సీఎం చంద్రబాబుపై నాయి బ్రాహ్మణులు ఆగ్రహంతో ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయి బ్రాహ్మణులను సచివాలయ మెట్లెక్కకుండా చేయడం కాదు మేమే ఆయనని అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా చేస్తామని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు చంద్రబాబును హెచ్చరించారు. తరతరాలుగా గుడిలలో సేవలు చేస్తున్న నాయి బ్రాహ్మణులను ఎద్దేవా చేస్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలు బీసీ జాతికే అవమానకరమన్నారు. రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీ జనాభా ఓట్లు వేయనిదే చంద్రబాబు అధికారంలోకి వచ్చారా అని వారు ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో బీసీలంతా ఒక్కటి కావాలని మనమే పరిపాలనలో ఉండాలని నాయి బ్రాహ్మణులు బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించమని పోరాటం చేస్తే అణచివేయాలని చూడటమే కాకుండా అవమానకరరీతిలో మాట్లాడారని వారు ఆవేదనలో ఉన్నారు. ఇప్పటికైనా బీసీలంతా ఏకం కావాలని ప్రభుత్వం పై తిరుగుబాట చేయాలనే ఆలోచనలో వారున్నారు. కుల రాజకీయాలను బాబు ఏరికోరి తెచ్చుకుంటున్నారని బాబు సన్నిహితులు అంటున్నారు. ఒక్కో కులంతో గొడవల వలన ఆయన వారి మద్దతు కోల్పోవడమే కాకుండా వారికి దూరమవుతున్నారు. కాపులకు రిజర్వేషన్లు ప్రకటించాలని, బీసీల్లో చేర్చాలని పెద్ద ఉద్యమమే జరిగింది. వారికి కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల ఫండ్ కేటాయించి వారిని కాస్త సద్దుమణిగించగలిగారు చంద్రబాబు. రమణదీక్షితులు, ఐవైఆర్ కృష్ణారావు విషయంలో వ్యవహరించిన తీరుతో బ్రాహ్మణులకు దూరమయ్యారనే అపవాదు ఉంది. ఇప్పుడు నాయి బ్రాహ్మణులపై వ్యవహరించిన తీరుతో బీసీ సంఘాలన్ని ఏకమై చంద్రబాబుపై తిరుగు బావుటా ఎగురవేశాయి. మరీ వీరికి ఏ తాయిలాలు వేయనున్నారో బాబు అనే చర్చ జరుగుతుంది. బీసీల మద్దతు లేనిదే ఎన్నికల్లో ముందుకు వెళ్లడం అసాధ్యం. చంద్రబాబుకు వినతి పత్రమిద్దామని వస్తే సచివాలయ మెట్లెక్కనివ్వనని అనడం సరైన పద్దతి కాదని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా వ్యవహరించడం కూడా సరైన పద్దతి కాదన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బీసీ సంఘాలన్ని కూడా ముక్తకంఠంతో బాబుకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకునే పనిలో ఉన్నాయి. నాయి బ్రాహ్మణులను సచివాలయ మెట్లెక్కనివ్వడం కాదు మేమే బాబును అసెంబ్లీ మెట్లెక్కకుండా అడ్డుకుంటాం అప్పుడు ఆయన సచివాలయంలో ఎలా అడుగుపెడుతారో చూస్తామని నాయి బ్రాహ్మణులు సవాల్ విసిరారు. ఆ సవాల్‌కు అనుగుణంగా అన్ని బీసీ సంఘాలను కలుపుకుపోయే విధంగా నాయి బ్రాహ్మణులు పావులు కదుపుతున్నారు. చంద్రబాబు, నాయి బ్రాహ్మణుల పోరు బీసీలందరికీ చుట్టుకుంది. ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి మరీ…