లీ మార్చి రాయాల్సిందేననుకున్నాడు. అదే సమయంలో సీనుకు మరో డౌటస్తున్నది. నాన్నను ఇలా హీరోను చేసి పాట రాస్తే అమ్మ ఊరుకుంటుందా? అప్పుడెప్పుడో అందరూ నాన్నల మీద కవిత్వం రాసి పుస్తకం వేస్తున్నారంటే, సీను కూడా నాన్న మీద ఒక కవిత రాశాడట. అది ఆ పుస్తకంలో వచ్చాక…అమ్మను నాన్నను, చిన్నాన్నను, నాన్నమ్మ, తాత, పిన్ని, అత్తమ్మలను అందరినీ కూర్చోబెట్టి నాన్న మీద నేను రాసిన కవిత వినిపిస్తే, సీను తండ్రి ముఖం వెయ్యి ఓల్టుల బల్బ్‌లా వెలిగిపోయింది. అదే సమయంలో మరోవైపు తల్లి ముఖంలో మాత్రం కరెంటు పోయింది.
”ఏందే అమ్మా ఎందుకట్లా చిన్నబోయినవ్?” ఆరా తీశాడు మెల్లగ సీను….
”మీ నాయిన గురించి బాగనే రాసినవ్‌గని, నేనేం చేయలేదరా…నా గురించి ఒక్క ముక్క లేదు” అని ముఖం మీదే ఒక తిరుగుబాటును ప్రకటించింది. అట్లాంటి రెబల్ సీనుగాని అమ్మ! మరి ఈ పాటకు ఆ రెబల్ అమ్మ ఊకొడుతుందా? లేక మళ్లీ సీనుదంతా నాన్న పక్షపాతమని చిన్నబుచ్చుకుంటుందా? ఏమో మరి. అందుకే ఎందుకైనా మంచిది…అమ్మను ముందుగానే కాకాపట్టాలి.
ఈ ఒక్కసారి నాన్నకోసం వినమ్మా. ఆయనకా వయసై పోతున్నది. ఆ అంతంత మాత్రం ఆరోగ్యానికి కొంచమైనా సంతోషాన్ని కలిగించే బాధ్యత నాకుంటుంది కదా అని చెప్పాలి అనుకున్నాడు. ఈ పాటికే సీనుకుఒక ఉద్యోగం వచ్చి ఉంటే, కన్నవాళ్లను మరింత బాగా చూసుకునే వాడే. కానీ, ఏం చేయగలడు. ఇవి మొదటితరం కష్టాల కథలు. అందుకే తనకు అత్యంత యిష్టమైన తండ్రిని కనీసం ఈ రకంగానైనా సంతోషపెట్టాలనుకున్నాడు. లేకుంటే జీవితాంతం నాన్నకేమీ చేయలేకపోయాడనే బాధ కుదురుగా ఉండనివ్వదనే భయం కూడా ఉంది. అందుకే సీనును మనసు తొందరపడుతున్నది.
నాన్నకు పాట వినిపించడానికి రేపే బయల్దేరి వెళ్లిపోతా…ఆయన మరోసారి లోలోపల మీసం మెలేసేటట్టు చెయ్యాలి. ఇదే నా ముందు ఇప్పుడున్న ఏకైక లక్ష్యం అనుకున్నాడు సీను. పాటను రాసిన కాగితాన్ని జాగ్రత్తగా పర్సులో పెట్టుకొని స్నేహితులందరికీ చెప్పి సెలవు తీసుకున్నాడు. రేపు మార్నింగే ప్రయాణం. నాన్నకు ఈ పాట వినిపించి ఏమన్నాడో మళ్లీ మీ అందరికీ చెప్తానన్నాడు. ఆ రాత్రే సీనుగాని ఈ ప్రత్యేకమైన పాటకు సార్థకత లేని ఫోన్ కాలకటి కలవర పెట్టింది.
చదువుకుంటున్న మొదటి తరం వాళ్లందరికీ ఇది అనుభవమే. పిల్లలు జీవితంలో స్థిరపడేలోపే వారిని కన్నవాళ్లు దూరమవుతారు. అనేకమంది తల్లినో, తండ్రినో కోల్పోయిన స్నేహితులను చూసి సీను కూడా రూఢీ చేసుకున్న మాట ఇది. ఈ మాట తరచుగా దగ్గరివాళ్లతో కూడా చెప్తున్నాడు. వయసుకు మించిన మెచ్యూరిటీ అంటే ఇదేనేమో. లైఫ్ నేర్పించాల్సిన సెలబస్‌తో పాటు ఎక్స్‌ట్రా క్లాసులు కూడా తీసుకున్నట్టుంది. సీనుగాని ఫ్రెండ్స్‌లోనో, ఆత్మీయుల్లోనో ఎవరికైనా ఈ దుస్థితి ఎదురైతే, వారిని ఓదార్చడానికైతే మరీ మరీ వాడుతున్నాడు. ఇప్పుడు ఈ మాట తనకు కూడా వర్తించింది.
