ఇంతవరకు మగవాళ్లకు ఎవరికీ రాని ఆలోచన ఫైర్ బ్రాండ్ పొలిటిషియన్ నన్నపనేని రాజకుమారికి వచ్చింది. మగవాళ్లకూ రక్షణ కావాలని ఒక్క మొగోడు కోరలేదు. అలాంటి ఆలోచన కూడా రానంత దుర్భరంగా మగజాతి బతుకుతూ ఉంది. ఆందుకే మగవాళ్లకూ ఒక కమిషన్ ఉండాలని అపుడే వాళ్ల హక్కులకు రక్షణ ఉంటుందని ఆమె అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, మగవాళ్ల భద్రత కోసం కొన్ని టివిసీిరియళ్లను బ్యాన్ చేయాలని కూడా ఆమె వాదిస్తున్నారు.
మహిళల కోసం మహిళా కమిషన్ ఉన్నట్లే పురుషుల రక్షణ కోసం పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని ఎపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు.
సీరియళ్లు చూసి మహిళలు దారుణాలకు తెగబడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీరియళ్లు చూసేవాళ్లది తప్పే.. తీసేవాళ్లది తప్పే అన్నారు. సీరియళ్లలో భర్తను చంపడం చూపిస్తున్నారని, అత్తను చంపడం చూపిస్తున్నారని, మామను చంపడం చూపిస్తున్నారని ఆమె అని ఆవేదన వ్యక్తం చేశారు. సీరియళ్లను చూసి మహిళలు ఫాలో అవుతున్నారని ఆమె ఆరోపించారు.
తక్షణమే సీరియళ్లను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఉత్తరాంధ్రలో ఒక భార్య చేతిలో హతమైన భర్త మృతికి తాను సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. అలాగే సీరియళ్ల ప్రభావంతో మరో వ్యక్తిపై అతని భార్య హత్యాప్రయత్నం చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.
మహిళా కమిషన్ మాదిరిగానే పురుషులకు కూడా పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.
నాకు నవ్వు రాట్లేదు : నన్నపనేని
పురుషులకు పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని మీడియా సమావేశంలో నన్నపనేని మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న మీడియా వారు పెద్దగా నవ్వారు. దీంతో నన్నపనేని మీడియా వాళ్లను ఉద్దేశించి గుర్రుగా చూశారు. మీకు నవ్వొస్తుంది. నాకు నవ్వు రావడంలేదు. నాకు బాధ ఉంది. ఆవేదన ఉంది అని కామెంట్ చేశారు.
మొత్తానికి ఆంధ్రా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న నన్నపనేని రాజకుమారి పురుష కమిషన్ డిమాండ్ తో కొత్త చర్చను రగిలించారని చెప్పవచ్చు.