వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు వెనకకు వెళ్లడం, తిరిగి తెలంగాణ కు విడుదల చేసి ఏపీకి విడుదల చేయకపోవడంతో రాజకీయ వివాదం నెలకొంది.
వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు బీజేపీ అన్యాయం చేసిందని టిడిపి, తాము రాష్ట్రానికి గణనీయంగా నిధులు మంజూరు చేశామని టిడిపి అనవసరంగా రాజకీయం చేస్తోందని బీజేపీ ప్రతివిమర్శ చేస్తోంది.
రెండు పార్టీలు కూడా రాజకీయ కోణం నుంచి మాట్లాడుతూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయి.
విభజన చట్టం చెప్పింది ఏమిటి- జరుగుతున్న చర్చ ఏమిటి
విభజన చట్టం ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజిని రూపొందించాలి. అది బుందేల్ ఖండ్ తరహా, ఆర్ ఆర్ ప్యాకేజీ ఉండాలి. అది కూడా ప్లానింగ్ ఇయర్ లో ఖర్చు చేయాలి. ఇప్పటి వరకు కేంద్రం అలాంటి నిర్ణయం చేయలేదు. కేంద్రం తో కలిసి ఉన్నపుడు అవగాహన కు వచ్చిన ప్యాకేజీలో కూడా సీమ కు అధికారికంగా ఉన్న అభివృద్ధి నిధులు విషయంలో టీడీపీ ఎలాంటి వత్తిడి తేలేదు. ఇప్పుడు తెలంగాణ కు విడుదల చేసిన నిధులకు , రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం విడుదల చేయాల్సిన నిధులకు సంబంధించినవి కావు. ఎప్పటి నుంచో దేశంలోని వెనుకబడిన జిల్లాలకు కేటాయిస్తున్న నిధులు మాత్రమే. వాటికి విభజన చట్టం ప్రకారం రాయలసీమ అభివృద్ధి కి కేటాయించిన నిధులకు సంబందం లేదు.
రాయలసీమ డిక్లరేషన్ చేసిన బీజేపీ తమకు అవకాశం ఉన్నా సాయం చేయదు, చట్టాన్ని అమలు చేయాలని అడగాల్సిన టీడీపీ అడగదు. నేడు కూడా మనకు రావాల్సిన నిధులు రాలేదన్న బాధ కన్నా తెలంగాణ కు కేటాయించి ఏపీ కి కేటాయించక పోవడానికి కారణం కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష పాటిస్తుంది అన్న రాజకీయం విమర్శ కోసం మాత్రమే అనిపిస్తుంది. బీజేపీ కూడా చట్టం ప్రకారం రావాల్సిన నిధులను కాకుండా అర్థం లేని విషయంలో రాజకీయాలు చేయడం మంచిదే అన్నట్లు, సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మీరు అడుగుతున్నది వందల కోట్లే మేము వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాము అంటూ కాకి లెక్కలు చెపుతున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఆందోళన చెందని పార్టీ, మీడియా లేకపోవడంతో వాస్తవాలు సీమ ప్రజలకు విడ మర్చి చెప్పే అవకాశం లేకుండా పోయింది.
టిడిపి, బీజేపీ పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ గొడవల మధ్య నలగ కుండా రాయలసీమ అభివృద్ధి కోసం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ ప్యాకేజీ కోసం ప్రజలు, మేధావులు, విద్యార్థులు పోరాడాలి.
-మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి