కత్తి మహేష్ బహిష్కరణ పట్ల మేధావుల అభ్యంతరం

స్వతంత్ర దళిత మేధావి, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బహిష్కరించడం పట్ల  26 మంది  ఉద్యమకారులు, మేధావులు, అధ్యాపకులు అభ్యంతరం చెప్పారు. కత్తి మహేశ్ మీద తెలంగాణ ప్రభుత్వం కత్తికట్టడానికి  ఆయన దళితుడు కావడమే కారణం అని వారు ఆరోపిస్తున్నారు.  ఈమేరకు వారు తెలంగాణ డిజిపికి ఒక బహిరంగ లేఖ రాశారు.  ఇదే ఆ లేఖ :

డిజిపి గారికి నమస్కారం,

మా మనవి ఏమనగా,

మీరు హైద్రాబాద్ నగర శాంతి భద్రతల దృష్ట్యా కత్తి మహేష్ ని నగర బహిష్కరణ చేస్తున్నారు. పరిపూర్ణానంద మూడు రోజుల నుండి నానా యాగీ చేస్తూ, ఒక మతం వకాల్తా పుచ్చుకుని, ఛానెల్ లో అది భక్తి ఛానెలో లేదా భయం ఛానెలో కానీ బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్న విషయం మీకు తెలిసిందే. ప్రజల మనో భావాల దెబ్బ తింటున్న దృష్ట్యా ఈ చర్య తీసుకుంటున్నట్టు చెపుతున్నారు. ఈ సందర్భంగా శాంతి, సహనం, ప్రజల మానవ హక్కులు సమానత్వం కోరుకునే, పని చేసే కార్యకర్తలుగా మాకు వస్తున్న సందేహాలను నివృత్తి చేయగలరు.

1. కత్తి మహేష్ రామాయణం, రాముడిని కించపరచలేదు. ఆయన పదే పదే చెపుతూ వస్తున్నాడు తాను రామాయణం ఒక కథ అనుకుంటున్నాడు అని అందులో ఒక పాత్ర గురించి విశ్లేషణ చేసాడు. ఒక పదం వాడాడు . రామాయణం మరియు ఇతర పురాణ ,ఇతిహాసాల మిద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ మొదటి వాడు కాదు , చివరి వాడు కూడా కాదు. అయితే , అతను దళితుడు కాబట్టే అతని మీద ఇంతగా దాడి జరుగుతుంది అని మెం స్పష్టంగా చెప్పదలిచాం. మీరు అనుమతి ఇస్తే ఇంతకు ముందు ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించారో కూడా వివరాలతో సహా చెపుతాం. అయినా అతను తప్పు చేస్తే చట్ట పరంగా శిక్ష వేయండి కానీ బహిష్కరణ , వెలివేతలు మాకు మా అంటరాని తనం ఆధారంగానే చేస్తున్నట్టు మేము ఈ దేశ మూల వాసులం మరియు మాతో పని చేసే ఇతర కార్యకర్తలు భావిస్తున్నారు. మా మనోభావాలని చెప్పుకోవడానికి సేనలు, బాబాలు, చానెళ్లు , పార్టీలు లేకపోవడం వలన మీకు ఈ సోషల్ మీడియా ఆధారంగా చెప్పుకుంటున్నాం.

2. హైదరాబాద్ అందరిదీ అన్ని ప్రాంతాల వారిది అంటారు.సబ్ కా షహర్ హమారా అని ప్రసిద్ధి. కత్తి మహేష్ చిత్తూరు జిల్లా వాసి కాబట్టి అక్కడికి పంపిస్తున్నారు మరి హైదరాబాద్ వాడు అయితే ఎక్కడికి పోయి ఉండేవాడ సర్. దోపిడీలు, మర్దర్లు, రేప్ లు చేసిన వారు ఇంకా హాయిగా తిరుగుతున్నారు.

3. గత కొన్ని రోజులుగా నోటికి వచ్చిన అబద్దాలు చెపుతూ, నేను ఎస్టీ అని లేదా ఎస్సి అని ఒక ‘పదం’ అన్నందుకు అందరిని రెచ్చగొడుతున్న పరిపూర్ణానంద ఎక్కడి వాడు? అతడికి బహిష్కరణ లేదా ? అసలు బాబాలు, సన్యాసిలు రాజకీయంగా, హింసాపురితంగా మాట్లాడొచ్చా సర్.

