తోడల్లుడు చంద్రబాబునాయుడు అమరావతి రాజధాని డ్రీమ్ ని ఎన్టీరామారావు పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉతికి ఆరేశారు. అంతేకాదు, జగన్ పనితీరును ప్రశంసించారు. ఎన్టీయార్ పరివారం నుంచి తొలిసారి అమరావతి రాజధానికి వ్యతిరేకత వచ్చింది. రాజధాని మీద నివేదిక సమర్పించిన శివరామకృష్ణ న్ సిఫార్సులకు దగ్గరగా దగ్గుబాటి మాట్లాడారు. ‘ఒక మంచి నగర నిర్మాణం చేయాలనుకోవడంలో తప్పు లేదుఅయితే మూడు పంటలు పండే భూములు ను రాజధానికి కోసం ఎంపిక చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. రాజధానికి పంటలు పండని ప్రాంతమే సరైందని, అలాంటి చోట రాజధాని నిర్మాణం చేస్తే బాగుండేదని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. అంతేకాదు, అమరావతి చుట్టూ చంద్రబాబు నాయుడు అనేక పారిశ్రామికనగరాలను అభివృద్ధి చేయాలనుకుంటూ గ్రాండ్ ప్రపోజల్ ను కూడా దగ్గుబాటి వ్యతిరేకించారు. ‘పరిశ్రమలు కూడా నగరాలకు దూరంగా ఉండాలనేది నాఅభిప్రాయం’ అని చెప్పారు. అంటే తోడల్లుడు చంద్రబాబు కృష్ణా ఒడ్డు కలల నగరాన్ని వ్యతిరేకిస్తున్నారన్నమాట. ఇది జగన్ చేస్తున్న చంద్రబాబు వ్యతిరేక క్యాంపెయిన్ కు కొండంత బలాన్నిస్తుంది.ఎందుకంటే, జగన్ ఎపుడో అమరావతిలో భూములను రైతులకు వాపసు ఇస్తానని ప్రకటించేశారు.
ఈ రోజు దగ్గుబాటి విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని అంటూ, రాజధాని విషయంలో ఎవరైనా అభ్యంతరాలు, ఆలోచనలు చెబితే వాటిని విమర్శగా తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజక్టును కేంద్రం జాతీయ ప్రాజక్టుగా మారిస్తే, రాష్ట్రం చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత పనితీరు మీద ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్పయాత్ర గురించి మాట్లాడుతూ ఈ యాత్రతో జగన్ నిలదొక్కుకున్నారని అన్నారు.
అలాగే ఇప్పటి రాజకీయాల మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
నేను ఏ ఎన్నికల్లోనూ డబ్బులు పంచలేదు..కానీ ఎమ్మెల్యే గా అందరికీ అందుబాటులో ఉండటమేనా విజయ రహస్యంఅని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
ప్రతి నియోజకవర్గం లో 20కోట్లు ఖర్చు పెడితే ఇక వారు ప్రజా సేవ ఏమి చేస్తారు.ఓడినోడు అక్కడే ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికెళ్లి ఏడుస్తాడు అని అంటున్నారు.పురంధరేశ్వరి పోటీలో ఉన్న మా బడ్జెట్ ప్రకారం ఖర్చు చేశామే తప్ప.. అదనంగా పైసా ఖర్చు పెట్టలేదు. కావాలంటే..ఆ నియోజక వర్గం లో నేతలను అడిగి తెలుసుకోవచ్చు. 1983లో ఐదు వేల ఖర్చుతో టిడిపి ఎమ్మెల్యే అయినోళ్లు ఉన్నారు. నేను రాజకీయాలకు దూరంగా ఉండటానికి ప్రస్తుత విధానాలు కూడా ఒక కారణం. రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకో దలుచుకోలేదు. నా సతీమణి పురంధరేశ్వరి బిజెపి లో ఉన్నా… నేను మాత్రం ఏ పార్టీ లో లేను, చేరను.