ధార్మిక ప్రయోజనం కోసం కాకుండా రాజకీయపలుకుబడి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు విచ్ఛలవిడిగా వెచ్చించడం ఈ మధ్య జరుగుతూ ఉంది. దీని మీద తీవ్రంగా విమర్శలువస్తున్నా ఈ నిధుల మళ్లింపు ఆగడం లేదు. ఎమ్మెల్యేలు కోరారని గత నాలుగు సంవత్సరాలలో అనేక నియోజకవర్గాలలోని దేవాలయాల కోసం కోట్ల నిధులును టిటిడి అందించింది. ఇది సబబు కాదని విజ్ఞులు వాపోతున్నారు. టిటిడి అనేక వివాదాలలో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటపుడు మరొక నిధుల మళ్లింపు వ్యవహారం బయటపడింది.
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రైవేట్ ఆలయానికి రూ.4.76 కోట్ల శ్రీవారి నిధులు ఇవ్వబోతున్నారు. ఇదే ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం రూ.14 కోట్లు వెచ్చించి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ అన్ని వసతులు వస్తాయి. హైదరాబాద్ ఇప్పటికే హిమయత్ నగరలో టిటిడి కళ్యాణ మంటపం సేవలందిస్తూ ఉంది. అయినా, జూబ్లీ హిల్స్ లోనే మరొక ఆలయంలో కల్యాణ మండపం, అన్నదానం హాలు నిర్మాణం, కారు పార్కింగ్ ఏర్పాటుకు చేసేందుకు టిటిడి నిధులందిస్తున్నది. ఈ నిధులందివ్వడం వెనక రాజకీయ పలుకుబడి ఉందని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి 21.10.2016న ఒక లేఖ టిటిడికి అందింది. జూబ్లీ హిల్స్, రోడ్డు నెం.15లో ఉన్న సీతారామస్వామి ఆలయానికి కల్యాణ మంపడం, అన్నదాన హాలు, కారు పార్కింగ్ నిర్మాణానికి అవసరమైన రూ.4.76 కోట్ల నిధులు కేటాయించాలని ఆలేఖలో ఆన కోరారు.
దీనికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు జీవో ఆర్‌టి నెం.16, తేదీ : 03.01.2018ను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల సిఫార్సు వల్లనే ప్రైవేట్ ఆలయానికి నిధులు ఇవ్వడానికి సిద్ధపడ్డారనడానికి ఇంతకన్న సాక్ష్యం అవసరం లేదు. GO కోసం కింద క్లిక్ చేయండి
ఒక వైపు టిటిడి ఇప్పటికే జూబ్లీ హిల్స్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తూ మరొక వైపు అక్కడికి సమీపంలోనే ఉన్న ఆలయానికి నిధులందించడం ఏమిటి?
అవసరమైతే అక్కడే కల్యాణ మండపం నిర్మింవచ్చు. కానీ అదే ప్రాంతంలోని ఇంకో ఆలయానికి అనుబంధంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్న. పోనో అది ప్రభుత్వం అజమాయిషీలో ఉన్న ఆలయమా, అదీకాదు.
సాధారణంగా పురాతన ఆలయాలను పునరుద్ధరించడానికి టిటిడి నిధులు అందిస్తుంది. దేవాదాయ శాఖ అధీనంలోని ఆలయాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ ఆలయాల వద్ద యాత్రీకుల వసతి సముదాయాలు వంటివి నిర్మించడం చూశాం.
అలా కాకుండా ప్రైవేట్ ఆలయాలకు కల్యాణ మండపాలు నిర్మించడానికి, అన్నదాన సత్రాలు కట్టించడానికి, కారు పార్కింగులు ఏర్పాటుకు నిధులు ఇచ్చే సంప్రదాయం లేదని టిటిడిలో పనిచేసిన అధికారి ఒకరు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి లేఖ రావడం, ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం దానితో టిటిడి నిబంధనలను పక్కనపెట్టి రూ.4.76 కోట్ల కేటాయించడం జరిగిపోయాయి.
టిటిడి వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఎక్కువవుతోందని వస్తున్న ఆరోపణలకు ఇది ఊతమిస్తున్నది. రాజకీయ వత్తిళ్లకు లొంగి భక్తులిచ్చిన నిధులను ప్రయివేటు ఆలయాలకుమళ్లించడం మీద వ్యతిరేకత వస్తున్నది. ఆలయం అంత ముఖ్యమయినదయితే, తెలంగాణ ప్రభుత్వమే భక్తుల కోసం ఈ నాలుగున్నర కోట్లు అందించి ఉండవచ్చు. నాలుగున్నర కోట్లు అందివ్వ లేనంత దీనావస్థలో తెలంగాణ ప్రభుత్వం లేదు.