ఆర్టీసిలో సమ్మె చేస్తే ఇదే చివరి సమ్మె అవుతుందని తెలంగాణ సిఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్టీసి మజ్దూర్ యూనియన్ గట్టిగానే రియాక్ట్ అయింది. కేసిఆర్ బెదిరింపులకు భయడపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇదే చివరి సమ్మె కావాలని, ఈ సమ్మె ద్వారా తమ సమస్యలన్నీ పరిష్కారం కావాలని ఆర్టీసి కార్మికులు కూడా కోరుతున్నారని టిఎంయు నేత అశ్వథ్తామరెడ్డి అన్నారు. సచివాలయంలో ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పట్నం మహేందర్ రెడ్డితో ఆర్టీసి కార్మికు నేతలు చర్చలు జరిపారు. చర్చల అనంతరం మీడియాపాయింట్ లో అశ్వథ్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. రేపు మధ్యాహ్నం వరకు సమ్మె పై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసిలో సమ్మెపై నిషేధం ఉంది కదా? అలాంటప్పుడు సమ్మె ఎలా చేస్తారని కేసిఆర్ ప్రశ్నించిన విషయంపై ఆర్టీసి కార్మిక నేతలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ రాకముందు సకలజనుల సమ్మె సమయంలో కూడా ఆర్టీసిలో సమ్మె నిషేధం అమలులో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పడు ఆ నిషేధాన్ని లెక్కచేయకుండా సమ్మె చేయడంతోనే తెలంగాణ వచ్చింది కదా అని ప్రశ్నించారు. 14 ఎఫ్ రద్దు సమయంలో సమ్మె చేసినప్పుడు కూడా సమ్మె నిషేధం అమలులో ఉందన్నరు. అప్పుడు కూడా సమ్మె నిషేధాన్న లెక్కచేయకుండా సమ్మె చేశామన్నారు. ఇవాళేదో కొత్తగా సమ్మె నిషేధం ఉన్నట్లు సిఎం కేసిఆర్ మాట్లాడడం సరికాదన్నారు.
తమ సంఘం గౌరవాధ్యక్షులు హరీష్ రావుకు అన్ని విషయాల్లో సమాచారం ఇచ్చే తాము నడుచుకుంటున్నామన్నారు. ఇవాళ మంత్రితో చర్చల సమయంలోనూ తాము హరీష్ రావుకు మెసేజ్ పెట్టి వచ్చామన్నారు. ఆర్టీసికి రావాల్సిన 1529 కోట్లు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ సొమ్మును ఆర్టీసికి తీసుకురావడంలో ఆర్టీసి అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. అధికారులకు అధికారాలు లేనే లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ళపాటు ఆర్టీసిని తమకు అప్పగిస్తే లాభాల్లో నడిపిస్తామని సవాల్ చేశారు.