రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సోమవారం ఉదయం ఆకుల ఢిల్లీ వెళ్లారు. కాగా ఆయన అమిత్ షా ను కలిసి రాజీనామా ఇచ్చిన్నట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు ఆయన బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరనున్నట్టు జోరుగా ప్రచారం సాగింది. కాగా తనపై వస్తున్న రాజీనామా వార్తలపై ఆకుల సత్యన్నారాయణ స్పందించారు.
సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారు? బీజేపీకి రాజీనామా చేసారా? జనసేనలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీకి రాజీనామా చేసేందుకు ఢిల్లీ వెళ్లలేదని ఆకుల స్పష్టం చేసారు. జనసేనలో చేరే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. తన నియోజకవర్గ సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చానని వెల్లడించారు. ఇంకా అమిత్ షాను కలవలేదని పేర్కొన్నారు. తనపై వచ్చిన పుకార్లపై ఆయన అసహనం వ్యక్తం చేసారు.
ఆకుల సత్యనారాయణ భార్య జనసేనలో ఉన్నారు. అయితే ఆకుల ఫామిలీ కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆయన రాజీనామా అంశం తెరపైకి రాగానే అంత ఆయన జనసేనలో చేరేందుకు బీజేపీకి రాజీనామా చేస్తున్నారని చర్చించుకున్నారు. ఇక జనసేన అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేసారు. కానీ ఆయన రాజీనామా చేయలేదని ప్రకటించడంతో జనసేన వర్గాలు కొంత నిరుత్సాహం చెందాయి.