చంద్రబాబుతో సమావేశమయినట్లు సమాచారం
ముహూర్తం కూడా ఈ నెల్లోనే, వైరలవుతున్న వార్త
కర్నాటక ఎన్నికల తర్వాత కింగ్ మేకర్ హోదా చాలా మంది కన్నేస్తున్నారు. ఎందుకంటే, అవకాశవస్తే కుమారస్వామిలాగా కింగేకావచ్చు. ఇలా ఆశ తెలంగాణ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలో రగులుకుందని చెబుతున్నారు. తెలంగాణలో ఏదైనా పార్టీకికింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటే గింటే అది తెలుగుదేశం పార్టీయే. అలాంటి పార్టీలో నేతగా ఉంటే చక్రం తిప్పవచ్చు. అందువల్ల కాట్లాటల కాంగ్రెస్ నుంచి వెనక్కు పోయి, టిడిపిని కింగ్ మేకర్ ని చేస్తే… ఎలా ఉంటుంది. ఆ మధ్య టిడిపిని వదిలి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిలో రాజుకున్న పునరాలోచన. ఆయన ఒక టిడిపిలోకి తిరుగముఖం పట్టాడని, సొంతగూటికి ఈ నెల్లోనే చేరుకుంటారనే వదంతి వైరలయ్యింది సోషల్ మీడియాలో… ఆ కథేమిటో చదవండి:
రేవంత్ రెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్, తెలంగాణా లో కెసిఆర్ కి దీటు గా విమర్శలు చెయ్యగలిగే యువనేత. తన వాగ్ధాటి తో తెలుగు దేశం లో అంచలంచెలు గా ఎదిగిన రేవంత్ రెడ్డి కి ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ. నిస్సందేహం గా తెలంగాణా లో గొప్ప ప్రభావవంతమైన నాయకుడు. కేసిఆర్ ను పడగొట్టి టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపడం అనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి అనూహ్యం గా తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
రేవంత్ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్ ఇష్టా రాజ్యం గా సాగింది. పార్టీలో పూర్తి స్వేచ్ఛని రేవంత్ కు ఇచ్చారు అధినేత చంద్రబాబు. టిడిపిలో సీనియర్లు ఉన్నా, సైలెంట్ గా ఉండడంతో ఆ పార్టీలో రేవంత్ ఇష్టారాజ్యం సాగింది. ఈయనలాగా మాట్లాడేవారు లేకపోవటం తో రేవంత్ రెడ్డి వన్ మాన్ షో మూడున్నరేళ్ళు నడిచింది.ఒకవేళ సీనియర్లు ఏమైనా కలగజేసుకున్నా,వాళ్లను పార్టీ అధినేత చంద్రబాబు కంట్రోల్ చేసేవారు. ఇదిలా ఉంటె కాంగ్రెస్ లోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయ్ రేవంత్ కి. తెలంగాణా తెలుగుదేశం లో అనఫీషియల్ పార్టి అధ్యక్షడు స్థాయి ఎంజాయ్ చేసిన రేవంత్, కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఏదన్నా మాట్లాడాలన్న ప్రోటోకాల్, అనుమతులు తప్పని సరి అని చెప్పారు. ఒకవేళ ఏదైనా సబ్జెక్టు ఎంచుకుని ప్రెస్ మీట్ పెట్టాలంటే, అధిష్టానం నుంచి అనుమతి వచ్చే పరిస్థితులు లేవని రేవంత్ బహిరంగంగానే వాపోతున్నారు.
టిడిపిలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో అక్కడ మంచి మైలేజ్ తెచ్చుకున్నారు రేవంత్. పూర్తీ స్వేచ్చ ఉంటుంది అన్న రాహుల్ హామీ మేరకు కాంగ్రెస్ లో చేరిన రేవంత్ ఇప్పుడు మాటి మాటి కి ఈ నిభందనల తో ఇబ్బంది పడుతున్నాడు. రేవంత్ కాంగ్రెస్ లోకి చేరి పాద యాత్ర కి ప్లాన్ చేసాడు, అయితే వైఎస్సార్ అనుభవం దృష్ట్యా పార్టిని మించి నాయకులు ఎదగకూడదు అనే ఉద్దేశం తో అప్పటి నుంచి అనుమతులు తప్పని సరి చేసారు. దీనికి తోడు కాంగ్రెస్ లో రేవంత్ కి ఎర్త్ పెట్టేవారి సంఖ్య కూడా పెరిగిందట. డికే అరుణ తో రేవంత్ విభేదాలు తెల్సినవే. రేవంత్ వర్గానికి కూడా తీవ్రం గా అన్యాయం జరుగుతుందని తెలుస్తుంది.
గత నెలలో కర్ణాటక కాంగ్రెస్ నేతలకు హైదరాబాద్ లో క్యాంపు వేసినప్పుడు కూడా అక్కడ రేవంత్ కనపడకపోవటం ఆ వార్తలకు బలం ఇస్తుంది.
ముందు మాచ్ లో 30 బాల్స్ లో సెంచురీ కొట్టిన వాడిని తర్వాత మాచ్ లో బెంచ్ కి పరిమితం చేసినట్టు ఉంది రేవంత్ పరిస్థితి. తెలుగు దేశం కార్యకర్తల బలం మాకు కావాలని తెరాస, కాంగ్రెస్ పోటి పడుతున్న సంగతి తెలిసిందే. తెరాస ని గద్దె దించేందుకు తెలుగు దేశం, కాంగ్రెస్, కోదండరాం పెట్టే కొత్త పార్టి, వామ పక్షాలు కల్సి మహా కూటమి గా ఏర్పడతారని ఒక ప్రచారం సాగుతుంది, అలానే తెరాస, టిడిపి కలిసి పోటి చేస్తారని మరొక ప్రచారం బలంగానే ఉంది . ఈ నేపధ్యం లో స్వేచ్ఛలేని కాంగ్రెస్ లో ఉండే బదులు తెలుగు దేశం లోకి తిరిగి వచ్చేసి పాద యాత్ర చేసి నిస్తేజం గా ఉన్న కాడర్ ని తట్టి లేపి, ఎన్నికలకు సిద్ధం చేస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం కింగ్ మేకర్ అయ్యే చాన్స్ ఉందని రేవంత్ భావన గా ఉందట.
తెలుగు దేశం కి ఎప్పుడు అయినా తెలంగాణాలో 15 నుంచి 20 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, ఆ సీట్ల సంఖ్య మరికొంత పెంచితే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం కీలక శక్తి గా ఎదిగే అవకాశం ఉందని రేవంత్ భావిస్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇదే విషయమై చంద్రబాబు ఇటీవల హైదరాబాద్ వచ్చినపుడు సీఎం నివాసం లో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తుంది.దాదాపు గంట పాటు జరిగిన ఈ సమావేశం వివరాలు “మీడియా లీకులు” గా బయటకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖర్లో రేవంత్ సొంత గూటికి రావటం ఖాయం అని బలం గా చెప్తున్నారు. అయితే ఆయన సంబంధీకులు మాత్రం ఆ భేటీ గురించి నోరు విప్పకపోగా, రాజకీయాలలో ఏమైనా జరగొచ్చు అంటున్నారట. ఇదే నిజం అయితే నిస్తేజంగా ఉన్న తెలంగాణా క్యాడర్ కి సరికొత్త బలం దొరికినట్టే.