నిన్నమొదలయిన ఢిల్లీ రాజకీయ వడగాడ్పు మధ్య ఈ రోజు నీతిఆయోగ్ పాలక మండలి నాలుగో సమావేశం దేశ రాజధాని కొత్త ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతిభవన్‌లో జరుగుతోన్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ, తమిళనాడు వంటి ముఖ్యమంత్రులు తప్ప బిజెపియేతర ముఖ్యమంత్రులంతా కేంద్రం,ప్రధాని మోదీ పోకడల మీద బాగా ఆగ్రహంతో ఉన్నారు. ఫెడరల్ విధానాన్ని మోదీ తొక్కేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. రాష్ట్రాల మీద పెత్తనం బాగా పెరిగిందని, బిజెపికి ప్రయోజనంలేని రాష్ట్రాల మీద వివక్ష చూపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం మీద ఇలాంటి ధోరణిని ప్రదర్శిస్తున్నందునే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో ధర్నా చేస్తున్నారు. ఈ కారణంగా ఆయన నేటి నీతి ఆయోగ్ సమావేశానకి హాజరు కాలేదు.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కెసిఆర్ ఫెడరల్ ఫ్రంటు పేరుతో ఏదో ఉద్యమం చేయాలనుకుంటున్నా నిన్న బిజెపియేతర ముఖ్యమంత్రుల సమావేశానికి రాలేదు. కేజ్రీవాల్ ను కలుసుకోవాలనుకోలేదు. కేవలం చంద్రబాబు నాయుడు, మమతాబెనర్జీ,పినరయి విజయన్, కుమార స్వామి మాత్రమే, కేజ్రీవాల్కు సంఘీ భావం తెలిపారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నీతి ఈ భేటీకి హాజరుకాలేదు. కేంద్రానికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ఇంకా ధర్నా చేస్తోన్న విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఆరు అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అజెండాలోని అంశాలపై పాలకమండలి చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ముగియనుంది.