-60 వేలకు పైగా ఉద్యోగాల నియామకం కోసం వెలువడనున్న వరుస నోటిఫికేషన్లు
-రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు వెలువడిన వెంటనే 9,355 పంచాయతీ కార్యదర్శుల భర్తీకి నోటిఫికేషన్
సమైక్య రాష్ట్రంలో తీవ్రంగా అన్యాయానికి గురైన నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించి మన రాష్ట్రం, మన ఉద్యోగాలు మనకే’ అనే ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థకు ఊపిరి పోసింది. రాష్ట్రపతి ఆమోదంతో త్వరలో 371 డి ఉత్తర్వులకు సవరణ జరగడంతో రాష్ట్రంలో ఇకపైన జరిగే నియామకాలన్నింటికీ స్థానికులకు 95% అవకాశాలు లభించనుండటం రాష్ట్ర నిరుద్యోగ యువతకు కొత్త ఆశల్ని రేకెత్తించినట్లయింది. తెలంగాణ నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త జోనల్ వ్యవస్థ రూపంలో ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఈ కొత్త విధానంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలకు రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం.
స్థానికులకే పెద్దపీట
కొత్త జోనల్ వ్యవస్థతో ఇప్పటివరకు కొనసాగిన అసమానతలకు తెరపడనుంది. అన్ని స్థాయిల్లోని ఉద్యోగాల భర్తీలో 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. ఈ విధానంతో మారుమూల ప్రాంతాల నిరుద్యోగ అభ్యర్థులకు లబ్ది చేకూరనుంది. 31 జిల్లాలవారీగా నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో ఏప్రాంతం వాళ్లు ఆ ప్రాంతం నిరుద్యోగులతోనే పోటీ పడతారు. దాంతో గ్రామీణ యువత పట్టణాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులతో పోటీ పడాల్సిన అవసరం ఉండదు. ఈ విధానంతో ప్రాంతాల మధ్య అసమానతలు తొలగిపోనున్నాయి. కొత్తగా జరుగనున్న నియామకాలలో అన్ని ప్రాంతాల వారికీ సమాన అవకాశాలు లభించనున్నాయి.
ప్రభుత్వ వర్గాలు శాఖలవారీగా ఖాళీల వివరాలను సేకరించి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో నియామకాల విధివిధానాలపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. 9,355 పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని ఈ విధానం కోసమే తాత్కాలికంగా పెండింగ్ లో ఉంచినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు. కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ ను కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
వేలాది పోస్టులు భర్తీ
రాష్ట్రంలో వివిధ నియామక ఏజెన్సీల ద్వారా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్, గురుకుల నియామక బోర్డు, సింగరేణి, విద్యుత్ సంస్థల ద్వారా ఇప్పటికే వేలల్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టగా, త్వరలోనే మెగా నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీ ద్వారా 40,921 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలుపగా, 128 గ్రూప్ 1 పోస్టులు కలిపి మొత్తం 36,286 పోస్టులకు టీఎస్పీఎస్సీ ఇప్పటికే 100 నోటిఫికేషన్లు విడుదల చేసి, ఆగస్టు 15 నాటికి 13,420 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసింది. మిగతా పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. 19,689 పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉండగా, 3,177 పోస్టులకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే వివిధ శాఖల నుంచి ఇండెంట్ అందిన వెంటనే 1,835 పోస్టులకు నోటిఫికేన్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.