తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
తన రాజీనామా లేఖను పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. దానం నాగేందర్ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
శనివారం తన భవిష్యత్ కార్యాచరణను దానం నాగేందర్ ప్రకటించనున్నారు. ఆయన టిఆర్ఎస్ గూటికి చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
నిజానికి దానం నాగేందర్ గతంలోనే టిఆర్ఎస్ లో చేరేందుకు స్కెచ్ ప్రిపేర్ చేసుకున్నారు. అయితే కేసిఆర్ కండవా కప్పితేనే టిఆర్ఎస్ లో చేరతానని ఆయన చెప్పారు. కానీ కేసిఆర్ కాకుండా పార్టీ నేతలు దానం ను చేర్చుకుంటారని తెలియడంతో దానం వెనుకంజ వేశారు.
టిఆర్ఎస్ లో చేరుతున్నానంటూ.. అప్పట్లో.. జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు హైదరాబాద్ రోడ్ల నిండా కట్టించారు దానం. కానీ చివరి నిమిషంలో కేసిఆర్ కండవా కప్పడంలేదని తెలియడంతో గులాబీ గూటికి చేరకుండా వెనుకంజ వేశారు.
తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినా.. పెద్దగా దానం హడావిడి కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తప్ప ఆయన మార్కు హడావిడి లేదు. అయితే దానం నాగేందర్ టిఆర్ఎస్ లోనే చేరతారా? లేదా మరేదైనా పార్టీలో చేరతారా అన్నది కూడా చర్చ జరుగుతోంది.
ఆయన ముందున్న ఆప్షన్లలో బిజెపిలోకి దానం వెళ్లేందుకు అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. లేదంటే తెలంగాణ జన సమితి కూడా దానం ముందున్న ఆప్షన్లలో ఒకటిగా చెబుతున్నారు. శనివారం ఏ పార్టీలో చేరేదీ దానం తేటతెల్లం చేయనున్నారు.
ఇది ఇలా ఉంటే… దానం రాజీనామా చేసునట్టు వస్తున్న ప్రచారం నేపథ్యంలో దానం తో మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలసి ఆయన దానం నివాసానికి వచ్చారు.అయితే, దానం ఇంటి వద్ద లేకపోవడంతో ఫోన్ లో మాట్లాడారు. ఈసాయంకాలం దానం ఉత్తమ్ ను కలవ వచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరొక వైపుపార్టీని మాజి మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారని వదంతులు వ్యాపించాయి. ఆయన
త్వరలో టిఆర్ఎస్ లొ చేరే అవకాశం ఉందని వినపడుతూ ఉంది.