తెలంగాణ కల్చర్, ఆంధ్ర కల్చర్ అనే విషయంలో ఇప్పటి వరకు చర్చోప చర్చలు సాగాయి. సాగుతూనే ఉన్నాయి. ఇది ఆంధ్రా కల్చర్.. ఇది తెలంగాణ కల్చర్.. ఇది రాయలసీమ కల్చర్ అని పలు సందర్భాల్లో వ్యవహారిక విషయాల్లో చర్చలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఈ కల్చర్ అనేది కూడా ప్రముఖ పాత్ర పోశించింది. మేము ఇంతే.. మా కల్చర్ ఇదే అని తెలంగాణ జనాలు బల్ల గుద్ది చెప్పిన సందర్భాలున్నాయి. యాస, భాష తోపాటు కల్చర్ కూడా ప్రముఖంగా ఉద్యమ కాలంలో చర్చల్లో ఉన్నది. ఆంధ్రా కల్చర్ ను తెలంగాణ ప్రజల మీద రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ తెలంగాణవాదులు చేసే విమర్శలు ఇప్పటికీ వినబడుతూనే ఉంటాయి. రాఖీ పండుగ అనేది దేశమంతా జరుగుతున్నది. ఈ పండుగలో ముఖ్యమైన అంశం అన్న చెల్లెలి అనుబంధాన్ని తెలియజేస్తుంది.
ఇక మిగతా విషయాలు చూస్తే తెలంగాణలో ఇంటి ఆడపడుచు చేత ఆ ఇంట్లో మగవాళ్లు మొక్కించుకోరు. మెజార్టీ తెలంగాణ జిల్లాలో ఇదే కల్చర్ ఉంది. ఆడబిడ్డ చిన్న అయినా, పెద్ద అయినా ఆ ఇంట్లో అన్న అయినా, తమ్ముడు అయినా ఆ అమ్మాయి కాళ్లే మొక్కుతారు. అన్నయ్య కదా అని చెల్లి అన్న కాళ్లు మొక్కిన సందర్భాలు పెద్దగా కనిపించవు. చెల్లెమ్మ చిన్నదైనా సరే అన్నే ఆమె కాళ్లు మొక్కుతారు.
కానీ ఆంధ్రాలో కల్చర్ వేరుగా కనబడుతుంది. అక్కడ అన్నయ్య అయితే చెల్లి వయసులో చిన్నది కాబట్టి ఆమె అన్న కాళ్లు మొక్కుతుంది. అదే అక్కా తమ్ముడు అనుకోండి అక్క కాళ్లు తమ్ముడు మొక్కుతారు. అక్కడ వయసును బట్టి ఎవరి కాళ్లు ఎవరు మొక్కుతారు అనేది తెలుస్తుంది. కానీ తెలంగాణలో ఆడబిడ్డలను ఇంటి మహాలక్ష్మిగా పరిగణిస్తారు కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఆడబిడ్డ కాళ్లు అన్నదమ్ములు మొక్కుతారు. ఇది కల్చర్, ఇదే సాంప్రదాయం ఇప్పటి దాకా నడుస్తూ ఉన్నది.
ఇవాళ రాఖీ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటిఆర్ కు ఆయన చెల్లెలు ఎంపి కవిత రాఖీ కట్టారు. తర్వాత కేటిఆర్ కాళ్లు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత ఆయనకు గిఫ్ట్ గా హెల్మెట్ ఇచ్చారు. కానీ తెలంగాణలో ఈ తరహా పద్ధతి పెద్దగా కనిపించదు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లారు ఆ పార్టీ నాయకురాలు రేగులపాటి రమ్యారావు. ఆమె కాంగ్రెస్ నాయకురాలే అయినప్పటికీ ఆమె సిఎం కేసిఆర్ కు సొంత అన్న కూతురు. కుటుంబంలో విబేధాల కారణంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు.
ఆమె పొన్నం ప్రభాకర్ కు రాఖీ కట్టిన సమయంలో పొన్నం కు తోడబుట్టిన ఆడపడుచు కాకపోయినా రాఖీ కట్టగానే ఆమె కాళ్లకు దండం పెట్టారు. ఆమె కూడా ఆయనకు చేతులు జోడించి ప్రతి నమస్కారం చేసింది. ఇక్కడ వయసు, కులం సంబంధం లేదు. కానీ సోదర భావంతో రమ్యారావు రాఖీ కట్టడంతో పొన్నం ప్రభాకర్ ఆమె కాళ్లు మొక్కారు.
ఈ రెండు అంశాల్లో ఏది తెలంగాణ కల్చర్, ఏది ఆంధ్రా కల్చర్ అన్న చర్చలు పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం బాగా చర్చనీయాంశమవుతున్నాయి.
కేటిఆర్ కు కవిత రాఖీ కట్టి కాళ్లు మొక్కిన వీడియో కింద ఉంది.