ఆ విషయంలో డిఎస్ చాలా గ్రేట్ అని ఇటు టిఆర్ఎస్ కార్యకర్తలు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. తెలంగాణ రాజకీయ నేతలంతా ఒక దారిలో నడిస్తే డిఎస్ మాత్రం కంప్లీట్ ఉల్టా దారిలో నడిచారు. నిండు చందురుడు ఒకవైపూ చుక్కలు ఒకవైపూ అని పాటలో ఉన్నట్లే డిఎస్ నడుచుకుంటున్నారు. మరి డిఎస్ ఏ విషయంలో గ్రేట్ అని మీకు తెలుసుకోవాలని ఉంది కదా? అయితే చదవండి కంప్లీట్ ట్రెండింగ్ స్టోరీ.
డి శ్రీనివాస్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తులు ఉండరు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన పిసిసి అధినేతగా ఉన్న కాలంలో రెండుసార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లు పార్టీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే ఆయన అందులో ఒకసారి ఓటమిపాలయ్యారు.
ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో డిఎస్ నిలబడలేకపోయారు. అందుకే కేసిఆర్ తో మాట్లాడుకుని టిఆర్ఎస్ లో చేరారు. జులై 2వ తేదీ, 2015న డిఎస్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జులై 8వ తేదీ,2015న అధికారికంగా కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ లో చేరగానే డిఎస్ హోదాకు తగ్గట్టుగానే కేసిఆర్ పదవులిచ్చారు. డిఎస్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు కేసిఆర్. ఆ పదవిలో కొద్దిరోజులపాటు ఉండగానే డిఎస్ హోదాకు తగ్గట్టుగా రాజ్యసభ సీటు కట్టబెట్టారు.
డిఎస్ టిఆర్ఎస్ లో చేరేసమయంలో తెలంగాణవాదులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇషాన్ రెడ్డి ఆత్మ క్షోభిస్తది అంటూ హెచ్చరించారు. తెలంగాణవాది అయిన విద్యార్థి ఇషాన్ రెడ్డి మరణానికి డిఎస్ కారణమని, అలాంటి డిఎస్ ను టిఆర్ఎస్ లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఆ విమర్శలన్నీ డోంట్ కేర్ అంటూ కేసిఆర్ ఏకపక్షంగానే ముందుకు పోయారు. డిఎస్ కు సముచిత స్థానం కల్పించారు. తెలంగాణ కోసం కష్టపడిన వారిని కూడా పక్కకు నెట్టి డిఎస్ కు గౌరవం కల్పించారు.
ఇక ఈ పరిస్థితుల్లో డిఎస్ ఫ్యామిలీ వ్యవహారాలు కేసిఆర్ కు చిరాకు తెప్పించాయి. డిఎస్ కొడుకు ఒకరు కాంగ్రెస్ లో ఉంటే ఇంకొకరు బిజెపిలో ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం డిఎస్ తెర వెనుక చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారని, ఎంపి కవిత సీటుకే ఎసరు పెడుతున్నారన్న చర్చ నిజామాబాద్ లో సాగుతోంది. దీంతో ఆగ్రహం చెందిన కేసిఆర్ డిఎస్ ను సాగనంపేందుకు స్కెచ్ రెడీ చేశారు. అందులో భాగంగానే కవిత నేతృత్వంలో కేసిఆర్ కు లేఖ రాయడం. ఇంతవరకు బాగానే ఉన్నా.. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గులాబీ గూటికి చేరుకున్నారు. మరి అలాగే డిఎస్ కూడా గులాబీ గూటికి చేరారు. కానీ ఇక్కడే అసలు కిటుకు ఉంది. ఆ కిటుకేందో చదవండి.
తెలంగాణలో సుమారు 25 మంది ఎమ్మెల్యేలు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, వైసిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరారు. వీరంతా తమకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీలను ముంచి అధికార పార్టీలోకి జంప్ చేశారు. పైగా ఆయా పార్టీల నుంచి ప్రజల ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారా అంటే అదీ లేదు. ప్రజాతీర్పును హేళన చేసేలా అధికార పార్టీలో చేరారు. వీరితోపాటు పలువురు ఎంపిలు కూడా అదేబాటలో నిలిచారు. మల్కాజ్ గిరి ఎంపి మల్లారెడ్డి, నల్లగొడ ఎంపి గుతా సుఖేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటివాళ్లు కూడా అదేబాటలో నడిచారు. వారెవరూ తమ పదవులకు రాజీనామా చేయకుండా టిఆర్ఎస్ లో చేరారు.
కానీ ఇక్కడ డిఎస్ మాత్రం వేరు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో మాజీ మంత్రి హోదాలో ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్దన్ మీద ఓడిపోయారు. ఈనేపథ్యంలో ఏ పదవీ లేకుండా ఖాళీ చేతులతో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న డి శ్రీనివాస్.. తర్వాత రోజుల్లో టిఆర్ఎస్ లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం మరో నాలుగేళ్లపాటు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన మరికొద్ది క్షణాల్లో టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారు. లేదంటే ఆయనను కేసిఆర్ సస్పెండ్ చేసే అవకాశాలే ఉన్నాయి. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన మీద వేటు వేయాలని ఎంపి కవిత నాయకత్వంలో సిఎం కేసిఆర్ కు లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో డిఎస్ ను టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే డిఎస్ తన సొంత గూటికి చేరే అవకాశం ఉంది. డిఎస్ కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఒక ఎంపి సీటు వచ్చి చేరే అవకాశం ఉంది.
ఖాళీ చేతులతో వెళ్లిన డిఎస్ అధికార పార్టీలో పోస్టు కొట్టేసి తిరిగి సొంత గూటికి చేరితే.. మిగతావాళ్లు మాత్రం తమ పార్టీల్లో పదవులు పొంది అధికార పార్టీలో చేరారు. ఈ విషయంలో అందరు ఒకటైతే డిఎస్ ఒకటి అన్నట్లు ఉంది పరిస్థితి. అందరూ తమ పార్టీలకు షాక్ ఇచ్చి అధికార పార్టీలోకి జంప్ చేస్తే.. అధికార పార్టీలో పదవి పొంది ఆ పార్టీకే ఊహించని షాక్ ఇచ్చి డిఎస్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఒకవేళ డిఎస్ పదవికి రాజీనామా చేయాలని టిఆర్ఎస్ వత్తిడి చేసే అవకాశాలు లేకపోలేదు. కానీ ఆ ప్రయత్నం టిఆర్ఎస్ చేస్తే.. అంతే స్థాయిలో ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా రియాక్షన్ రావొచ్చు. ఎందుకంటే పదవులకు రాజీనామాలు చేయకుండానే పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపిలు టిఆర్ఎస్ లో చేరారు కాబట్టి వారిని రాజీనామా చేయిస్తేనే డిఎస్ కూడా రాజీనామా చేస్తారు అని డిఎస్ వర్గం వాదించే చాన్స్ ఉంది.
ఏది ఏమైనా పదవి అంటే ప్రాణంగా వ్యవహరించే డిఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ సభ్యత్వాన్ని ఒదులుకోలేరు అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.