గత రెండేళ్ల కసరత్తు తర్వాత దానం నాగేందర్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన పార్టీలో చేరాల్సి ఉన్నా.. కేసిఆర్ కండువా కప్పను అనడంతో వెనుకంజ వేశారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కల్లోలంలోకి నెట్టేసి దానం కారెక్కేశారు. మరి దానం కారైతే ఎక్కారు కానీ.. ఇప్పుడు దానం నాగేందర్ పాత్ర టిఆర్ఎస్ లో ఏవిధంగా ఉంటుందన్న చర్చ హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా సీన్ లోకి పిజెఆర్ కూతురు విజయారెడ్డి ఎంటరయ్యారు. దీంతో టిఆర్ఎస్ పాలిటిక్స్ రంజుగా మారాయి.
దానం నాగేందర్ ఎట్టకేలకు టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయన కోరినట్లుగానే రెండేళ్ల తర్వాత సిఎం కేసిఆరే స్వయంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు టిఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైంది. దానం నాగేందర్ రానున్న ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు దానం రానున్న ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ తరుపున పోటీ చేస్తారని ప్రచారం సాగుతున్నది. దాంతోపాటు దానం ను మల్కాజ్ గిరి పార్లమెంటుకు పంపుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అలా కాదు దానం సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు వినబడుతున్నాయి. అయితే దానం మాత్రం తాను ఖైరతాబాద్ లోనే పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఖైరతాబాద్ సీటుపై ఆశలు పెట్టుకుని వర్క్ చేసుకుంటున్న దివంగత నేత పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి ఆందోళనతో ఉన్నట్లు చెబుతున్నారు. ఎలాగైనా ఖైరతాబాద్ లో టిఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలిచి తీరాలన్న కసితో విజయారెడ్డి ఉన్నారు. ఆ మేరకు ఆమె కసరత్తు చేస్తున్నారు. తన తండ్రికి ఉన్న మాస్ ఇమేజ్ రిత్యా విజయారెడ్డి తండ్రికి తగిన బిడ్డ అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దానం నాగేందర్ కు ఖైరతాబాద్ టికెట్ ఇస్తామని హామీ ఇస్తే తాను తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతానని ఆమె తన సన్నిహితుల వద్ద అన్నట్లు వార్తలొస్తున్నాయి. దానం నాగేందర్ కు మల్కాజ్ గిరి పార్లమెంటు కానీ, సికింద్రాబాద్ పార్లమెంటు కానీ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. ఇప్పటికే విజయా రెడ్డి టచ్ లోకి కాంగ్రెస్ సీనియర్లు కొందరు వెళ్లినట్లు చెబుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఖైరతాబాద్ లో బిసి ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా గౌడ సామాజికవర్గం ఓటర్లు భారీగా ఉన్నారని, అందుకే ఖైరతాబాద్ లో పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ కోరుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఒకవేళ బూర నర్సయ్యకు హామీ లభించినా విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చన్న టాక్ నడుస్తోంది.
దానం నాగేందర్ టిఆర్ఎస్ లోకి రానైతే వచ్చారు కానీ.. దానం దారెటు అన్నది ఇంకా తేలలేదని టిఆర్ఎస్ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.