వెనుకబడిన రాయలసీమ పారిశ్రామిక అభివృద్దికి కీలకమయిన ‘కడప ఉక్కు’ ను సాధించుకోవడానికి రాయలసీమ విద్యార్ధులు ఐక్యంగా పోరాడాలని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి పిలుపునిచ్చినారు. కడప ఉక్కు సాధన కోసం రాయలసీమ విద్యార్ది సంఘం (ఆర్ యస్ యు) చిత్తూరు జిల్లా కమిటి తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఒక్కరోజు నిరాహర దీక్ష చేపట్టింది. జిల్లా కమిటి అధ్యక్షులు క్రిష్ణారెడ్డి సారధ్యంలో ఈ దీక్ష ప్రారంభమైంది.
దీక్ష చేస్తున్న విద్యార్దులనుద్దేశించి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో బాటు పారిశ్రామిక అబివృద్ధి కూడా కీలకమని, రాయలసీమ అభివృద్దికి ప్రభుత్వరంగంలోని కడప ఉక్కు, మన్నవరం కీలక అవసరం అని మర్చిపోరాదని, వాటిని ఏర్పాటు చేయడంలో సాగుతున్న అలసత్వాన్ని ఎదిరించాలని ఆయన అన్నారు.
రెండూ కూడా విభజన చట్టంలో హక్కుగా నాటి కేంద్రం చేసిందని అమలు చేయాల్సిన ప్రస్తుత కేంద్రం చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటివరకు దేశంలోనూ ఏర్పాటు చేసిన ప్లాంటులతో పాటు రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కన్నా అన్ని విధాలా స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు కడప అనువైన ప్రాంతం అవుతుందన్నారు. అయినా కేంద్రం మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు.
‘ముఖ్యమంత్రి బాబుగారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి దేశ, విదేశాలు తిరుగుతున్నారు. విభజన చట్టం ప్రకారం రాయలసీమకు కనీసం 1.5 లక్షల కోట్లు విలువ చేసే సంస్దలు హక్కుగా ఉన్నప్పటికి వాటి కోసం కాకుండా సీమకు పెద్దగా ఉపయోగపడని హోదా కోసం పోరాటం చేయడం సరికాదు, ’ అని ఆయన పరోక్షంగా హోదా కోసం పోరాడుతున్న పార్టీలను కూడా విమర్శంచారు.
‘విభజన చట్టం కేంద్రం దయ కాదు. అది చట్ట ప్రకారం ప్రజలకు లభించిన హక్కు. దానిని కేంద్రం అమలు చేయకపోతే ప్రజల తరపున సుప్రీంకు వెల్లాల్సిన బాద్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. కేంద్రంపై పోరాటం చేస్తాను అంటున్న బాబుగారు. విభజన చట్టంలోని అంశాలని అమలు చేయని కేంద్రంపై న్యాయపరమైన పోరాటానికి ఎందుకు ముందుకు రావడం లేదు’ అని ప్రశ్నించారు.
తెలంగాణకు చెందిన సుధాకర్ రెడ్డి సుప్రింకు వెళ్లడం వలనే కడప ఉక్కు నేడు ఇంతగా చర్చకు వచ్చిందని, ఆ కేసులేకుండా అది సాధ్యం అయ్యేదికాదని గుర్తుచేస్తూ విభజన చట్టంలో కడప ఉక్కు, మన్నవరం, గుంతకల్లుకు రైల్వేజోన్, నంద్యాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, దుగరాజపట్నం ఓడరేవు, గాలేరు నగరి, హంద్రీ నీవకు నిధులు , సీమ అభివృద్ధి నిధులు 12 వేల కోట్లుకు సంబందించిన అంశాలన్నాయనిమాకిరెడ్డి అన్నారు. ఈ అంశాలను అమలుచేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదని, దీనిపై కేంద్రం మీద సుప్రీంకు వెళ్ల్లాలని ఆయన డిమాండు చేసినారు.
అలా చేయకుండా కేంద్రంపై పోరాడుతామని ముఖ్యమంత్రి మాటలకే పరిమితమయితే అది కేవలం రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు.
లేదా విభజన చట్టం అమలు చేయించుకునే విషయంలో తాను కూడా తప్పులు చేసిన కారణంగనే చట్టంపరంగా పోరాటం చేయడం లేదు అని అనుమానించాల్సివస్తుందని హెచ్చరించారు.
క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యా సంస్దలు ప్రారంభమైనాయని కేంద్రం తక్షణం స్పందించి కడప ఉక్కును ఏర్పాటు చేయకపోతే సీమ విద్యార్దులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
చంద్రబాబు అమరావతి, పోలవం నిర్మాణం విషయంలో పెడుతున్న శ్రద్ద రాయలసీమ హక్కుల విషయం చూపడం లేదని సీమ పట్ల వివక్షగా బావించాల్సి వస్తుదని విమర్సించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూపాల్ , శ్రీకాంత్, విష్ణు, లీలాక్రిష్ణా, రాజేష్, నాగేష్, చంద్రమౌళిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.