రిక్షా తొక్కి సాది, చదివించిన తండ్రి, ఏదో అర్జంటు పనుందన్నట్టు అర్ధాంతరంగా వెళ్లిపోతే ఏ కొడుకు మాత్రం తట్టుకోగలడు.
ఆ ఫోన్ కాల్ విన్నప్పటి నుండి సీను మనసు, మనసులో లేదు. నాన్న లేని ప్రపంచం ఎలా ఉంటుందో సీనుకు ఇప్పటి వరకు తెలియదు. రేపటి నుండి ఎవరిని నాన్నా అని పిలవాలో తెలియక దిక్కు తోచకుంది. పెరుగన్నంలో ప్రేమను కలిపి తినిపించిన నాన్నకు, కొడుకు ఒక్క ముద్దనైనా పెట్టలేకపోవడమేనా జీవితమంటే అనుకున్నాడు సీను.
తండ్రి తనను ప్రేమతో ముంచెత్తిన క్షణాలు గుర్తొస్తున్నాయి.
హాస్టల్ నుండి ఇంటికి వెళ్లినపుడు ‘ఏమే పెద్దోడు వచ్చిండు. అన్నం పెట్టుమని’ ఖంగారు పెట్టడం. చిన్న చిన్న విజయాలు చెప్తుంటే మురిసిపోవడం. ‘ముందు అన్నం తినయ్యా’ అని తనను తండ్రిలా పిలుచుకున్న సందర్భాలు. అలాంటి నాన్న ఇప్పుడు లేడంటే సీనుకు ఎడారిలోని ఇసుక తుఫాన్ తన చుట్టే పోటెత్తుతున్నట్టుంది. దోస్తుల మీద పడి ఏడ్చీ ఏడ్చి సీనుకు ఓపిక లేకుండా పోయింది. చివరి చూపుకోసం రెక్కలు కట్టుకొని వాలిపోయాడు.
ఇక్కడిదాకా అందరూ ఊహించే కథే. ఇక ఇక్కడి నుండే అసలు కథ మొదలయ్యేది.
కదలని తండ్రి తనువు మీద పడి ఎంతసేపు ఏడ్చాడో సీను. చుట్టాలంతా ”ఆడపిల్లలా అట్లా ఏడుస్తవేందిరా. పొయినోడు తిరిగిస్తడా తియ్” అన్నరు. సీను పర్స్‌లో పాట మౌనంగా రోదిస్తున్నట్టే ఉంది. ఆ పాట గుర్తొస్తే సీను ఏడుపు మరింత ఎక్కువవుతున్నది. ఏందీ జీవితం? కలలు కరిగిపోతున్నాయి. కన్నీళ్లు కట్ట తెగుతున్నాయి.
తనను జీవితంలో ఎంతో ఎత్తులో చూడాలనుకున్న తండ్రి కోరికా తీరలేదు. ఇంతే జీవితం. ఊహించనివి జరగడం. లోలోపల సీనులోని అగ్నిపర్వతం బద్దలవుతున్నది.
ఊరు ఊరంతా సీనువాళ్ల యింటి ముందే ఉంది.
ఫాస్టర్‌లచ్చారు ప్రార్థనలు చేస్తున్నారు.
కమ్యూనిస్టులచ్చారు ఎర్రగుడ్డ కప్పి లాల్‌సలామ్‌లు చెప్తున్నారు.
మాదిగ డప్పు..ఎవ్వరి జీవితమైనా ఇంతే. బతికున్నన్ని రోజులే నీ వెతుకులాట. ఒక్కసారి నీ పయనం ఆగిందా. ఇక మట్టిలోకే నీ చరిత్ర అని మనిషి జీవనతత్వాన్ని దరువుల మీద బోధిస్తున్నది.
సీనుతండ్రి వెళ్లిపోతున్నాడు. ఇక ఈ జీవితంలో ఒక్కసారైనా కనిపించడు. ఆయన గొంతూ వినిపించదు. సీనును కని, అతడి ఎదుగుదల చూడకుండా వెళ్లిపోతున్నాడు. శూన్యంలోకి చూస్తున్నాడు సీను. ఈ లోపే సీను నాన్నకు చివరి స్నానం చేపించారు. ఇప్పుడైనా నాన్న కోసం రాసిన పాట పాడితే బాగుండు అనుకున్నాడు సీను. ఎందుకంటే సీను చిన్నగ ఉన్నప్పుడు, తల్లి పనిలో అలిసిపోతే నాన్నే పాట పాడుతూ స్నానం చేపించాడట. సీనుకు ఇప్పుడు ఆ స్నానపు పాట గుర్తొస్తున్నది. మరిప్పుడు నాన్న కోసం ఒక పాట పాడలేనా అని ఆలోచిస్తున్నాడు. సీను పాడలేడు. ఈ దు:ఖంలో సీను గొంతు పెకలదు.
