తెలంగాణ మినీ డేరా బాబాగా ప్రాచుర్యంలోకి వచ్చిన రమణానంద మహర్షి గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాదాద్రి జిల్లాలో మినీ డేరాబాబా అనే కథనం ఇప్పటికే ప్రచురించాము. మరిన్ని అంశాలను డేరా బాబా స్టోరీ పార్ట్ 2 అందిస్తున్నాం. చదవండి.
సాయి భక్తులందరి దృష్టిలో రమణానంద మహర్షి కలియుగ దైవం సాయి బాబా తో సమానం. దానికి ఎక్కడ తగ్గకుండా ఈ మహర్షి అలియాస్ మినీ డేరాబాబా మాంచి మేకప్, అద్భుతమైన కాస్ట్యూమ్స్ తో భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తాడు. చేతి నిండా ఉంగరాలు, మెడ నిండా బంగారు తొడుగులతో దగదగలాడిపోతారు. ఆయన దగదగలు చూసి భక్తులు మైమరచిపోతారని చెబుతున్నారు.
ఒంటి నిండా రుద్రాక్షాలతో నిత్యం ఖరీదైన బంగారు తొడుగు సింహాసనంలో ఈ రమణానంద మహర్షి కొలువుదీరుతారు. అలా కూర్చొని అపర భక్తులకు ప్రవచనాలు చెప్పే ఖరీదైన మహర్షిగా రమణా నంద వ్యవహరిస్తున్నారు. రమణా నంద మహర్షి మొదటి నుండి వివిధ ప్రాంతాల్లో ముఖ్య పట్టణాల్లో సాయి బాబా పై ప్రవచనాలతో సాయి భక్తులను మెల్ల మెల్లగా ఆకర్షించి, తన వైపుకు తిప్పుకున్నాడు. వారంతా తనను నమ్మే విధంగా తన భక్తులుగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా షిరిడిలో సాయి భక్తుల్లో బాగా సాన్నిహిత్యం పెంచుకోవడం, తద్వారా సాయి గురించిన మరింత సమాచారంతో సాయి బాబా పై పుస్తకాలు రాయడంతో పూర్తిగా రమణా నంద మహర్షి ని సాయి బాబా భక్తులు నమ్మడం మొదలు పెట్టారు.
అదే అదునుగా అనుకున్న రమణా నంద’ శక్తి పాతం’ అంటూ ప్రవచనాల సమయంలో పరిచయం అయిన సాయి భక్తులతో తనకు సాయి దర్శనం కలిగిందని ప్రచారం షురూ చేశారు. సాయి బాబా తనకు శక్తి పాతం చేశాడని, అదే పద్ధతిలో తన భక్తులకు తాను శక్తిపాతం చేస్తానంటూ ఊదరగొట్టాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం నలుమూలల ఉన్న సాయి భక్తులకు రమణా నంద మహర్షి అపర సాయి బాబా అవతారమెత్తాడు.
శక్తి పాతం చేయాలంటే సుమారు ఐదు వేల రూపాయలు తీసుకొన్నట్లు ఆరోపణలున్నాయి. ఒకేసారి 100 మంది భక్తులకు ఒక ఏసీ హాలులో ఒకే సారి శక్తి పాతం చేస్తాడని అంటున్నారు. ఈ విషయంలో తమకు శక్తి పాతం కాలేదని భక్తులు ప్రశ్నిస్తే.. నన్ను పూర్తిగా నమ్మకపోవడంతోనే శక్తిపాతం కాలేదని అంటున్నాడట. తనను పూర్తిగా నమ్మితేనే శక్తిపాతం అనుభూతి కలుగుతుందని అంటున్నాడట.
ఇప్పుడు ఒక్క భువనగిరిలోనే రమణనాంద మహర్షి భక్తులు వందల సంఖ్యలో ఉన్నారు. వారంతా రమణానంద ఫొటోలను తమ తమ ఇంట్లో పెట్టుకుని నిత్య పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో, మీడియాలో రమణానంద లీలలు బయటకు రావడంతో భక్తులు షాక్ కు గురవుతున్నారు.
( * రచయిత వినయ్ కోసిక, జర్నలిస్ట్, యాదాద్రి భువనగిరి జిల్లా)
ఇంతకూ ఎవరీ రమణానంద మహర్షి.. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు.. అనే వివరాల కోసం పార్ట్ 3 కథనంలో చూడండి.
…………………………………………………………
మినీ డేరా బాబాపై ప్రచురితమైన పార్ట్ వన్ కథనం కోసం కింద లింక్ క్లిక్ చేయండి.
https://trendingtelugunews.com/mini-dera-baba-halchal-in-telangana/