కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాపై సీరియస్ గా దృష్టి సారించారు. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టే దిశగా ఆమె కసరత్తు చేస్తున్నారు. అధికార టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులకు గాలమేసే పనిలో ఉన్నట్లు జిల్లాలో చర్చ సాగుతున్నది. రానున్న ఎన్నికల్లో రేణుకా చౌదరి ఎంపిగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారన్న వార్తలు బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
తాజాగా అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం మున్సిపల్ కార్పోరేటర్ తోట రామారావు నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లారు. ఆయనతో సమావేశమయ్యారు. నగరానికి చెందిన మున్నూరు కాపు ప్రముఖులు అనేకమంది ఈ సమావేశానికి హాజరయ్యారు.
అయితే ఈ భేటీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తోట రామారావు త్వరలోనే అధికార పార్టీకి గుడ్ బై చెప్ప కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. కానీ దీన్ని తోట రామారావు తోసిపుచ్చారు. తన కుటుంబంలో జరిగిన వివాహ శుభ కార్యక్రమాలకు రేణుకా చౌదరి హాజరు కాలేకపోయారని, పిల్లలకు అక్షింతలు వేయడానికి వచ్చారని తోట రామారావు చెప్పారు.
అయితే రేణుకా చౌదరి తీరు చూస్తే కచ్చితంగా రామారావు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని ఖమ్మం రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.