ఉన్నట్టుండి సీను తన పర్స్‌ను తీసి, అందులోని పాట ఉన్న కాగితాన్ని ఇంట్లో అటుకు మీద పడేశాడు. నాన్నే లేనపుడు ఈ పాట మాత్రం ఎందుకు? అనుకున్నాడేమో. ఆ పాట తన దగ్గరుంటే తట్టుకోలేకపోతున్నాడు.
అయినా తన తండ్రి బతికుంటే వినిపించాలనే కదా పాట రాశాడు. మరెలా…? ఏమో! జీవితంలో అన్నింటికీ సమాధానాలుండవు!
శవపేటికలో సీను తండ్రి శాశ్వత నిద్రలో ఒదిగిపోయాడు. పాట పాడి సీనును నిద్ర పుచ్చిన నాన్న, ఇప్పుడు ఏ పాటా లేకుండానే నిద్రెలా పోతున్నాడో సీనుకు అర్థం కావడం లేదు. శవపేటిక బాక్స్ మూసేస్తున్నారు. ఇంట్లో విసిరేసిన పాట కాగితం సీనుతో లేకున్నా, సీనులో నుండి ఒక పాట అలా ఆలపన చేస్తున్నది. ఆ పాటే. అదే పాట. తన పర్స్‌లో నుండి తీసి విసిరేసిన పాట. సీను చెవుల్లోకి వచ్చి హై పిచ్‌లో మోగుతోంది. అది అక్కడ ఉన్న ఎవ్వరికీ వినిపించడం లేదు.
నలుగురికోసం పాట పాడిన సీను తండ్రి నిర్జీవ దేహాన్ని, నలుగురు భుజం కలిపి ఎత్తుకున్నారు. ఆ చావుకు తరలచ్చిన జనాలను చూసి, సీను ఆశ్చర్యపోతున్నాడు. ఇంతమంది తరలచ్చారా? నాన్న ఇంతకాలం పాడిన పాట అలాంటిది అనుకున్నాడు. ఎందరి మనసులను దోచుకుందో నాన్న పాట. ఇప్పుడు ఆయన ఆత్మ శాంతికోసం ఏవేవో క్రైస్తవ పాటలు పాడుతున్నారు. ఏడ్చి ఏడ్చి సీనుగొంతు మూగబోయింది. ఎట్లా నడిచాడో తెలియదు. ఎవరు నడిపించారో తెలియదు. స్మశానం మాత్రం సీను దగ్గరికే నడిచొచ్చింది.
చివరి చూపు చూస్తు…’ఏంది నాన్న ఇట్లా చేశావు. ఇక మాకు దిక్కెవరు నాన్న’ అని మనసులోనే ఏడుస్తూ అడిగాడు సీను. ఏదీ నాన్న ఉలడు. పలకడు. చీకటి పడుతోంది. సీను తండ్రిలాగే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఊళ్లల్ల నుండి వచ్చినవాళ్లు…’మేం దూరం పోవాలె. తొందరగా కానియ్యండి’ అన్నారు. సమాధిలోకి నాన్న దేహాన్ని పడుకొపెట్టి ఉన్న శవపేటికను దించుతున్నారు. ఏడుపులు మిన్నంటుతున్నాయి. సీను కూడా ఏడుస్తూనే ఉన్నాడు.
ఒక్కసారిగా సీను స్నేహితులల్లో ఎవరికి వచ్చిందో ఆ ఆలోచన. అందరి ఏడుపును ఆపమని బ్రతిమిలాడి, నిశ్శబ్దంలో సామూహికంగా గొంతెత్తి పాటందుకున్నారు. అదే పాట. సీనును వెంటాడుతున్న పాట.
ఎవరికోసం రాశాడో ఆ పాటే. సీను గుండెగొంతుకలో తచ్చాడుతున్న పాట. స్నేహితుల గొంతుల్లో బృందగానమై, నాన్నకు సరైన నివాళై…స్మశానమంతా వ్యాపిస్తోంది. ఆ పాటకు ఏడుస్తూనే సీను కూడా అంత దు:ఖంలోనూ గొంతు కలిపాడు. ఆ పాట వింటున్న సీనుతల్లి కంటిలో ఇంకిపోయిన కన్నీటి చెలిమ ఒక్కసారిగా ఊరింది. టపటపా రాలి సీను తండ్రి శవపేటిక మీద పడుతున్నాయి. పాట అమ్మ కన్నీరై సీను కోరుకున్నట్టే నాన్నను చేరింది. పాటలో ఇప్పుడు నాన్న పేరు చేరింది.
ఈ పాట ఉన్నంత కాలం నాన్న కూడా బతికే ఉంటాడు.
సీనుతోనే ఉంటాడు.
-పసునూరి రవీందర్,
6303008268
(పసునూరి రవీందర్ ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరణ)