తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కలప స్లగ్లింగ్ కు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పోలీసుల సహకారంతో కలప స్మగ్లరపై ఉక్కుపాదం మోపాలని, తరచూ స్మగ్లింగ్ కు పాల్పడే వారిపై పి.డి. యాక్టు నమోదు చేయాలని చెప్పారు. కలప స్మగ్లర్లు ఎంతటి వారైనా, ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తయినా, ఏ రాజకీయ పార్టీకి చెందినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణను నాలుగు విభాగాలుగా విభజించుకుని చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కల పెంపకం, అడవి పునరుద్ధరణ, హైదరాబాద్ నగరం లోపలా బయటా పచ్చదనం పెంచడం, కలప స్మగ్లింగ్ అరికట్టడంపై కార్యాచరణ రూపొందించుకుని రంగంలోకి దిగాలని సిఎం సూచించారు.
పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, పిసిసిఎఫ్ పి.కె.ఝా, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, రాజీవ్ త్రివేది, నిరంజన్ రావు, స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పలువురు అటవీశాఖ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
‘‘అడవుల్లో సహజంగా చెట్లు పెరుగుతాయి. అడవుల ద్వారా లభించే పచ్చదనమే ఎక్కువ. ఓ వైపు అడవులు నశించిపోతుంటే, హరితహారం లాంటి కార్యక్రమాల ద్వారా ఎన్ని చెట్లు పెంచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అడవులను కాపాడితే పచ్చదనం కాపాడినట్లే. అడవులను కాపాడడమంటే, భూమిధర్మాన్ని కాపాడినట్లే. కలప స్మగ్లింగ్ వల్ల అడవులకు పెద్ద ముప్పు వాటిల్లుతుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నది. కొందరు కలప స్మగ్లింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి ప్రాంతాలను, వ్యక్తులను గుర్తించాలి. అక్కడ నిబద్ధత కలిగిన అధికారులను నియమించాలి. కలప స్మగ్లింగ్ అరికట్టడమే లక్ష్యంగా వారు పనిచేయాలి. పోలీసుల సహకారంతో అటవీశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించాలి. సాయుధ పోలీసుల అండతో కలప స్మగ్లింగ్ ను నూటికి నూరు శాతం అరికట్టాలి. కలప స్మగ్లింగుకు పాల్పడే వారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దు. కఠిన చర్యలు తీసుకోవాలి. వారికి సహకరించే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు ఎవరైనా స్మగ్లింగ్ కు పాల్పడినా వదిలిపెట్టవద్దు, టిఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఈ పనిచేస్తే ముందు వారిపైనే చర్యలు తీసుకోండి. గతంలో నక్సలైట్ల కారణంగా అడవుల్లోకి వెళ్లడం సాధ్యం కావట్లేదు అని సాకులు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి సమస్య కూడా లేదు. అడవులను కాపాడడమే లక్ష్యంగా పనిచేయండి. పోలీస్, అటవీ అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఇండ్లు నిర్మించుకునే సందర్భంలో తాము ఎంత కావాలంటే అంత కలప అందిస్తామని కొందరు అధికారులు తరచూ చెపుతుంటారని సిఎం చెప్పారు. అడవుల్లో చెట్లు నరకడం వల్లే ఈ కలప సమకూరుతున్నదని, ఇలాంటి అక్రమాన్ని అరికట్టాలని సూచించారు. కట్టె కోత మిషన్ల (సామిల్స్) నిర్వహణపై కూడా నియంత్రణ ఉండాలని, కొత్తగా ఎలాంటి సామిల్స్ కు అనుమతి ఇవ్వవద్దన్నారు. అడవులను రక్షించడంతో పాటు, చెట్ల నరకివేత వల్ల పోయిన అడవిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రూట్ స్టాక్ ను ఉపయోగించుకుని అడవుల పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. సామాజిక అడవుల అభివృద్ది కన్నా, అటవీ ప్రాంతంలో అడవి పెంచడం సులువు, ఎక్కువ ఉపయోగం అని సిఎం అన్నారు.
‘‘తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద ప్రతీ ఏటా నాటే మొక్కల సంఖ్యను పెంచాలి. వచ్చే వర్షాకాలం నుంచి ఏడాదికి వంద కోట్ల చొప్పున మొక్కలు నాటాలి. దీనికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘హైదరాబాద్ నగరం పరిధిలో లక్షా 50 వేల ఎకరాల అటవీ బ్లాకులున్నాయి. కానీ అందులో చెట్లులేవు. ఈ అటవీ బ్లాకుల్లో పెద్ద ఎత్తున చెట్లు పెంచాలి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రస్తుతం విపరీతమైన వాయు కాలుష్యం ఉంది. చెట్లు లేకపోవడం, వాహన కాలుష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరంలో కూడా వాహనాల సంఖ్య పెరుగుతోంది. కాలుష్యం పెరుగుతోంది. దీన్ని నివారించాలంటే చెట్లు పెంచడం ఒక్కటే మార్గం. అన్ని పార్కులు, అటవీ బ్లాకుల్లో విరివిగా చెట్లు పెంచాలి. వాటిలో వాకింగ్ పాతులు కూడా నిర్మించి ఉపయోగంలోకి తేవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
చెట్ల పెంపకం కార్యక్రమానికి నిధుల కొరత లేదని సిఎం అన్నారు. కాంపా నిధులు, నరేగా నిధులు, బడ్జెట్ నిధులు, నగర పాలక సంస్థల ద్వారా వచ్చే నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. పచ్చదనం పెంచడానికి తీసుకునే చర్యలకు నిధుల కొరత ఉండదని, చిత్తశుద్ధితో పనిచేయాలని సిఎం కోరారు.