పవన్ కల్యాణ్ రిజర్వేషన్ హామీల మీద 7 ప్రశ్నలు

కాపు  ప్రయోజనాలను కాపాడేందుకు పవన్ కల్యాణ్ బిసి వర్గాల మద్దతు కూడగట్టాలని చూస్తున్నారా? ఒక బిసి న్యాయవాది ఆరోపణ

జనసేన అధినేత ఒక బిసి న్యాయవాది బహిరంగ ప్రశ్నలు 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారూ

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఈమధ్య మీరు చేసిన ఉపన్యాసం విన్న తరవాత, దానిగురించి చదివిన తరవాత మీకు కొన్ని ప్రశ్నలు …

 

1. మీరు రాజకీయాల్లోకి వచ్చింది కాపుల కోసం, కాపుల్ని ఉధ్ధరించ డానికి మాత్రమేనా ?దానికోసం, జరగడానికి సావకాశం లేని వాగ్దానాలతో, బీసీలకీ, మైనారిటీలకీ, మహిళలకీ చెవిల్లో పువ్వులు పెట్టి, మభ్యపెట్టి, మాయ చేయచేసి, గాలం వేసి, పబ్బం గడుపు కోవడానికి దిగజారుతున్నారని అనుకోవాలా ? లేక మీకు ఈవిషయాల్లో  పరిజ్ఞానం పూజ్యం అనుకోవాలా ? మరో సారి ఆలోచించి చెప్పండి.

బీసీ హోదాకు సంబంధించి, రాజ్యాంగం, కోర్టులు, చెప్పిన ప్రమాణాల మీద గాని, సచార్ కమిటీ నివేదిక అమలు జరిగిందా లేదా, జరిగి ఉంటే ఏమేరకు జరిగింది, జరగక పోయి ఉంటే, ఎమేరకు జరగ లేదూ అనే కోణాల మీద గాని, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీసీల ఆకాంక్షలకు సంబంధించి ఏమాత్రం అవగాహన మీకు లేదు.  ఉండి ఉంటే ఆకోణం మీద ఏమాత్రం ప్రస్తాపించక పోవడం జరగదు. మీరు ఎవరికీ తీసుక పోని గొప్ప రాజకీయ నటులే అనుకోవాలా ? లేక గొప్ప కన్ఫ్యూజన్ మాష్టర్ అనుకోవాలా ? మీకులాన్ని అందలం ఎక్కించు కోవడానికి మిగిలిన సమాజాన్ని మభ్య పెట్టి మాయ చేయడానికి మీరు ఎవరికీ తీసుక పోరనుకోవడం తప్పెలా అవుతుంది ?

2. సామాజిక వెనకబాటు తనంగాని, విద్యాపరమైన వెనక బాటుతనం గాని, ఏమాత్రం లేకపోవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగ రంగంలో దామాషాకు మించి భాగస్వామ్యం పొందుతున్న, ఎన్నో కమిషన్లు, కోర్టుతీర్పులు, ఒప్పుకోని కాపులకు బీసీ హోదా మీరెలా వాగ్దానం చేస్తారు ? ఎలా రాజ్యాంగం 9 వ షెడ్యూల్లో పెట్టిస్తారు ? చంద్రబాబుకు మించిన పుడింగా మీరు ? చంద్రబాబు, తన చెప్పుచేతల్లో ఉన్న, ముద్రగడ పెట్టించిన కాపు సభ్యునితో సహా, ముగ్గురు బీసీ కమిషను సభ్యులు ఇచ్చినట్లు చెబుతున్న నివేదికను అడ్డం పెట్టుకొని, వ్యతిరేక నివేదికనిచ్చిన ఛైర్మన్ మంజునాథ్ నివేదికను కనుమరుగు చేసి, ఈ రెండు నివేదికలతో సహా, స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను కూడ, కేబినెట్ మంత్రుల తో సహా, సమాజంలో ఎవరికీ అందుబాటులో లేకుండా జేసి, అసెంబ్లీలో చట్టం చేసినా, 9.వ షెడ్యూల్ లో పెట్టడానికి వీలు కాకుండా పోయిన కాపులకు బీసీ హోదా, మీరెలా ఇప్పిస్తారు. పచ్చి కోతలు కాకపోతే ? దీనికి అడ్డు చెప్పకుండా ఉండడానికి బీసీలకు 5% నుండి, ఎంత శాతం వీలైతే అంత, రిజర్వషన్లు పెంచేస్తానని బులిపించడం, దీనికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఏమాత్రం ఉన్నా, మీలాంటి కులదురభిమానం ఉన్న వారికి తప్ప, ఎవరికైనా వీలవుతుందా?

3. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి మీరు రడీయా ? “మీరు రడీనా” అని చంద్రబాబుకు, జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తారా ? రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయిపోయిన మీముగ్గురికీ, ఎటువంటి అధికారం లేని ఈ విషయంలో, ఈ వాగ్దానం మళ్ళీ  ఎవరిని మోసం చేయడానికి ? అధికారం ఉన్న నరేంద్రమోదీ ని, ప్రతిపక్ష నేత రాజీవ్ గాంధీని వారి వారి పార్టీల్ని ఒప్పించే బాధ్యతను తీసుకొంటానని సమాజం మొత్తానికి ఒక ఎఫిడవిట్ ఇస్తారా ? 50% ఉన్న బీసీలకు 85 ఎసెంబ్లీ స్థానాల్ని, 13 పార్లమెంటు స్థానాల్ని, మీ మూడు పార్టీలు సమిష్టిగా గుర్తించి, వాటిని బీసీలకే కేటియించేలా మీరు బాధ్యత తీసుకొంటారా ? అయితే రండి, ఆరెండు పార్టీలతో బాటు బీజేపీ ని కూడా ఒప్పించండి.

4. మహిళా రిజర్వేషన్ బిల్లు లో, బీసీమహిళలకు సగం భాగస్వామ్యం కావాలని కోరుతున్న బీసీల డిమాండుపై మీరెందుకు నోరెత్తరు ? మీరు అగ్ర కులాల ప్రయోజనాలకే పరిమితమా ? ఇతర బలహీన వర్గాల విషయం మీదంతా నటనేనా ?

5. సచార్ కమిటీ నివేదికలో అమలు కాని సిఫార్సులు ఏమైనా ఉన్నాయా ? ఉంటే అవి ఏంటి ? వాటిలో మీరేం అమలు చేస్తారు ? మేం అన్ని సిఫార్సుల ను అమలు చేసేసామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం మీదృష్టికి రాలేదా ? లేక ఓట్ల కోసమే ముస్లింలకు కూడా మీరు గాలం వేస్తున్నారా ?

6. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మీద నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న దోపీడీ, దౌర్జన్యం, అణచివేత, మారణ హోమానికి సంబంధించి ఏ సంఘటన మీదైనా, మీపార్టీ నిరసన కార్యక్రమాల చేసిన చరిత్ర ఉందా ? లేకుంటే నటనా చాతుర్యం తో మీరు చేస్తున్న విన్యాసాలను ఈవర్గాలు ఎందుకు నమ్ముతాయి ?

7. తమను బీసీల్లో చేర్చాలని, హింసకు, అనైతికతకు, దౌర్జన్యాలకు, ప్రభుత్వం మీద శృతి మించిన అధర్మ ఒత్తిడికి కాపులు దిగజారుతున్నంత కాలం, బీసీల ఓట్లు కోరే అర్హత, మీతో సహా కాపు నాయకులకు ఎవరికైనా ఉందా ? కాపులకు బీసీలు ఎందుకు ఓటెయ్యాలి ?

కొండలరావు
బీసీవాది, న్యాయవాది
14-08-2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *