(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి*)
రాయలసీమకే తలమానికం అవుతుందని భావించిన కడప ఉక్కు పరిశ్రమ రాజకీయ వివాదాలలోకి నెట్టబడున్నది. తెలంగాణకు చెందిన ఓ రాజకీయ నాయకుడు విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయడం లేదని ఆ చట్టం ప్రకారం కడప , బయ్యారం లో ఉక్కు పరిశ్రమలు స్థాపించాలని అందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తుందని సుప్రీం కోర్టు లో కేసు దాఖలు చేసినారు. సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడివిట్ నేడు వివాదానికి మూలం అవుతున్నది.
విభజన చట్టం- సుప్రీం కేసు
విభజన చట్టం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాలలో కొన్ని సంస్దలను, పరిశ్రమలను స్దాపించాలి. అందులో ఒకటి కడప ఉక్కు. విభజన చట్టంలో కడప ఉక్కుకు సంబంధించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. విభజన జరిగిన 6 నెలలలోగా సాద్యా, సాద్యాలను పరిసీలించాలని అందులో పేర్కొన్నారు. ఆ విషయాన్నే కేంద్రం సుప్రీంకు చెప్పింది. 6 నెలలలో పరిశీలించాలని ఉన్నదని ఆమేరకు పరిశీలించగా సాధ్యం కాదని ఒక కమిటీ నివేదిక ఇచ్చిందని ఈ విషయాన్నే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తాము చెప్పినామని పేర్కొన్నది. ప్రజల కోరిక మేరకు మెకాన్ సంస్దను నియమించామని ఉభయ రాష్ట్రాలు ఆ సంస్థతో సంప్రదింపులు జరిపి ఉక్కు పరిశ్రమ స్దాపనకు ఉన్న అవకాశాలను పరిశీలించామని కోరినట్లు అఫిడివిట్ లో పేర్కొన్నారు. కడపలో పరిశ్రమ ఏర్పాటు చేస్తాదామని గానీ చేయమని గాని కేంద్రం స్పష్టంగా చెప్పలేదు.
2019- కడప ఎన్నికలే నేటి వివాదానికి మూలం
వైసీపీ పార్లమెంట్ సభ్యుల రాజీనామా ఆమోదం జరిగితే త్వరలోనే ఎన్నికలు వస్తాయి. అందులోనూ కడప జిల్లా రిదిలోనే కడప, రాజంపేట స్దానాలకు ఎన్నికలు జరుగుతాయి. అది కాక పోతే ఏడాదిలో రాష్ట్రం మొత్తం మీద ఎన్నికలు జరుగుతాయి. ఇంత కాలం మౌనంగా ఉన్న పార్టీలు నేడు సర్వశక్తులు కేంద్రీకరించి ఆందోళన చేయడానికి మూలం కడప ఉక్కు మీద ఉన్న ప్రేమ కన్నా ఎన్నికల ద్యాసే ఎక్కువ. కేంద్రం సుప్రీం కు ఇచ్చిన నివేదికలో చట్టం ప్రకారం 6 నెలలలోనే కడప ఉక్కు సాద్యం కాదని చెప్పినట్లు ఉంది. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసని తెలిపింది. అపుడు బాబు గారు నోరు మెదప లేదు. సరికదా కడప ఉక్కు రాకపోవడానికి కారణం నాడు విభజన చట్టాన్ని కాంగ్రెస్ సరిగా అమలు చేయకపోవడం వలనే ఈ దుస్థితి వచ్చిందన్నట్లు మాట్లాడారు. పరిస్దితిని సరిదిద్దాడానికి తాము ఇబ్బంది పడుతున్నట్లు మాట్లాడినారు. నేడు కేంద్రం సుప్రింకు ఇచ్చిన నివేదికలో ప్రజల విజ్ణప్తి మేరకు మరో కమిటి పరిశీలిస్తుంది అన్నట్లుగా వివరణ ఇచ్చినారు. 2014లో కుదరదు అని చెప్పినపుడు కేంద్రానికి మద్దతు ఇచ్చి, చట్టం బాగాలేదని మాట్లాడిన బాబు నేడు కేంద్రంతో రాజకీయంగా దూరం అయిన వెంటనే పరిశీలనలో ఉంది అని మాట్లాడుతున్నపుడు కేంద్రంపై యుద్దం ప్రకటించడం రాజకీయం కాక మరేమవుతుంది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినపుడు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు ఎందుకు కాకూడదు?
నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని రాజకీయ పార్టీలు పోరాడి సాధించుకున్నాయి. ఆంధ్రుల హక్కు అంటే అర్థం ప్రజలందరూ పోరాడాలని. కానీ నేడు రాజకీయ పార్టీలు కడప ఉక్కు కేవలం రాయలసీమ హక్కు అని నినాదం చేస్తున్నాయి. అంటే కడప ఉక్కును సాధించుకునే బాధ్యత రాయలసీమ ప్రజలది మాత్రమే అని అర్థం. గోదావరి, క్రిష్ణా డెల్టాలకు ఉపయోగపడే పోలవరం ఆంధ్రుల జీవనాడి అని, వారికి మాత్రమే ఉపయోగపడే హోదా ఆంధ్రుల హక్కు అని మాట్లాడతూ అన్ని ప్రాంతాలలో ఆందోళన చేయిస్తున్న రాజకీయ పార్టీలు రాయలసీమకు ఉపయోగపడే కడప ఉక్కు విషయంలో మాత్రం అది మీ బాధ్యత అన్నట్లు రాయలసీమ ప్రజలకు సలహా ఇస్తున్నాయి. పోలవరం, హోదా కోసం రాష్ట్ర ప్రజలు పోరాడాలి, కడప ఉక్కు కోసం మాత్రం కడప, రాయలసీమ ప్రజలు మాత్రమే పోరాడాలి అన్నట్లుగా మాట్లాడుతున్న రాజకీయ పార్టీలకు సమైక్యతను గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నాదా.
బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ అమలపై తన నిజాయితీని నిరూపించు కోవాలి
కొన్ని నెలల క్రితం కర్నూలు కేంద్రంగా బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది. ఆ పార్టీ రాజకీయ విషయాలపై భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ రాయలసీమ ఉద్యమ సంస్థలు వారి డిక్లరేషన్ ను స్వాగతించాయి. బీజేపీ చేతిలో ఉండి, వారు ఆమోదించిన అంశాల అమలుకు ముందుకు రావాలి. వారి తీర్మానంలో ముఖ్యమైనది రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడం. హైకోర్టు విభజన, రాష్ట్రంలో దాని ఏర్పాటు విషయం కేవలం రాష్ట్రం ఫరిదిలోనే లేదు. రాష్ట్రపతి ఆమోదం కూడా అవసరం రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ సూచనను పాటిస్తారు కనుక బీజేపి తన తీర్మానాన్ని కేంద్రంకు చెప్పి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటులో తన వంతు పాత్రను నిర్వహించాలి. కడప ఉక్కు సాధ్యం కాదని కమిటీ నివేదికలను ప్రస్తావించడం కేవలం సాంకేతికమైనది మాత్రమే. రాజకీయ నిర్ణయం ప్రధానం. విశాఖ ఉక్కు పరిశ్రమకు ముడి సరుకు పక్కన ఉన్న ఒడిస్సా నుంచి వందల కి మీ దూరంలో ఉన్న అనంతపురం నుంచి కేటాయించగా పదుల కి మీ దూరంలో ముడిసరుకు అందుబాటులో ఉన్న కడపలో పరిశ్రమ స్దాపించడానికి అవకాశం లేదనడం అంగీకారం కాదు. ఈ మద్యనే విశాఖ ఉక్కు విస్తరణకు 52 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రటించన కేంద్రం కడప ఉక్కు పరిశ్రమ విషయంలో సాంకేతిక అంశాలను ప్రస్తావించి తప్పించకోవాలను కోవడం ఆక్షేపనీయం. తమ ఫరిదిలోని అంశాలను అమలుచేయడం ద్వారా మాత్రమే రాయలసీమ పట్ల తమ నిజాయితీనీ బీజేపీ నిరూపించుకో గలుగుతుంది.
సీమ ప్రజలు పార్టీల రాజకీయ క్రీడకు దూరంగా ఉండాలి
కడప ఉక్కు సాధనకు ఎనాడు నిజాయితీగా ప్రయత్నించని రాజకీయ పార్టీలు తమ, తమ రాజకీయ అవసరాల కోసం కడప ఉక్కును వాడుకునే ప్రక్రియకు పూనుకున్నాయి. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న పార్టీలు నేడు సీమ ప్రజలకు సంజాయిషీ ఇచ్చి పోరాటానికి సిద్దం కావాలి. పోలవరం, హోదా విషయంలో ఏ పద్దతిలో పార్టీలు రాష్ట్రం అంతా పోరాటాన్ని నిర్వహించినాయో కడప ఉక్కు కోసం కూడా అలానే పోరాడినప్పుడు మాత్రమే సమస్యపరిష్కారం అవుతుంది. అలాంటి వత్తిడిని రాజకీయ పార్టీలపై తీసుకురావాల్సిన బాద్యత సీమ సమాజంపై ఉన్నది.
*M. Purushothsm Reddy, Tirupathi 9490493436