సినీ నటుడు, టాప్ కమెడియన్ అలీ వైసీపీలో చేరుతున్నట్టు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న వార్త. ఆయన జనవరి 9 వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో వైసీపీ తీర్ధం పుచ్చుకొన్నట్టు వార్తలు వెల్లువెత్తాయి. కాగా దీనిపై అటు వైసీపీ అధిష్టానం నుండి కానీ ఇటు నటుడు అలీ కానీ వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా అలీ ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ భవిష్యత్తుపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పార్టీలో చేరాలంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు అలీ. ఆ వివరాలు చదవండి.
ఈమధ్య కాలంలో తాను వైసీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించారు అలీ. ‘‘నేను అనుకోకుండా జగన్ ని విమానాశ్రయంలో కలిసాను. పిచ్చాపాటి మాట్లాడుతున్న సమయంలో ఎవరో ఫోటో తీశారు అది వైరల్ గా మారింది. ఒకవేళ నేను వైసీపీలో చేరాలి అనుకుంటే వైసీపీ అధిష్టానంతో చర్చలు జరిపి, నాకు ఒక ముఖ్యమైన హోదా కల్పిస్తాను అని హామీ ఇస్తే అప్పుడు నేనే అధికారికంగా ప్రకటిస్తాను. కానీ అలాంటివి జరగలేదు. సోషల్ మీడియాలో ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారు. వాటి వలన నాకేమి ఇబ్బంది లేదు. నేను వాటిని ఖండిస్తే ఆ పార్టీని అవమానించినట్టు అవుతుంది అందుకే రియాక్ట్ అవలేదు’’ అని అన్నారు.
నిజానికి అలీ 1999 నుండి టీడీపీలో కార్యకర్తగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయన టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసేవారు. 2004 లో ఆయనకు పోటీ చేయడానికి అధిష్టానం అవకాశం ఇచ్చినప్పటికీ వృత్తిపరంగా బిజీగా ఉండటంతో చేయలేదు. ఇక 2014 లో సత్తెనపల్లి నుండి పోటీ చేయమంటే అక్కడ నుండి పోటీ చేస్తే గెలవను అని అలీ భావించారు. గుంటూరు టికెట్ ఇవ్వమని చంద్రబాబును కోరగా సీనియర్లకు మాటిచ్చాను అని చెప్పడంతో ఆయన మీద గౌరవంతో వెన్నక్కి తగ్గినట్లు చెప్పారు అలీ. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2019 కి సరిగ్గా 20 సంవత్సరాలు కావడంతో రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు అలీ తెలిపారు.
తనకి గుంటూరు ఈస్ట్ టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తే ఏ పార్టీలో చేరడానికైనా సిద్ధం అన్నారు అలీ. గుంటూరు 1 లో తన వర్గీయులు ఉన్నారని, అక్కడ నిలబడితే గెలుస్తానని ధీమా వ్యక్తం చేసారు. సెకండ్ ఆప్షన్ గా గుంటూరు వెస్ట్ అయినా ఓకే అన్నారు. ఒకవేళ ఇప్పుడు టికెట్ ఇవ్వడం కుదరదు, పార్టీ తరపున ప్రచారం చేయండి. ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మంత్రి పదవి ఇస్తామంటే ఒప్పుకుంటారా అని యాంకర్ ప్రశ్నించగా బాండ్ రాసిస్తే చేస్తా అన్నారు అలీ. ఒక డేట్ అనుకున్నానని, ఆరోజు తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించిన అలీ జనవరి 9 వైసీపీలో చేరడం అవాస్తవం అని తేల్చి చెప్పారు. కాగా ఆయన టీడీపీలో కొనసాగుతారా? వైసీపీకి వెళతారా? లేదా జనసేనతో కలుస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలీ అన్ని పార్టీలతో టచ్ లో ఉండి అన్ని పార్టీలను టెన్షన్ పెడుతున్నాడని పంచ్ లు విసురుతున్నారు నెటిజన్లు.