(టి. లక్ష్మినారాయణ*)
1. సమ్మిళిత అభివృద్ధిపై గంభీరోపన్యాసాలిచ్చే పాలకులు కరవు పీడిత, అత్యంత వెనుకబడ్డ రాయలసీమ లాంటి ప్రాంతాల పట్ల క్షమించరాని అలసత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు?
ఉపాథి అవకాశాలు లేక లక్షల సంఖ్యలో గల్ఫ్ దేశాలకు, దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రజలు వలసలు వెళుతున్నారు. ఉపాథి కల్పించి, వలసలను నివారించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్న సంకల్పమే ప్రభుత్వాలలో లోపించింది. ప్రజస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలని చెప్పుకోవడానికే గానీ అవి ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషి ఎంత అన్నది హిమాలయ పర్వతం అంత ప్రశ్నగా మిగిలి పోయింది.
2. గడచిన ఆరున్నర దశాబ్ధాలుగా పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాల పర్యవసానంగా రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతంగానే కుమిలి పోతున్నది.
3. రాష్ట్ర విభజనతో అత్యంత తీవ్రంగా నష్ట పోయిన ప్రాంతం రాయలసీమ.
4. బుందేల్ ఖండ్, కాలహండి అభివృద్ధి పథకాల నమూనాలో రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని రూపొందించి అమలు చేస్తామని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి చర్యలు చేపడతామని, పారిశ్రామిక రాయితీలు కల్పిస్తామని విభజన చట్టంలో విస్పష్టంగా పేర్కొన్నారు.
5. విభజన చట్టంలోని అంశాల అమలులో కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి నిస్సిగ్గుగా దగా చేస్తున్నది. ఆ దగా కోరు విధానాల కొనసాగింపులో భాగంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పడం సాధ్యం కాదని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది అత్యంత గర్హనీయమైన చర్య.
6. రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని ఒక దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి, దానికి దాదాపు రు.24,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ప్రకటించింది. ఆ పథకాన్ని ఆమోదించినట్లు గానీ, లేదా, తిరస్కరించినట్లు గానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పినట్లు దాఖలాలు లేవు.
7. దేశ వ్యాపితంగా 150 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి, వాటన్నింటికీ కేటాయించినట్లుగానే ఏడాదికి రు.50 కోట్లు చొప్పున, ఒక్కొక్క జిల్లాకు కేంద్ర వార్షిక బడ్జేట్లలో మూడు సంవత్సరాల పాటు రాయలసీమ – ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు మొత్తంగా రు.1,050 కోట్లు మంజూరు చేశారు. దీన్నే అభివృద్ధి పథకంగా ప్రచారం చేసుకొవడం కంటే నీచమైన చర్య మరొకటి ఉంటుందా?
8. పారిశ్రామికాభివృద్ధికి రాయితీలు ఇచ్చామని గోబుల్స్ ప్రచారం చేస్తున్నారు. కొత్తగా పెట్టే పెట్టుబడులపై 15% అదనపు పన్ను రాయితీ, కొత్త యంత్రాల తరుగుదలపై 15% అదనపు పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి నామమాత్రపు రాయితీలు. వీటి వల్ల పారిశ్రామికవేత్తలు ఆకర్షించబడరు. ఆచరణలో అనుభవం కూడా అదే. రాయలసీమ లాంటి వెనుకబడ్డ ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్దికి సమగ్రమైన ప్రణాళికతో పాటు మూలధన పెట్టుబడులపై 100% ఆదాయపు పన్ను రాయితీ, జి.ఎస్.టి. పరిథిలోని పన్నుల్లో 100% రాయితీ, యంత్రాల తరుగుదలపై పన్ను రాయితీలను కల్పించి, ప్రోత్సహించినప్పుడే పెట్టుబడులను ఆకర్షించడం సాధ్యపడుతుంది. ఆ వైపున కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించడం లేదు.
9. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి సామాజిక, ఆర్థికాభివృద్ధి దృక్పథంతో రాజకీయ సంకల్పం ముఖ్యమైనది. ప్రభుత్వ రంగంలోని “స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) ఆధ్వర్యంలో నెలకొల్పడానికి అవసరమైన కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పూనుకొన్నప్పుడే సాధ్యమవుతుంది. సెయిల్ తో పాటు నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్(ఎన్.యం.డి.సి.)ల సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి ప్రోత్సహించాలి. కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా పన్ను రాయితీలు ఇవ్వడంతో పాటు మూలధన పెట్టుబడిని కూడా సమకూర్చాలి. అప్పుడే వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెకొల్పాలన్న ప్రజల డిమాండ్ నెరవేరుతుంది.
10. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే అంశంపై సాధ్యాసాధ్యాలను ఆరు మాసాల్లోపు అధ్యయనం చేయాలని మాత్రమే విభజన చట్టంలో పేర్కొనబడిందని, అధ్యయన నివేదిక ప్రతికూలంగా ఉన్నదని, కాబట్టి ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడమంటే వెనుకబడ్డ రాయలసీమ ప్రజానీకాన్ని దగా చేయడమే.
11. దశాబ్ధం క్రితమే కడప జిల్లాలో ప్రయివేటు రంగంలో ‘బ్రాహ్మణీ స్టీల్స్’ నెలకొల్పడానికి గాలి జనార్ధన్ రెడ్డి కంపెనీకి అనుమతులు మంజూరు చేసి, దాదాపు 14,000 ఎకరాల ప్రభుత్వ బంజరు, అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రపు ధరకు కేటాయించింది. పొరుగునున్న బళ్ళారి జిల్లాలోని ఇనుప ఖనిజంతో పాటు అనంతపురం, కర్నూలు, కడప, తొజిల్లాలలో నిక్షిప్తమై ఉన్న ఇనుప ఖనిజం ఆధారంగా ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి కొంత పని కూడా జరిగింది. ఒక వైపున పరిశ్రమ నిర్మాణానికి చర్యలు చేపడుతూనే ఇనుప ఖనిజం అక్రమ త్రవ్వకాలకు, అక్రమ రవాణా, అక్రమ ఎగుమతుల ద్వారా భారీ ఆర్థిక కుంభకోణానికి గాలి జనార్ధన్ రెడ్డి పాల్పడి, జైలు పాలయ్యారు.
ఉక్కు పరిశ్రమ నిర్మాణంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు, ప్రభుత్వం కేటాయించిన భూములను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం వగైరా అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకొని అనుమతులను రద్దు చేసి, భూములను వాపస్ తీసుకొన్నది. దాంతో బ్రాహ్మణీ స్టీల్స్ నిర్మాణం ఆగి పోయింది. ఈ పూర్వరంగంలో ‘సెయిల్’ దాన్ని తీసుకొని, పరిశ్రమ నిర్మాణానికి ముందు కొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందించినట్లు వార్తలూ వచ్చాయి. ఈ తంతు నడుస్తుండగానే రాష్ట్ర విభజన జరిగి పోయింది. విభజన చట్టంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం అంశాన్ని పొందు పరచారు. రాయలసీమ ప్రజానీకంలో కాస్త ఆశలు చిగురించాయి. ఆ ఆశలను అడియాశలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దగాకోరు విధానాన్ని అమలు చేస్తున్నది.
12. ప్రయివేటు రంగంలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ‘ఫీజిబిలిటీ’ ఉన్నదని దశాబ్ధం క్రితమే ప్రభుత్వం అనుమతించిన చోటే ప్రభుత్వ రంగంలో కర్మాగారం నిర్మాణానికి ‘ఫీజిబిలిటీ, వయబిలిటీ’ లేవన్న కథలు వినిపించడం ద్వారా కడప ఉక్కు కర్మాగారానికి ఎగ నామం పెట్టే ఆలోచన చేయడం దగా కాకపోతే ఏమౌతుంది?
13. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో కర్మాగారం నెలకొల్పడం ఆర్థికంగా ప్రయోజనకరం కాదన్న అభిప్రాయాన్ని తెలియజేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించి, విభజన చట్టంలోని హామీని అటకెక్కించే ప్రయత్నం చేస్తే ప్రజలు ఆందోళనకు పూనుకొన్నారు. దాంతో కాస్తా వెనకడుగు వేసినట్లు నటించి, మెకాన్ సంస్థతో అధ్యయనం చేయిస్తున్నామని, కర్మాగారాన్ని నెలకొల్పుతామని, త్వరలో శంకుస్థాపన కూడా జరుగుతుందన్నంత స్థాయిలో బిజెపి నాయకులు కబుర్లు చెప్పారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్పింది.
14. చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద డా.మన్మోహన్ సింగ్ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన బి.హెచ్.ఇ.యల్. మరియు ఎన్.టి.పి.సి. సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ పరికరాల ఉత్ఫత్తి కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం అటకెక్కించింది.
15. మూడు దశాబ్ధాల క్రితం రేణిగుంట వద్ద నెలకొల్పబడ్డ రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ మినహా కేంద్ర ప్రభుత్వ రంగంలో ఒక్క పరిశ్రమ రాయలసీమ ప్రాంతంలో లేదు. అది కూడా వెయ్యి మందికి లోపే ఉపాథి కల్పిస్తున్నది. దాని అభివృద్ధిలో కూడా ఎదుగూ బొదుగూ లేదు.
16. వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధి పట్ల అత్యంత బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధిని గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.
*రచయిత టి.లక్ష్మీనారాయణ,ప్రముఖ రాజీకీయ సామాజికాంశాల విశ్లేషకుడు