వరంగల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా గోదాంలో జరిగిన పేలుడులో పది మంది సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తేలాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
వరంగల్ నగరంలోని భద్రకాళీ ఫైర్ వర్క్స్ గోదాం లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు చిన్నాభిన్నమై పోయాయి. భారీ పేలుడు కారణంగా శరీర భాగాలు మీటర్ల కొద్దీ ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించిపోయిది. ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో గోదాం లో 15 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతదేహాలను గుర్తించలేని స్థితిలో కాలిపోయి ఉన్నాయి. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. కరెంట్ షాక్ తో ఈ ప్రమాదం జరిగిందా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.