4. ఒక ఛానెల్ పదే పదే కత్తి మహేష్ వ్యాఖ్యలు చూపించిందని చర్యలు తీసుకుంటున్నారు మరి భక్తి పేరుతో ,ఒక ఛానెల్ ని అడ్డుగా పెట్టుకుని నిత్యం ఎవరి మీదనో ఒకరి మీద ద్వేషం వెళ్లకక్కుతూ, ఒకప్పుడు నా మీద అసత్య ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియా లో హిందూత్వ వాదులు దారుణంగా దాడి చేయడానికి, భావ ప్రకటన స్వేచ్ఛ ని మాట్లాడుతున్న అనేక కార్యకర్తల మీద , ఇప్పుడు కత్తి మహేష్ మీద దాడికి ఉసిగొల్పుతున్న ఛానెల్ ని ఎందుకు బాన్ చేయరు? భక్తి ఛానెల్ అంటే భక్తిని కదా ప్రసారాలు చేయాలి. దేవుడు ఉంటే శాంతిని కదా కాంక్షించాలి. హింసను ప్రేరేపించే, రెచ్చగొట్టే ప్రకటనలు, కార్యక్రమాలు చేయొచ్చా? వాటి పరిధి ఏంటి?

5. ఈ నెల నాలుగో తారీఖున వరంగల్ కాసి బుగ్గలో భద్రకాళి ఫైర్ వర్క్స్ అండ్ బాంబుల తయారీ కంపెనీలో 11మంది పేద దళిత ,బిసి కులాల బిడ్డలు, రోజు వారి కూలీలు ఒక ఆరెస్సెస్ కుమార్ అను వ్యక్తి దన దాహానికి బలి అయ్యారు. ఒక బాంబుల తయారీ ,జనావాసాల మధ్య నడపడానికి అనుమతులు ఇచ్చిన అధికారులు, వ్యవస్థ మీద చర్యలు తీసుకున్నారా? కనీసం ఇళ్లు కూలిపోయిన వారికి ఏమైనా సహాయం కూడా చేయలేదు. మా రక్తం మారుగుతోంది సార్. మాకు తీవ్రంగా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరికి చెప్పుకోవాలి.

6. ఎక్కడ బడితే అక్కడ పరిమితులు లేకుండా కోతి బొమ్మలు పెడుతూ, కాషాయ జెండాలు పట్టుకుని గ్రామ గ్రామాన శాఖ లు, మతోన్మాదం ప్రేరేపించే సంస్థలు నడుపుతున్న కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చాయా సార్. దళితులు, చర్చి ల మీద దాడులు, బీఫ్ తింటున్నారని ముస్లింల మిద దాడులు, పసిపిల్లల ని కూడా వదలకుండా పిల్లలు , స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు చూడలేక న్యాయం కోసం పోయి అడిగిన వారి మీద కూడా కేసులు పెడుతున్నారు సార్. ఎక్కడ చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.

ఇక్కడ కోర్టులు,పోలీస్ స్టేషన్ లు ఉన్నా కూడా కొన్ని సంస్థలు, వ్యక్తులు, పార్టీల మనోభావాలే మెజారిటీ ప్రజల మనోభావాలుగా భావించడం ఈ దేశ మెజారిటీ ప్రజలు అయిన ఎస్టీ,బిసి,మైనారిటీల,మహిళల మనోభావాలు ఎవరికి పట్టకపోవడం అసలు మనుషులుగా గుర్తించక పోవడం ,మాకు ఏ సంస్థ భరోసా ఇవ్వక పోవడం ఒక వాస్తవం సార్.

మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడిది సార్, ఏ స్వేచ్చా లేకుండా తర తరాలుగా వెలివాడల్లోనే బ్రతుకుతున్నాం, ఈ రోజు మీరు కొత్తగా (అ)పరిపూర్ణ ఆనందం’ కోసం’ వెలివేసేది ఏమీలేదు. బలవంతంగా ఒక మతం మా మీద రుద్ది కులం పేరుతో ఆర్థికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ,రాజకీయంగా అణచివేస్తూ ,మమ్ములని చంపుతూ, హింసిస్తూ, మా మీద అత్యాచారాలను చేస్తున్న మతం పై మాకు ప్రేమ ఉండాలని మీరు బలవంత పెట్టడమే మాకు శిక్ష, మనువాదం. భక్తి పేరుతో, బాబాల పేరుతో, భావజాలం పేరుతో నిత్యం మా మీద దాడి , ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న వారిని బహిష్కరించండి ప్లీస్..అందరికి పోలీసు వ్యవస్థను అందుబాటులో ఉంచండి.

లేఖ మీద సంతకం చేసిన వారు

-డా.సూరేపల్లి సుజాత, ప్రొఫెసర్ రమా మేల్కోటే, డాక్టర్ కె లలిత, ఉ. సాంబశివరావు,  గుంటూరు లక్ష్మినరసయ్య, డా. పసునూరి రవీందర్,ప్రొ. పద్మజా షా,దేవి, సజయ,  సంధ్య, డా. సునీత, వసుధా నాగరాజ్, సుమిత్రా, సత్యవతి, విజయా భండారు, గోగు శ్యామల,డేవిడ్, స్కైలాబ్ బాబు,  హిమబిందు, తేజస్విని, ఝాన్సి, ప్రొ. వీణా శత్రుఘ్న, ప్రొ.సుశీ థారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *