పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగాలనుకునేవారు ఆ పదవిలో ఉంటే మాత్రం తిప్పలు తప్పవు. వారు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. ఇంతకూ ఏ పదవి? ఏం కథ అనుకుంటున్నారా?
తెలంగాణలో రైతు సమన్వయ సమితి సభ్యులను టిఆర్ఎస్ సర్కారు నియమించింది. వారిలో కొందరు ఇప్పుడు సర్పంచ్ గా, వార్డు సభ్యుడిగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వారంతా తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే నామినేషన్ వేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
రైతు సమన్వయ సమితి సభ్యులు, ఛైర్మన్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యవసాయ శాఖ. పంచాయతీ ఎన్నికల నియమావళి ప్రకారం నామినేటె్ పోస్టుల్లో నియమితులైన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అలాంటి వారు తమ పదవులకు రాజీనామా చేసి పోటీకి దిగాలి.
రైతు సమన్వయ సమితి సభ్యులు, ఛైర్మన్లు తమ రాజీనామా లేఖలను మండల వ్యవసాయ విస్తరణాధికారి (ఎఓ) కు అందజేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ వేయాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశాలిచ్చారు.
అయితే మండల స్థాయి పదవుల్లో ఉన్నవారు ఎఓ కు, జిల్లా రైతు సమన్వయ సమితి పదవుల్లో ఉన్నవారు జెడికి రాజీనామా లేఖలు సమర్పించాలని ఉత్తర్వులు ఇచ్చారు.