తెలుగు రాష్ట్రాల్లో బ్యూటీషియన్ శిరీష మరణం, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులు సంచలనం రేపాయి. ఈ ఘటనలు జరిగి ఏడాది గడుస్తోంది. ఇప్పుడు ఈ కేసులో ఎస్సై ప్రభాకర్ రెడ్డి సతీమణి రచనకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. పూర్తి వివరాలు చదవండి.
మెదక్ జిల్లా కుకునూరుపల్లి పోలీసు స్టేషన్లో ఏడాది క్రితం ప్రభాకర్ రెడ్డి అనే యువ ఎస్సై తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బ్యూటీషియన్ శిరీష మృతి కేసు తన మెడకు చుట్టుకుంటుందేమోనన్న భయంతో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన జరిగి ఏడాది గడిచిపోయింది.
కానీ ఆ ఎస్సై ప్రభాకర్ రెడ్డి భార్య రచనకు ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారంటూ రచన ఆరోపించారు. ఈ నేపథ్యంలో యాదాద్రి-భువనగిరి జిల్లా, ఆలేరు మండలం, టంగుటూరు గ్రామంలో తన భర్త ప్రభాకర్ రెడ్డి సంవత్సరీకం జరిపేందుకు రచన వచ్చారు. అయితే ఆమె అత్తగారింటికి వచ్చేసరికే అత్త, మామలు ఇద్దరూ ఇంటికి తాళం వేసి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. తన భర్త సంవత్సరీకం జరిపేందుకు ఇంటికొచ్చిన రచన చేసేది లేక ఇంటి ముందే భర్త ఫొటో పెట్టి సంవత్సరీకం జరిపారు.
అంతేకాదు ఇంటిముందే తన కొడుకుతో సహా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు రచన. తన అత్తింటి వారు కావాలనే ఇంటికి తాళాలు వేసి వెళ్లారని రచన ఆరోపించారు. ఒకవైపు భర్త ఆత్మహత్య చేసుకోవంతో పుట్టెడు దుఖంలో ఉన్న రచనను అత్తమామ దగ్గరికి రానీయడంలేదు. కూతురులా చూసుకోవాల్సిన అత్తమామ పట్టించుకోకపోవడంతో రచన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రచన ఆందోళనకు స్థానికులు మద్దతు పలికారు. రచనతోపాటు వాళ్లు కూడా వచ్చి ప్రభాకర్ రెడ్డి సంవత్సరీకం లో పాల్గొన్నారు. రచనను చూసిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రచన తనయుడిని చూసి సానుభూతి తెలిపారు.