ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డేంజర్ జోన్లో ఉన్నారా.. ? పని తీరు మార్చుకోవాలని ఆయనకు సీఎం కేసీఆర్ నుంచి వార్నింగ్ వచ్చిందా..? 2019 ఎన్నికల్లో మంత్రి జగదీష్ భవితవ్యం ఏమిటీ..? సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ జిల్లాలో రాజకీయంగా ఈ అంశాలు జోరుగా చర్చనీయాంశమయ్యాయి.
దక్షిణ తెలంగాణలోని పలువురు ఎమ్మెల్యేల తోపాటు ఇద్దరు మంత్రుల పనితీరు బాగా లేదని నిఘా వర్గాలు సీఎంకు నివేదిక ఇచ్చాయి. ఎమ్మెల్యేల సంగతి అటుంచితే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అధికార పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి పనితీరు బాగా లేదని ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గత ఎన్నికల్లో కేవలం 2 వేల పైచిలుకు ఓట్లతోనే గెలిచారు.
ఈ నాలుగేళ్లలో మంత్రి నియోజకవర్గం పై పట్టు సాధించలేదని పార్టీలో టాక్ నడుస్తోంది. అభివృద్ధి పనులకు నిధులు తీసుకొస్తున్నా.. దీనిపై ఆయన తప్ప, ఆయన తరఫున గట్టిగా ప్రచారం చేసే ప్రజాప్రతినిధి సూర్యాపేట నియోజకవర్గం లో లేడు. ఇక నియోజకవర్గానికి గుండె కాయ అయిన మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీనే జెండా ఎగుర వేసింది. కానీ మునిసిపల్ చైర్మన్, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. దీన్ని నివారిన్చేందుకు మంత్రి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని చెబుతున్నారు.
ఇటీవల బడుగుల లింగయ్య యాదవ్ కు రాజ్య సభ సీటు ఇప్పించడంలో మంత్రి సఫలీకృతుడయ్యారు. అయితే తాము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా నామినేటెడ్ పోస్టులు ఇప్పించలేదని ఆయన్ను అంటి పెట్టుకొని ఉన్న నేతలు గుర్రుగా ఉన్నారు. ఇటీవల నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి ప్రభుత్వ భూమి ఉన్నా, తన బంధువులు, ముఖ్య అనుచర నేతలతో ప్రైవేట్ గా భూమి కొనుగోలు చేయించి .. ఈ భూమిని కలెక్టరేట్ నిర్మాణానికి అనువైన స్థలంగా గుర్తించాలంటూ అధికారులపై ఒత్తిడి తెప్పించినట్లు ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు బలమైన ఆరోపణలు చేసినా మంత్రికి బాసటగా నిలిచి వీటిని తిప్పి కొట్టడంలో ఆయన వద్ద వాక్చాతుర్యం ఉన్న నేతలు లేరన్న చర్చ ఉంది. ఇలా పలు కారణాలను పేర్కొంటూ నిఘావర్గాలు సీఎం కు మంత్రి పై నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
ఇక జగదీష్ రెడ్డి పుట్టి పెరిగిన నాగారం గ్రామానికి చెందిన సర్పంచ్ ఇటీవల టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయంలో సర్పంచ్ ను పార్టీ మారకుండా మంత్రి జగదీష్ రెడ్డి నిలువరించలేకపోయారన్న విమర్శ ఉంది. మంత్రి స్వగ్రామంలోనే ఆయన ఎదురీదుతున్నవేళ నియోజకవర్గంలో జిల్లాలో ఆయన ప్రతిష్ట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని నల్లగొండ పట్టణానికి చెందిన ఒక టిఆర్ఎస్ నేత (ఇటీవల టిఆర్ఎస్ లో చేరిన నాయకుడు) వెల్లడించారు.
అసలే ఎన్నికలు దగ్గరపడడంతో సూర్యాపేట నియోజకవర్గంలో నెలకొన్న ఈ గ్యాప్ ను జగదీష్ రెడ్డి ఎప్పటిలోగా ఫిలప్ చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.