ఉత్తరాంధ్ర మేధావులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు సమాలోచనలు జరిపారు. ప్రస్తుతం ఆయన జనసేన పోరాటయాత్రలో ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ఆయన మేధావులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఈ రోజు మరొకసారి సమావేశమయ్యారు.
ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఉత్తరాంధ్ర సమస్యల పుట్టగా తయారయిందని, తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాంతంలోని భూములను చౌకగా కాజేసి పారిశ్రామిక వేత్తలకు అప్పచెబుతూ ఉందని ఆయన విమర్శిస్తున్నారు. అంతేకాదు, విశాఖ లో వేల ఎకరాలు కాజేయపడ్డాయని, ఇక్కడి చక్కెర మిల్లు టిడిపి వల్లే పున: ప్రారంభం కావడంలేదని ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మేధావులతో సమావేవమవుతున్నారు.
ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక సమస్యలపై చర్చించారు. పవన్ కల్యాణ్ గారిని కలిసిన వారిలో కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ.కె.ఎస్. చలం, ఆంధ్రయూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కె.వి. రమణ, ఏ.వి.ఎన్ కాలేజ్ మాజీ వైఎస్ ప్రిన్సిపల్ నరవ ప్రకాశ్ రావు, అంబేద్కర్ భవన్ ప్రెసిడెంట్ కె. కల్యాణ్ రావు, సీనియర్ జర్నలిస్ట్ ఎస్. శివశంకర్ ఉన్నారు. ఈ సందర్భంగా కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ.కె.ఎస్. చలం గారు అంబేద్కర్ పై రాసిన పుస్తకాన్ని బహుకరించారు.