ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న…ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెత మనందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారశైలి కూడా సేమ్ టూ సేమ్ అలాగే ఉందని చెప్పుకోవచ్చు. తమ జీతాలను పెంచనందును నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీస్‌పై గురువారం కేసీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేసిన తీరు విస్మయానికి గుర్తిచేస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల పోరాటాన్ని గుర్తించిన కేసీఆర్, తెలంగాణ అంటే నాలుగు కోట్ల మంది ప్రజలని, 53 వేల మంది ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదని వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరం. సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల నుంచి తీసివేస్తామని, ఉద్యోగాలు పొగోట్టుకోదలచిన కార్మికులు మాత్రమే సమ్మెకు దిగాలని కూడా కేసిఆర్ బెదిరింపులకు దిగారు. సమ్మెకు వెళితే తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మె అవుతుందంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు నిజంగా బాధాకరం. సమ్మె అంటూ జరిగితే ఆర్టీసి మూసేస్తామని హెచ్చరికలు జారీ చేశారు కూడా.
ఉద్యోగులంటే తనకు ప్రాణమని ఇటీవల కొత్త వేతన సవరణ కమిషన్ ఏర్పాటు సందర్భంగా ప్రగల్భాలు పలికిన కేసీఆర్, సమ్మెకు దిగితే ఉద్యోగాలు పీకేస్తానని హెచ్చరించడం షాకింగ్ గా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల త్యాగఫలం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. తమ ఉద్యోగాలను కూడా ఫణంగా పెట్టి ఉద్యమం కోసం తమ రక్తాన్ని,చెమటను దారబోశారు ఆర్టీసీ కార్మికులు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సకల జనుల సమ్మెను తెలంగాణ ప్రజానీకం ఎప్పటికీ మర్చిపోలేదు..ఈ సమ్మె తెలంగాణ ఉద్యమ స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. సకల జనుల సమ్మెలో పాల్గొని జీతాలు లేకుండా పస్తులుండి మడమ తిప్పని పోరాటం చేసిన చరిత్ర ఆర్టీసీ ఉద్యోగులది. ఇప్పటి కేసీఆర్ తీరు చూస్తుంటే అప్పటి ఆర్టీసీ కార్మికుల త్యాగఫలాన్ని మర్చిపోయారా అనే అనుమానం కలుగుతోంది.బస్సు చక్రం తిరగొద్దు, బడిగంట, గుడిగంట మోగొద్దు, బల్బు వెలగొద్దు అంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపుతోనే ఉద్యోగులందరూ 42 రోజుల పాటు ప్రభుత్వ కార్యకలాపాలన్ని స్తంభింపచేసి సకల జనుల సమ్మెకు దిగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడంలో సకల జనుల సమ్మె ఎంతో కీలక పాత్ర పోషించింది.
అయితే కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక క్యాజువల్ లీవ్‌గా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగస్తులకు స్పెషల్ ఫిట్‌మెంట్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై ప్రేమ ఒకలబోసిన కేసీఆర్, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులపై కఠినంగా వ్యవహారించడమే ఆశ్చర్యకరం. దేశంలో ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ జీతాలు ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని కేసీఆర్ చెబుతున్నారు. ఆర్టీసీ ఏటా రూ. 700 కోట్ల నష్టాలతో నడుస్తుంటే, జీతాలు ఎలా పెంచుతామనేది ఆయన వాదన.కానీ ఆర్టీసీ నష్టాలకు కార్మికులదేనా బాధ్యత. ప్రభుత్వ రంగ సంస్ధ అయిన ఆర్టీసీకి ఏటా ప్రభుత్వం ఖర్చు పెట్టెదెంత. డిజిల్ ధర పెంపు వల్ల ఆర్టీసీపై కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. డిజిల్‌పై ప్రభుత్వం వేసే ట్యాక్స్లు,వ్యాట్‌ల నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇస్తే ఆర్టీసీ కొద్దిగా లాభాల్లోకి వస్తుంది కదా.
తెలంగాణ ధనిక రాష్ట్రమని గ్లోబల్ ప్రచారం చేసుకునే కేసీఆర్, ఆర్టీసీ నష్టాల్లో ఉంటే ఎందుకు చర్యలు తీసుకోరనేది ఇప్పుడు అందరి నుంచి వస్తున్న ప్రశ్న. బడ్జెట్‌లో ఆర్టీసీకి ప్రత్యేక నిధులు ఎందుకు కేటాయించరు. అన్ని రాష్ట్రాలు ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాయి. మరి సంపన్న రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్. ఆ విధంగా ఎందుకు కేటాయించరు. ఆర్టీసీ నష్టాల్లో ఉందంటే అది ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుంది. మరి ప్రభుత్వ వైఫల్యాన్ని కార్మికుల మీద వేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనే అనుమానం కూడా కలుగుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఉద్యోగుల పట్ల కేసీఆర్ వ్యవహారించిన వైఖరి విమర్శలకు దారితీస్తుంది. ముందు ముందు కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల ఇలాగే వ్యవహారిస్తారా.. లేదా వారి డిమాండ్లకు తలోగ్గుతారా అనేది వేచి చూడాలి.
*రచయిత : లేళ్ల వెంకట్రావు. జర్నలిస్ట్. హైదరాబాద్.