తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రాన్ని, దేశాన్ని, ఖండాన్ని దాటిపోయాయి. అమెరికాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు వారాాల పర్యటన కోసం తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అమెరికా ఫ్లైట్ ఎక్కారు. నిజామాబాద్ మాజీ ఎంపి మధు యాష్కీ గౌడ్ కూడా అమెరికాలోనే పర్యటిస్తున్నారు. రేవంత్, మధు యాష్కీ వెళ్లిన రెండు రోజులకే పిసిసి అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి ముఖ్య అధికార ప్రతినిథి డాక్టర్ శ్రవణ్ దాసోజు కూడా అమెరికా ఫ్లైట్ ఎక్కారు.
నాటా సభల్లో పాల్గొనేందుకు ముందుగా రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ వెళ్లగా తర్వాత పిసిసి చీఫ్ ఉత్తమ్, దాసోజు శ్రవణ్ వెళ్లారు. ఉత్తమ్, దాసోజు శ్రవన్ కు నాటా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అంతకముందు రేవంత్, మధు యాష్కీతో ప్రత్యేక ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు తెలంగాణలో హాట్ రాజకీయాలు నడుస్తుంటే కాంగ్రెస్ కీలక నేతలంతా నాటా సభల పేరుతో అమెరికా వెళ్లిపోవడం కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ముందస్తు ఎన్నికల హడావిడి జరుగుతున్న నేపథ్యంలో పిసిసి చీఫ్ విదేశాలకు వెళ్లడమేంటని పార్టీలో ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు.
ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో రేవంత్ రెడ్డికి పెద్దగా పొసిగిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఇద్దరు నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. అయితే చాలాకాలం తర్వాత ఉత్తమ్ మీద అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర సాగింది. నల్లగొండ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు మరికొందరు నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి నుంచి తొలగించాలని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకలను అసమ్మతి నేతలు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. రాహుల్ కు ఉత్తమ్ మీద గట్టిగానే కంప్లెంట్ చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డితో అంటీముట్టనట్లుగా వ్వవహరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గత నెలలో తొలిసారిగా రేవంత్ కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. సమన్వయంతో పనిచేద్దామని సూచించారు. ఎన్నడూ లేనిది ఉత్తమ్ ఫోన్ చేయడంతో రేవంత్ ఆశ్చర్యపోయారు.
ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డికి పిసిసి ప్రచార కార్యదర్శి పదవి ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారం సాగుతోంది. ముందుగా వర్కింగ్ ప్రసిడెంట్ ఇస్తారని లీక్ వచ్చింది. అయితే దానికి రేవంత్ సుుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆయనకు చివరకు ప్రచార కార్యదర్శి పదవి ఇచ్చేందుకు అధిష్టానం అంగీకరించిందని చెబుతున్నారు. మరి ఆ పదవి కోసం రేవంత్ శిబిరం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కానీ రేపు మాపు అంటూ రేవంత్ కు పదవి ఇవ్వడంలో అధిష్టానం వెనుక ముందు అయితున్నది. కొందరు సీనియర్లు రేవంత్ కు పదవి రాకుండా అడ్డుపడుతున్నట్లు కూడా ప్రచారం ఉంది. అంతేకాదు రేవంత్ కు పదవి రాకుండా అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు రేవంత్ అనుచరులు చెబుతున్నారు. దీంతో పదవి కోసం ఎదురుచూసి చూసి రేవంత్ విసిగిపోయారన్న చర్చ కూడా ఉంది. పదవి రావడానికి మరింత సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే రేవంత్ అమెరికా నాటా సభలకు వెళ్లినట్లు చెబుతున్నారు. రేవంత్ 20వ తారీకు వరకు వచ్చే అవకాశాలున్నాయి. ఉత్తమ్ కూడా వారం రోజులపాటు టూర్ లో ఉంటారని చెబుతున్నారు.
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలంతా అమెరికా బాట పట్టడంతో అమెరికాలో కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తున్నాయన్న చర్చ ఉంది.