కాచిగూడ-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో భారీ దోపిడీ.. సిగ్నల్స్ ను కట్ చేసి రైలును ఆపేసిన ముఠా!
మహబూబ్ నగర్ స్టేషన్ దాటక చోరీ
బంగారు నగలు, నగదు, విలువైన వస్తువుల తస్కరణ
కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు
తెలంగాణలోని మహబూబ్ నగర్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సినిమా స్టెయిల్ లో తొలుత సిగ్నల్స్ ను కట్ చేసిన దొంగలు రైలును అటవీప్రాంతంలో నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులపై దాడిచేసి బంగారు నగలు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన కాచిగూడ-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది.
ఈ రోజు ఉదయం యశ్వంత్ పూర్ నుంచి కాచిగూడకు రైలు వస్తోంది. రైలు రాకను పక్కాగా అంచనా వేసిన దోపిడీ ముఠా అటవీ ప్రాంతాన్ని దోపిడీ కోసం ఎంపిక చేసింది. రైలు మహబూబ్ నగర్ స్టేషన్ దాటగానే దొంగలు సిగ్నల్స్ ను కట్ చేసేశారు. దీంతో రైలును ఉదయం 4 గంటల సమయంలో అటవీ ప్రాంతంలో డ్రైవర్లు ఆపేశారు. సిగ్నల్స్ కోసం ఎదురుచూస్తుండగా ఒక్కసారిగా దొంగలు రైలుపై విరుచుకుపడ్డారు. ప్రయాణికుల వద్ద ఉన్న నగలు, నగదు, విలువైన వస్తువులను లాక్కున్నారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.
దీంతో కాచిగూడకు చేరుకున్న ప్రయాణికులు, రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీని ప్రతిఘటించిన ప్రయాణికులపై దొంగలు దాడికి పాల్పడ్డారని ప్రయాణికులు వెల్లడించారు. ఇది పాత దొంగల పనేనా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.