తెలంగాణ సిఎం కేసిఆర్ రాజకీయంగా ఏ అడుగు వేసినా.. తీవ్ర చర్చను లేవనెత్తడం ఖాయం. ఆయన హడావిడి చేసినా.. మౌనంగా ఉన్నా.. రాజకీయ ప్రత్యర్థులు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంటారు. మరి తాజాగా కేసిఆర్ ఢిల్లీ పర్యటన కూడా ఇదే కోవకు చెందినదే. కేసిఆర్ హస్తిన పర్యటనపై అనేక ప్రశ్నలు, సందేహాలు, మరెన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఒకసారి పరిశీలిద్దాం.
తెలంగాణ సిఎం కేసిఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన చేశారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీతో కలిశారు. రాష్ట్ర ప్రగతి కోసం కావాల్సిన నిధులపై వినతిపత్రం సమర్పించారు. తదుపరి రోజు నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటన పూర్తిగా తెలంగాణ ప్రభుత్వాధినేత హోదాలోనే సాగినట్లు చెబుతున్నారు. ఈ దఫా పర్యటనలో రాజకీయపరమైన ప్రాముఖ్యత ఏమాత్రం కనిపించిన దాఖలాలు లేవు.
గత కొంతకాలంగా జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసిఆర్ చాలా ఖరీదైన హడావిడి చేశారు. ఫ్రంట్ కార్యకలాపాల కోసం ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక విమానాన్ని వదలలేదు కేసిఆర్. ఫ్రంట్ విషయమై కోల్ కతా వెళ్లి మమతా బెనర్జీని కలిసి వచ్చారు. తర్వాత బెంగుళూరు వెళ్లి కుమార స్వామిని, మాజీ ప్రధాని దేవెగౌడ ను కలిశారు. తమిళనాడు వెళ్లి కరుణానిధి, స్టాలిన్ ను కలిసొచ్చారు. రానున్న రోజుల్లో దేశంలో ఫెడరల్ ఫ్రంట్ చక్రం తిప్పబోతుందని ప్రకటించారు. దేశంలోని అన్ని భాషల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం తరుపున పత్రికా ప్రకటనలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో కేసిఆర్ ఢిల్లీ పర్యటన పట్ల రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగాయి. కేసిఆర్ ఫ్రంట్ ను మరింత వేగంగా ముందుకు తీసుకుపోతారని భావించారు.
కానీ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీలో కేసిఆర్ ఎలాంటి హడావిడి చేసినట్లు కనబడలేదు. ఇతర రాష్ట్రాల రాజకీయ నేతలను సైతం కేసిఆర్ కలుసుకున్న దాఖలాలు లేవు. ప్రధానితో భేటీ, తర్వాత నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు తప్ప ఫ్రంట్ హడావిడి ఎక్కడా చేయలేదు. పైగా ఎపి సిఎం చంద్రబాబు, బెంగాల్ సిఎం మమత, కేరళ సిఎం విజయన్, కర్ణాటక సిఎం కుమారస్వామి నలుగురు కలిసి ఢిల్లీలో హడావిడి చేశారు. వీరు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ ను కలిసేందుకు ప్రయత్నించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో ధర్నా చేస్తున్న అరవింద్ కేజ్రివాల్ ను కలిసేందుకు వీరు ప్రయత్నించినా.. వారికి అనుమతి రాలేదు. దీంతో కేజ్రివాల్ కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.
కానీ ఆ సమయంలో ఢిల్లీలోనే ఉన్నప్పటికీ కేసిఆర్ మాత్రం వీళ్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. వీరిని కలిసేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి ధర్నా చేస్తున్న సందర్భంలో ఆయనకు సంఘీభావం ప్రకటించడం కానీ.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు కానీ కేసిఆర్ ప్రయత్నించలేదని చెబుతున్నారు. ఒకవైపు నలుగురు ముఖ్యమంత్రులు వెళ్లి కేజ్రివాల్ సతీమణి, కేజ్రివాల్ పిల్లలను పలుకరించి వచ్చారు. కేజ్రివాల్ ఆందోళనకు మద్దతు పలికారు. అంతేకాదు కేజ్రివాల్ విషయంలో ప్రధాని మోదీని కలిసి ‘మేమంతా ఏమవుతున్నాం జాత్రగ్త’ అనే సందేశం కూడా ఇచ్చారు.
ఆ నలగురు సిఎంల బృందంలో కూడా కేసిఆర్ కనబడలేదు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్న కేసిఆర్ ఢిల్లీలో మాత్రం ఎందుకు జాతీయ రాజకీయాలకు దూరంగా ఉన్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కేసిఆర్ తనతో కలిసి వస్తారనుకున్నవారంతా చంద్రబాబుతో కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని ఢిల్లీలో హల్ చల్ చేశారు. మరి కేసిఆర్ మాత్రం వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. స్పెషల్ ఫ్లైట్ లలో కోల్ కతా, బెంగుళూరు, చెన్నై వెళ్లి ఫ్రంట్ పేరుతో వారితో సమావేశమైన కేసిఆర్ ఢిల్లీలో మాత్రం సైలెంట్ గా ఎందుకున్నారబ్బా అని ఇటు గులాబీ నేతల్లోనూ చర్చోపచర్చలు సాగుతున్నాయి.
అయితే కేసిఆర్ ఈ దఫా ఢిల్లీ యాత్ర కేవలం రాష్ట్ర ప్రభుత్వాధినేతగా చేసింది కాబట్టి రాజకీయ పరమైన వ్యవహారాలను పట్టించుకోలేదని టిఆర్ఎస్ నేత ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానితో భేటీ, నీతి ఆయోగ్ సమావేశంలో కేసిఆర్ ప్రసంగం ఉన్నాయన్నారు.
మొత్తానికి కేసిఆర్ జాతీయ రాజకీయ తెర మీదకు తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ పట్ల మళ్లీ జనాల్లో చర్చలు మొదలైన పరిస్థితి ఉంది.