కేసిఆర్ కు కాక పుట్టిస్తున్న హరీష్ మనుషులు

టిఆర్ఎస్ లో కేసిఆర్.. హరీష్ బంధం ఎటువంటిది? అని ఎవరినడిగినా చెప్పే సమాధానం.. ‘‘మామ మాట జవదాటని అల్లుడు’’ అంటారు. టిఆర్ఎస్ పుట్టుక నుంచి నేడు అధికార పార్టీ హోదా కలిగేంతవరకు హరీష్ రావు అలాగే నడుచుకున్నారు. ఇప్పటికీ అలాగే నడుచుకుంటున్నారు. 2009 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటి సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని బొకే ఇచ్చి కలిశారు. ఆ విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే పార్టీ ఎంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలోనూ హరీష్ రావు మామ కేసిఆర్ గీసిన గీత దాటలేదు.

తెలంగాణ ఏర్పాటు, తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలంలో కాంగ్రెస్ నేతలు హరీష్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడంటూ లీకులు ఇచ్చారు. కానీ హరీష్ వాటన్నింటినీ గట్టిగానే తిప్పికొట్టారు. అయితే ఇటీవల కాలంలో హరీష్ రావు మనుషులుగా ముద్రపడిన వారు కొందరు తెలంగాణ సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించారన్న ప్రచారం ఉంది. వారిలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు అశ్వథ్థామరెడ్డి, థామస్ రెడ్డి. వీళ్లు ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి గుర్తింపు పొందిన ఆర్టీసికి చెందిన మజ్దూర్ యూనియన్ ను చీల్చి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఏర్పాటు చేశారు. తర్వాత తెలంగాణ స్వ రాష్ట్రంలో ఆర్టీసికి జరిగిన ఎన్నికల్లో వీరి సంఘం గుర్తింపు పొందింది. రెండుసార్లు వీరే గెలుపొందారు. అయితే ఆర్టీసి కార్మికులు ప్రస్తుతం సమ్మెబాట పడుతున్నారు. ఈనెల 11 నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసి కార్మికులు ప్రకటించారు. గత నెలలోనే సమ్మెనోటీసు కూడా ఇచ్చారు. అయితే సమ్మెలో అధికార టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ పాల్గొంటున్నది. ఇది సర్కారుకు ఏమాత్రం రుచించడంలేదు. ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ లాంటి సంఘాలు సమ్మె చేస్తే సర్కారుకు పెద్దగా బాధ ఉండదు. కానీ సొంత సంఘంగా పేరున్న టిఎంయు సమ్మెబాట పట్టడం తెలంగాణ సర్కారుకు చిరాకు తెప్పస్తున్నది.

అయితే మొన్న జరిగిన ధర్నాలో టిఎంయు నేతలు సర్కారుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రగతిభవన్ ముట్టడించే వరకు పరిస్థితి రానీయొద్దని హెచ్చరించారు. టిఎంయు సంఘం నేతలు మంత్రి హరీష్ రావుకు సన్నిహితంగా ఉంటారు. ఈ సంఘానికి గౌరవాధ్యక్షులుగా హరీష్ రావే ఉన్నారు. ఆర్టీసి సమ్మె విషయంలో సిఎం కేసిఆర్ కూడా చాలా ఘాటుగానే మాట్లాడారు. సమ్మె చేస్తే మంచిదే కానీ.. అటనుంచి అటే ఇంటికే పోవాల్సి వస్తే అని కేసిఆర్ కార్మిక సంఘాలకు హెచ్చరికలు జారీ చేశారు. హరీష్ మనుషులే సమ్మెకు దిగడం తెలంగాణ సర్కారుకు తలనొప్పిగా మారిందంటున్నారు. అయితే ఇందులో కార్మికుల ప్రయోజనాలే తప్ప హరీష్ రావుకు ఈ సమ్మెకు ఎలాంటి సంబంధం లేదని కార్మిక సంఘం నేతలు చెబుతున్నారు. టిఎంయు నేతల ధర్నా వార్త కింద లింక్ లో ఉంది చదవండి.

https://trendingtelugunews.com/rtc-tmu-workers-warns-kcr-government/

ఇక మరో విషయం కూడా ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడిచింది. మంత్రి హరీష్ రావు పిఆర్ఓ గా ఉన్న సీనియర్ జర్నలిస్టు ఎస్కే జకీర్ రాసిన ఒక ఆర్టికల్ కూడా తెలంగాణ సర్కారుకు తలనొప్పి తెచ్చిపెట్టిందన్న చర్చ ఉంది. ఒక పత్రికలో జకీర్ ‘‘ప్రభుత్వం సంగతి సరే.. పార్టీ మాటేమిటి?’’ అంటూ ఒక ఎడిట్ పేజీ ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ టిఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టేలా ఉందని చెబుతున్నారు. అయితే ఈ ఆర్టికల్ కు హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తన వద్ద పనిచేసే పిఆర్ఓ ఇలాంటి ఆర్టికల్ రాసి పార్టీని ఇరకాటంలోకి నెట్టాడని పార్టీలో టాక్ నడుస్తోంది. ఈ ఆర్టికల్ రావడంలో మంత్రి హరీష్ ప్రమేయం ఉందన్న గుసగుసలు అవతలి వర్గం నుంచి  వినిపించాయి. అవి హరీష్ రావు చెవిన పడ్డాయి. దీంతో ఈ వివాదం ముదరకముందే హరీష్ రావు తెలివిగా తన వద్ద పనిచేస్తున్న పిఆర్ఓ జకీర్ ను ఉద్యోగంలోంచి తొలగించారని అంటున్నారు.

ఇటీవల కాలంలో మంత్రి హరీష్ రావుకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆయన మనుషులు సర్కారును ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ మాత్రం టిఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *